గజరాజులను టెన్షన్ పెడుతున్న వైరస్.. దేశవ్యాప్తంగా ‘జూ’ల్లో అప్రమత్తం

Herpes virus claims another elephant life, గజరాజులను టెన్షన్ పెడుతున్న వైరస్.. దేశవ్యాప్తంగా ‘జూ’ల్లో అప్రమత్తం

భువనేశ్వర్‌లో ఉన్న నందన్‌కనన్ జూ పార్క్‌లో మరణ మృదంగం కొనసాగుతోంది. హెర్పస్ వైరస్ బారిన పడ్డ గజాలు ఒక్కొక్కటిగా తనువు చాలిస్తున్నాయి. తాజాగా కమల(7ఏళ్లు) చికిత్స పొందుతూ గురువారం ప్రాణాలు వదిలింది. దీంతో 25 రోజుల వ్యవధిలో హెర్పస్ వైరస్ సోకి మరణించిన గజాల సంఖ్య మూడుకు చేరింది. ఇక ప్రస్తుతం అక్కడ ఐదు ఏనుగులు మాత్రమే ఉండగా.. వాటిలో మరో రెండింటికి ఈ వైరస్ లక్షణాలు ఉన్నాయని జూ డిప్యూటీ డైరక్టర్ జయంత్ దాస్ వెల్లడించారు. వాటిని అజ్జర్వేషన్‌లో పెట్టినట్లు ఆయన తెలిపారు.

కాగా మరోవైపు ఈ వైరస్‌కు ఇంకా మందును కనుగొనలేదని.. ఇప్పటి దాకా వాడిన ఔషధాల వల్ల వాటి ఆరోగ్యం మెరుగుపడలేదని పశు సంవర్ధక శాఖ అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉంటే ఆగష్టులో ఈ జూపార్క్‌లో మొదటి హెర్పస్ కేసు నమోదైంది. ఈ వైరస్ సోకిన జూలీ అనే ఆడ ఏనుగు ఆగష్టు 25న కన్నుమూసింది. ఆ తరువాత సెప్టెంబర్ 15న చందన్ అనే మరో మగ ఏనుగు హెర్పస్ సోకి మృత్యువాతపడింది. దీంతో జూ అధికారుల్లో ఆందోళన పెరుగుతోంది. అలాగే ఈ వార్తతో హైదరాబాద్‌లోని నెహ్రూ జూ పార్క్ సహా.. దేశంలోని మిగిలిన  జూ అధికారులు అప్రమత్తమయ్యారు. తమ వద్ద ఉన్న గజరాజులను రక్షించుకునేందుకు వారు సహాయక చర్యలను ముమ్మరం చేశారు.

హెర్పస్ వైరస్ లక్షణాలు:
అసలు ఈ హెర్పస్ వైరస్ ఏంటి..? దీని లక్షణాలు ఎలా ఉంటాయి..? అనే వివరాల్లోకి వెళ్తే.. ఈ వైరస్ ఎక్కువగా ముఖానికి సోకే అవకాశాలు ఉన్నాయి. దీని వలన శరీరంపై బొబ్బలు, శ్వాసకోశ ఇబ్బందులు, గ్రంధుల వాపు వంటి లక్షణాలు ఉంటాయి. వీటితో పాటు జ్వరం కూడా సోకే అవకాశాలు ఉన్నాయి. అయితే గజరాజుల్లో ఈ వైరస్‌ సోకడం ఇదే మొదటిసారి. ఇదివరకు ఈ లక్షణాలు భారత్‌లో కనిపించలేదు. దీంతో దీనికి విరుగుడు కోసం శాస్త్రవేత్తలు ప్రయోగాలను చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *