తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు షాక్!

telangana high court on new assembly, తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు షాక్!

హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఎర్రమంజిల్‌లో అసెంబ్లీ నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేసింది. ఎర్రమంజిల్‌లో భవనాలు కూల్చివేయొద్దంటూ దాఖలైన అన్ని వ్యాజ్యాలపై సుదీర్ఘ విచారణ చేపట్టిన హైకోర్టు.. ఈ మేరకు సోమవారం తన తీర్పును వెలువరించింది. ఎర్రమంజిల్‌లో అసెంబ్లీ నిర్మించాలని మంత్రివర్గం తీసుకున్న తీర్మానాన్ని కొట్టివేసింది. మంత్రివర్గ నిర్ణయం చట్టపరిధిలో లేదని హైకోర్టు పేర్కొంది. ప్రస్తుతం ఉన్న అసెంబ్లీని.. ఎర్రమంజిల్‌లోని భవనాలను కూల్చివేయొద్దని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రజాధనం దుర్వినియోగం అవుతుందన్న వాదనతో ఏకీభవించింది. 150 ఏళ్ల చరిత్ర కలిగిన ఎర్రమంజిల్ ప్యాలెస్‌ కూల్చివేతపై నిజాం వారసులు, ప్రజా సంఘాలు, సామాజిక కార్యకర్తలు కోర్టుకెక్కారు. అసెంబ్లీ భవనం కోసం చారిత్రక భవనాన్ని కూల్చడం ఎంత వరకు సమంజసమని వాదించారు. ఈ క్రమంలో ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు ఎర్రమంజిల్‌లో అసెంబ్లీని కట్టకూడదని ఆదేశించింది.

కాగా, ఎర్రమంజిల్‌లో మొత్తం 16 ఎకరాల స్థలంలో కొత్త అసెంబ్లీ భవనాన్ని నిర్మిస్తోంది తెెలంగాణ ప్రభుత్వం. అసెంబ్లీ భవనానికి జూన్ 27న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. వచ్చే ఉగాది లోపు కొత్త సచివాలయంతో పాటు కొత్త అసెంబ్లీ నిర్మాణాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. ఆ దిశగా పనులు కూడా జరుగుతున్నాయి. ఐతే ఎర్రమంజిల్‌లో పురాతన భవనాల కూల్చివేతకు వ్యతిరేకంగా పిటిషన్లు దాఖలవడంతో దానిపై విచారించిన కోర్టు.. అక్కడి భవనాలను కూల్చాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *