ఇకపై దేశవ్యాప్తంగా ఎన్‌ఆర్‌సీ అమలు.. గుబులు రేపుతున్న అమిత్‌షా నిర్ణయం

NRC to be introduced throughout country: Amit Shah, ఇకపై దేశవ్యాప్తంగా ఎన్‌ఆర్‌సీ అమలు.. గుబులు రేపుతున్న అమిత్‌షా నిర్ణయం

దేశవ్యాప్తంగా ఎన్ఆర్‌సీ అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. దేశంలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులను ఏరివేసేందుకు కేంద్రం జాతీయ పౌర జాబితాను అమలు చేస్తోంది. ఇప్పటికే అసోంలో దీన్ని చేపట్టి లక్షలాది మంది వలసదారుల్ని గుర్తించింది ప్రభుత్వం. దీంతో ఎన్ఆర్‌సీని దేశవ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తోంది. పొరుగు దేశాలకు వెళ్లి అక్కడ శాశ్వతంగా ఎవరూ నివసించరని.. అటువంటిది మనదేశంలోనే ఎందుకు జరుగుతుందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇతర దేశాలనుంచి భారత్‌కు వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకున్న లక్షలాది మందిని గుర్తించి వారిని వెనక్కి పంపే ఆలోచనలో భాగంగా ఎన్‌ఆర్‌సీని అమలు చేస్తోంది మోదీ సర్కార్.

ఇకపై దేశవ్యాప్తంగా జాతీయ పౌర జాబితాను అమలు చేయనున్నామని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా జార్ఘండ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో స్పష్టం చేశారు. ఇప్పటికే అసోంలో దీన్ని అమలు చేశామని అక్కడ లక్షలాది మంది ఇతర దేశాలకు చెందిన వారు స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నట్టుగా గుర్తించినట్టు చెప్పారు. దేశ వ్యాప్తంగా ఎన్‌ఆర్‌సీని అమలు చేయడానికి తమకు 2019 ఎన్నికల ఫలితాల ద్వారా దేశ ప్రజలే తమకు ఆమోదం తెలిపారంటూ అమిత్‌షా వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఇదే విషయాన్ని మేనిఫెస్టోలో చెప్పామని, ప్రజలంతా దీన్ని అంగీకరించారని ఆయన తెలిపారు. ఎన్‌ఆర్‌సీ అనేది కేవలం అసోం రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాలేదని, దాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు తామ ప్రయత్నిస్తున్నామన్నారు. అసోం రాష్ట్రంలో జరిగిన పౌర జాబితాలో చోటు లేనివారు ఫారినర్స్ ట్రిబ్యునల్‌కు వెళ్లవచ్చని, అందుకు ఫీజు చెల్లించే స్థోమత లేని వారికి ప్రభుత్వమే ఫీజు చెల్లించి లాయర్లను ఏర్పాటు చేస్తుందన్నారు. మన దేశంలో అసలు భారతీయులు ఎవరన్నది తెలియాలంటే ఎన్‌ఆర్‌సీ అమలు జరపాల్సిందేనన్నారు హోం మంత్రి.

ఇప్పటికే హైదరాబాద్‌లో కూడా ఎన్‌ఆర్‌సీ అమలు చేయాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ నగరంలో ఎంతోమంది అక్రమంగా నివసిస్తున్నారని, వీసా గడువు ముగిసినా ఇంకా ఇక్కడే ఉంటున్నారని రాజాసింగ్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఎన్‌ఆర్‌సీ దేశవ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తే హైదరాబాద్‌లో కూడా త్వరలోనే దీన్ని అమలు చేసే అవకాశాలున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *