మృతదేహాం పట్ల అమానుషం.. కరోనా అనుమానంతో సహకరించని గ్రామస్తులు

కరోనా మహమ్మారి వచ్చి కన్నవాళ్ళని, కట్టుకున్న వాళ్లని కాటికి పంపేస్తుంటే చివరి చూపులకు నోచుకోక కుమిలి కుమిలి ఏడుస్తున్న కుటుంబాలెన్నో. అయిన వారి అంతిమ సంస్కారాలకు కూడా నోచుకోని దయనీయ స్థితి. ఇలాంటి పరిస్థితుల్లో సాధారణ చావును కూడా కరోనా మరణంగా భావిస్తూ ఒంటరిని చేస్తున్నారు.

మృతదేహాం పట్ల అమానుషం.. కరోనా అనుమానంతో సహకరించని గ్రామస్తులు
Follow us

|

Updated on: Aug 10, 2020 | 12:45 PM

కరోనా మహమ్మారి వచ్చి కన్నవాళ్ళని, కట్టుకున్న వాళ్లని కాటికి పంపేస్తుంటే చివరి చూపులకు నోచుకోక కుమిలి కుమిలి ఏడుస్తున్న కుటుంబాలెన్నో. అయిన వారి అంతిమ సంస్కారాలకు కూడా నోచుకోని దయనీయ స్థితి. ఇలాంటి పరిస్థితుల్లో సాధారణ చావును కూడా కరోనా మరణంగా భావిస్తూ ఒంటరిని చేస్తున్నారు. మనుషుల్లో మానవత్వం మంటగలుస్తోంది. గండెపోటుతో చనిపోయిన వ్యక్తిని సైతం కరోనా అనుమానంతో అంతిమ సంస్కారాలు చేసేందుకు సహకరించని దుస్థితి నెలకొంది. ఇలాంటి మనసుని ద్రవింప చేసే హృదయవిదారక ఘటన ఒకటి ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.

సాధారణ జబ్బులతో మృతిచెందిన వారిని సైతం కడదాకా మోసుకెళ్లేందుకు ‘ఆ నలుగురు’ దొరని ‘కరోనా’ కాలమిది. ఖమ్మం జిల్లా పాల్వంచ మండలం నాగారం గ్రామానికి చెందిన మల్లాది వెంకయ్య(58)కు ఉన్నటుండి ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబసభ్యలు ఆటోలో పాల్వంచలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతిచెందాడని వైద్యులు తేల్చి తెలిపారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతదేహాన్ని స్వగ్రామం తీసుకు వచ్చిన కుటుంబసభ్యలు అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లకు సిద్ధమయ్యారు. అయితే, వెంకయ్యకు కరోనా సోకి ఉండొచ్చన్న అపోహతో ఇరుగుపొరుగు, గ్రామస్థులెవరూ దహన సంస్కారాలకు సాయం చేసేందుకు ముందుకు రాలేదు. కనీసం శవాన్ని శ్మశాన వాటికకు తరలించేందుకు సైతం సహకరించలేదు. పంచాయతీ ట్రాక్టర్‌నైనా సమకూర్చాలని బాధితులు ప్రాధేయపడ్డ ఫలితం లేకుండాపోయింది. దీంతో అదే గ్రామానికి చెందిన రంజిత్‌కుమార్‌ అనే రైతు 5 కి.మీ. దూరంలోనున్న తన పొలానికి వెళ్లి పుల్‌వీల్స్‌తో ఉన్న ట్రాక్టరు, ట్రక్కును తీసుకొచ్చారు. మరో ఇద్దరి సాయంతో వెంకయ్య మృతదేహాన్ని వాగు ఒడ్డుకు తీసుకెళ్లి దహన సంస్కారాలు పూర్తి చేశారు. ఈ కష్టాన్ని తలచుకుని బాధిత కుటుంబీకులు విలపించిన తీరు కంటతడి పెట్టించింది. చనిపోయిన వ్యక్తి పట్ల గ్రామస్తులు ప్రవర్తించిన తీరుపట్ల సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.