భద్రత లేని స్కూళ్లు.. ప్రాణాలు కోల్పోతున్న విద్యార్థులు

హైదరాబాద్‌లోని ప్రైవేట్ పాఠశాలల్లో చిన్నారులకు రక్షణ కరువవుతోంది. మామూళ్ల మత్తులో పడి విద్యార్థులను సరిగా పట్టించుకోవడం లేదు. విద్యార్థులకు చదువు చెప్పాల్సిన పాఠశాలలు వారి మరణాలకు కేంద్రంగా మారుతున్నాయి. యాజమాన్యాలు ఫీజుల రాబడి చూసుకుంటున్నారే తప్ప.. విద్యార్థులకు భద్రత కల్పించడం లేదు. స్కూల్ యాజమానుల నిర్లక్ష్యం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోంది. బడిబాటలో విద్యార్థుల బతుకులు చిద్రమవుతున్నాయి. చదువు మాట పక్కన పెడితే వారి ప్రాణాలకు సేఫ్టీ లేకుండా పోతోంది. ఇందుకు వినిక అనే విద్యార్థిని మరణమే కారణం.

పాఠశాలలు ప్రారంభమైన రెండో రోజే దారుణ ఘటన జరిగింది. అందరిలాగే బడికి వెళ్లిన వినిక స్కూల్ బెల్ మోగక ముందే మృత్యు ఒడికి చేరింది. రోజులాగే స్కూల్‌కి వచ్చిన వినిక.. క్లాస్ రూమ్ లో బ్యాగ్ పెట్టింది. కొద్ది సేపటి తర్వాత వినిక పాఠశాల ఐదో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కిందపడిపోయింది. అది గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించేలోపే తీవ్రగాయాలతో మృతి చెందింది. నాగోల్ హయత్ నగర్ మండలం తట్టి అన్నారం హనుమాన్ నగర్ కి చెందిన నర్సింగ్ రావు, అనురాధ దంపతుల మూడో కుమార్తె వినిక. చేతికంది వచ్చిన కన్న కూతురు శవమై కనిపించడంతో ఆ తల్లిదండ్రులు విలవిలలాడుతున్నారు. గుండెలు పగిలేలా రోదిస్తున్నారు.

ఐదో అంతస్తులో ఉన్న తరగతి గదిలోని కిటికీకి గ్రిల్స్‌ లేవు. గ్లాస్‌ మాత్రమే బిగించి ఉంది. వినిక ప్రమాదవశాత్తు ఆ కిటికీలోంచి పడిపోయిందా..? లేక ఇంకేదైనా జరిగిందా..? అనేది తెలియలేదు. ఆ సమయంలో తోటి విదార్థులు గదిలో లేకపోవడంతో పడిపోవడానికి కారణమేంటో స్పష్టత లేకుండా పోయింది. సీసీ కెమెరాల్లో కూడా ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు రికార్డు కాలేదని పోలీసులు చెప్పారు. పిల్లలకు భద్రత కల్పించని యాజమాన్య వైఖరి వల్లే తమ కుమార్తె మృతి చెందిందని వినిక కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలకు భద్రత కల్పించని యాజమాన్యాల పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *