GOA POLITICS: గోవాలో రసవత్తరంగా రాజకీయం.. ఫిరాయింపులతో భీతిల్లుతున్న ప్రధాన పార్టీలు..కానీ బీజేపీలో ‘అదే‘ ధీమా!

ఆ రాష్ట్రం చూడడానికి చిన్నదే... కానీ రాజకీయాల్లో మాత్రం తరచూ నానుతూనే వుంటుంది. సుదీర్ఘకాలం పరాయి పాలనలో వున్న కారణంగా...

GOA POLITICS: గోవాలో రసవత్తరంగా రాజకీయం.. ఫిరాయింపులతో భీతిల్లుతున్న ప్రధాన పార్టీలు..కానీ బీజేపీలో ‘అదే‘ ధీమా!
Flags
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jan 31, 2022 | 4:07 PM

GOA POLITICS BECOMING INTERESTING WITH POLITICAL JUMPING-JAPANGS: ఆ రాష్ట్రం చూడడానికి చిన్నదే… కానీ రాజకీయాల్లో మాత్రం తరచూ నానుతూనే వుంటుంది. సుదీర్ఘకాలం పరాయి పాలనలో వున్న కారణంగా ఇంకా పాశ్చాత్య సంస్కృతి కాసింత ఎక్కువగానే కనిపించే గోవాలో ఇపుడు పార్టీ ఫిరాయింపుల పర్వం జోరుగా కొనసాగుతోంది. రాష్ట్రం హోదా పొందిన తర్వాత జరిగిన దాదాపు అన్ని అసెంబ్లీ ఎన్నికల్లోను బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్యనే ప్రధాన పోటీగా వున్నది గోవాలో. మనోహర్ పారికర్ అనే అజాత శతృవు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వున్నప్పుడు బీజేపీ చాలా బలంగా వుండేది. ముఖ్యమంత్రిగా ఎన్నో ఏళ్ళు పని చేసిన మనోహర్ పారికర్.. చాలా నిరాడంబర జీవితాన్ని గడపడం పలువురిని ఆలోచింపచేయడమే గోవాలో బీజేపీ పునాదులు బలపడడానికి కారణమైందని రాజకీయ విశ్లేషకులు భావిస్తారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించేందుకు మనోహర్ పారీకర్ తన పాతకాలపు స్కూటర్‌పై గోవా రాజధాని పానాజీ (పంజిమ్ అని కూడా అంటారు) సిటీ రోడ్లపై ప్రయాణం చేసిన దృశ్యాలు ఆ కాలంలో విధులు నిర్వహించిన జర్నలిస్టులకు చాలా మందికి ఇప్పటికీ కళ్ళలో మెదులుతాయి. అయితే.. మనోహర్ పారీకర్ జాతీయ స్థాయి రాజకీయాల్లోకి వెళ్ళడం, కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించడం మొదలు పెట్టాక గోవాలో బీజేపీకి పట్టు తప్పిందనే చెప్పాలి. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్లుగా ఫలితాలను పొందుతూ వచ్చాయి. గత ఎన్నికల్లో (2017) అయితే.. 40 మంది సభ్యులున్న గోవా అసెంబ్లీలో బీజేపీ కేవలం 13 సీట్లనే గెలుపొందింది. కాంగ్రెస్ పార్టీ 17, దాని మిత్ర పక్షం ఎన్సీపీ మరో స్థానాన్ని గెలుచుకున్నాయి. అయితేనేం.. బీజేపీ అధినాయకత్వం జరిపిన మంత్రాంగంతో గోవాలో బీజేపీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

అయిదేళ్ళ కాలగమనంలో గోవా అసెంబ్లీకి మరోసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈసారి బీజేపీ, కాంగ్రెస్‌లతోపాటు జాతీయ స్థాయికి ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కూడా గోవా ఎన్నికల బరిలో నిలిచాయి. నిజానికి పశ్చిమ బెంగాల్లో రెండోసారి సాధించిన విజయోత్సాహంతో మమతాబెనర్జీ.. గోవాలో పాగా వేస్తామన్న స్థాయిలో దూకుడు చూపించారు. కానీ తీరా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యే సరికి టీఎంసీకి బరిలో నిలిపేందుకు గెలుపు గుర్రాలే కరువయ్యాయి. అభ్యర్థులే దొరకని పరిస్థితి తలెత్తింది. గోవాలోను బీజేపీని మట్టికరిపిస్తానని పలికిన టీఎంసీ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ క్రమంగా సైలెంటయ్యారు. సొంతక్యాడర్‌ని రూపొందించుకునే సమయంలో లేకపోవడంతో మిగిలిన రాజకీయ పక్షాల్లోని బలమైన నేతలను ఆకర్షించి.. గోవాలో పాగా వేయాలని చూసిన దీదీ వ్యూహం బెడిసి కొట్టింది. మరోవైపు గత ఎన్నికల్లో ఒక్క సీటు గెలుచుకోలేకపోయిన ఆప్.. కరోనా కష్ట కాలాన్ని వాడుకుని గోవాలో ప్రజల ఆదరణ పొందేందుకు ప్రయత్నించింది. కరోనా లాక్డౌన్ సమయంలో పేద తరగతి వారికి పెద్ద ఎత్తున ఆహారాన్ని పంపిణీ చేయించారు ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఈ సేవాకార్యక్రమాలను ఆప్ సోషల్ మీడియా విభాగం బాగానే ప్రచారం చేసుకుంది. దానికి తగినట్లుగానే ఆప్ పార్టీకి గోవాలో క్యాడర్ డెవలప్ అయ్యింది కూడా. కాకపోతే.. ఎన్నికల్లో పోటీ చేస్తూ.. విజయం సాధించే వ్యూహాలు పన్నగల స్థాయిలో నేతలు ఎదగలేదు. దాంతో టీఎంసీ లాగానే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇతర పార్టీల్లో పేరున్న నేతలను చేర్చుకోవడం మొదలెట్టి… ఆపరేషన్ ఆకర్ష్‌లో ఇతర పార్టీలకు తమకు పెద్ద తేడా లేదన్న అపవాదు మూటగట్టుకుంది. కేంద్రంలోను, రాష్ట్రంలోను అధికారంలో వున్న బీజేపీ వ్యూహాలు.. కొత్తగా పాగా వేసేందుకు టీఎంసీ, ఆప్ పార్టీల ఎత్తుగడలు వెరసి గత నాలుగైదు నెలలుగా గోవాలో ఆయారామ్‌ గయారామ్‌ల సంఖ్యను అమాంతం పెంచేసింది.

కాంగ్రెస్ పార్టీలో వున్న కీలక నేత అలెక్సో లారెన్కోను పార్టీలోకి తీసుకోవడం ద్వారా ఆయన్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేస్తూ ఎన్నికలకు వెళ్ళాలని మమతాబెనర్జీ ముందుగా భావించారు. కానీ కారణాలేమైతేనేం.. అలెక్సో పట్టుమని నెల రోజులు కూడా టీఎంసీలో ఇమడలేకపోయారు. తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. దాంతో మాజీ ముఖ్యమంత్రి, గోవా పీసీసీ అధ్యక్షుడు లూయిజినో ఫలేరోను టీఎంసీ ఆకర్షించింది. అయితే.. గోవాలో టీఎంసీ విజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతే.. తన భవిష్యత్తు ఏంటంటూ ఆయన మెలిక పెట్టారు. దాంతో ఆయన్ను టీఎంసీ జాతీయ ఉపాధ్యక్షున్ని చేస్తూ.. గోవా ఎన్నికల తర్వాత రాజ్యసభ సీటు ఇస్తానని దీదీ హామీ ఇవ్వాల్సి వచ్చింది. దానికి ఆయన ఓకే అనడంతో ఫలేరోను ప్రధాన మొఖంగా పెట్టుకుని గోవా ఎన్నికల ఎదుర్కొనేలా మమతా వ్యూహరచన చేశారు. తీరా ఫలేరోకు ఏమాత్రం పట్టులేని పాటోర్దా సీటు నుంచి ఆయన్ని పోటీ చేయమనడంతో ఆయన కినుక వహించారు. కొన్ని రోజులు సైలెంటైపోయారు. మరోసారి దీదీ రంగ ప్రవేశం చేసి.. పాటోర్దా నుంచి వేరే వారు పోటీ చేస్తారని ప్రకటించడంతో ఫలేరో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక గత ఎన్నికల్లో కేవలం 13 సీట్లనే గెలుచుకున్నప్పటికీ తమ వ్యూహంతో అధికారాన్ని సాధించిన బీజేపీకి.. ఈసారి కూడా కఠిన పరిస్థితులే కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రభుత్వ వైఫల్యాలు కమలం పార్టీకి చెమటలు పట్టిస్తున్నాయి. అయితేనేం.. ఎవరు గెలిచినా.. అధికారంలో మేమే వుండాలన్న సూత్రాన్ని పాటిస్తున్న కమలనాథులు.. పైకి ధీమాగానే కనిపిస్తున్నారు.

ఇక పార్టీ ఫిరాయింపులతో తెగ వర్రీ అయిపోతున్న పార్టీ ఏదైనా వుంది అంటే అది కాంగ్రెస్ పార్టీనే. పార్టీని వీడుతున్న నేతలను అదుపు చేయలేక విసుగెత్తిపోయి చతికిలా పడిన కాంగ్రెస్ నాయకత్వం.. చివరికి తమ అభ్యర్థులను దేవాలయాలకు, చర్చిలకు, మసీదులకు పంపి గెలిచినా, ఓడినా పార్టీలోనే వుంటామంటూ ప్రతిఙ్ఞలు చేయించుకుంటోంది. ఇదే విధానాన్ని ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా పాటిస్తోంది. ప్రమాణ పత్రాలపై సంతకాలు చేసిన వారికే బీ-ఫామ్స్ ఇవ్వాలని భావిస్తోంది ఆప్ అధినాయకత్వం. అయితే.. ఈ ప్రమాణ పత్రాలతో ఏ మేరకు ఉపయోగం వుంటుందన్నది ప్రశ్నార్థకమే. నిజానికి గోవాలో నియోజకవర్గాలు ఓటర్ల సంఖ్య దృష్ట్యా చాలా చిన్నవి. ఒక్కో నియోజకవర్గంలో సగటున ముప్పై వేల మంది ఓటర్లు మాత్రమే వుంటారు. దాంతో ఓటర్లను ఆకర్షించేందుకు మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే కాస్త భిన్నంగా గోవా రాజకీయ నాయకులు ప్రవర్తిస్తుంటారు. తమ నియోజకవర్గాలలో కాస్త ఎక్కువగా వున్న వర్గం వారిని మచ్చిక చేసుకోవడం, అందుకోసం వారిళ్ళలో జరిగిన శుభ, అశుభ కార్యాలను మిస్ చేయకుండా చూసుకుంటుండడం.. శుభకార్యాలకు, అశుభ కార్యాలకు ఆర్థిక సాయం చేస్తుండడం ద్వారా తమ నియోజకవర్గం ప్రజలకు దగ్గరవడానికి అక్కడి నాయకులు ప్రయత్నిస్తుంటారు. దాంతో వారు ఏ పార్టీలో వున్నా కూడా ప్రజలు పెద్దగా పట్టించుకోరు. తమకు సాయం చేస్తున్నాడా ? ఫ్యూచర్‌లో చేస్తాడా..? ఈ రెండంశాల ఆధారంగానే గోవా ఓటర్లు తమ ఓటు ఎవరికి వేయాలో తేల్చుకుంటారు. స్థానికంగా వున్న ప్రభుత్వ ఉద్యోగాలను తమకు, తమ వర్గం వారికి ఇప్పిస్తున్నాడా లేదా అన్న అంశం కూడా గోవా ఓటర్లపై బాగానే ప్రభావం చూపుతుంది. కొన్ని నియోజకవర్గాలలో అయితే.. చాలా మంది పిల్లల ప్రైవేటు స్కూళ్ళు, కాలేజీల ఫీజులను చెల్లించడం ద్వారా నాయకులు ఓటర్లకు దగ్గరవుతుంటారు. దాంతో పార్టీలు ముఖ్యం కాదు.. తాము ఓటర్లను ఆకట్టుకునేందుకు అవసరమైన ధనార్జన సాధ్యం కావడమే తమకు ముఖ్యమన్న రీతిలో గోవా నేతలున్నారు. దాంతో పార్టీలు మారేందుకు వారు పెద్దగా వెనుకాడరు. సరిగ్గా ఇదే సూత్రం బీజేపీకి లాభిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2017లో కేవలం 13 సీట్లలో గెలుపొందిన బీజేపీ.. రెండేళ్ళు తిరక్కుండానే గోవాలో చక్రం తిప్పింది. కాంగ్రెస్, మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీల నుంచి ఎమ్మెల్యేలను చేర్చుకుని గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడకుండా చూసుకున్న బీజేపీ.. భవిష్యత్తులో కూడా పార్టీ మారే ఎమ్మెల్యేలు పదవి కోల్పోకుండా తాము అండగా వుంటామన్న సంకేతాల్నిస్తోంది. దాంతో గోవాలో పోలింగ్ తేదీ సమీపిస్తున్నా పార్టీ ఫిరాయింపులు ఆగడం లేదు సరికదా.. ఇంకా పెరిగిపోతూనే వున్నాయి.