Flying Fish: ఈ చేపలకు విసనకర్ర లాంటి రెక్కలు.. పక్షుల్లా గాల్లో దూసుకుపోతున్న వైనం..

Flying Fish: ఈ ప్రపంచం ఒక అద్భుతాల గని.. మనకు తెలియని ఎన్నో వింతలు విశేషాలు ఈ భూమండలంపై దాగి ఉన్నాయి. తాజాగా ఎగిరే చేపగురించి మీకు తెలుసా. చేపలు ఎగరడమేంటి అనుకుంటున్నారా.. నిజం...

Flying Fish: ఈ చేపలకు విసనకర్ర లాంటి రెక్కలు.. పక్షుల్లా గాల్లో దూసుకుపోతున్న వైనం..
Flying Fish
Follow us

|

Updated on: Jan 22, 2022 | 2:23 PM

Flying Fish: ఈ ప్రపంచం ఒక అద్భుతాల గని.. మనకు తెలియని ఎన్నో వింతలు విశేషాలు ఈ భూమండలంపై దాగి ఉన్నాయి. తాజాగా ఎగిరే చేపగురించి మీకు తెలుసా. చేపలు ఎగరడమేంటి అనుకుంటున్నారా.. నిజం.. అదే వాటి ప్రత్యేకత. ఫ్లైయింగ్ ఫిష్‌, ఫ్లైయింగ్‌ కాడ్‌, కొల్లోక్వియల్లి అని దీనికి రకరకాల పేర్లు. ఇవి సముద్రాల్లో పెరుగుతాయి. వీటిలో దాదాపు 64 రకాల జాతులున్నాయి. సాధారణంగా చేపలకు నీటిలో ఈదడానికి వీలుగా పలుచని రెక్కలులాంటివి ఉంటాయి కదా. ఈ చేపలకు మాత్రం విసనకర్ర లాంటి పెద్ద రెక్కలు ఉంటాయి. వాటితోనే ఇవి గాల్లో ఎగురుతాయి. నీటిలో ఉన్నప్పుడు మామూలు చేపల్లాగే ఆ రెక్కలతో ఈదుతాయి.. గాల్లోకి ఎగరగానే… పక్షుల రెక్కలలా పెద్దగా విచ్చుకునేలా చేసుకుంటాయి. ఇలా రెండు రకాలుగా చేస్తూ… ఇవి గాల్లో దూసుకెళ్తాయి. మరీ పక్షుల రేంజ్ లో ఎగరవు కానీ.. కొద్దిపాటి ఎత్తువరకు ఎగరగలవు. అంటే… సముద్ర నీటిలోంచి రాకెట్ లా దూసుకొచ్చి… ఒక్కసారిగా నీటి లోంచీ గాల్లోకి దూసుకెళ్తాయి. ఆ సమయంలో వాటి రెక్కలను పక్షుల రెక్కల లాగా విచ్చుకునేలా చేస్తాయి. కానీ పక్షుల లాగా రెక్కలను పైకీ, కిందకీ ఆడించలేవు. ఒకసారి దూసుకెళ్లినప్పుడు గాల్లో ఎంత దూరం వెళ్లగలవో అంత దూరం వెళ్లి… తర్వాత నీటిలోకి జారుకుంటాయి.

సముద్రంలో తమ శత్రువుల నుంచి తప్పించుకునేందుకు చేసే ప్రయత్నంలో భాగంగానే ఈ చేపలకు గాల్లో ఎగిరేందుకు వీలుగా రెక్కల్లో మార్పులు వచ్చి ఉంటాయని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఈ చేపల్నిచూడాలంటే దక్షిణ అమెరికా పక్కన ఉండే… కరీబియన్ దీవుల్లోని బార్బడోస్‌లో ఎక్కువగా కనిపిస్తాయి. అందుకే ఆ దేశాన్ని ఎగిరే చేపల భూమి అని పిలుస్తారు. అంతేకాదు… ఆ దేశ జాతీయ చిహ్నాల్లో ఈ చేప కూడా ఒకటి. ఈ చేపలు పురాతనమైనవి కూడా. వీటిలో అతి ప్రాచీన చేప శిలాజం… 24 కోట్ల సంవత్సరాల కిందటిదిగా గుర్తించారు. అప్పట్లో ఫ్లైయింగ్ ఫిష్ లకూ… ఇప్పుడు మనం చూసే ఫ్లైయింగ్ ఫిష్ లకూ ఆకారంలో చాలా మార్పులొచ్చాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఏది ఏమైనా పక్షుల్లా దూసుకుపోతున్న ఈ చేపలను చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

Also Read:   గోదావరి జిల్లా స్టైల్లో రుచికరమైన కంద, వంకాయ పులుసు తయారీ..