రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. నిబంధనలు సడలించిన అధికారులు

రైల్వే ప్రయాణికులకు శుభవార్త. రైలు ఎక్కడానికి గంటన్నర ముందు రావాలనే నిబంధనను రైల్వే అనధికారికంగా సడలించింది.

  • Balaraju Goud
  • Publish Date - 1:19 pm, Sat, 24 October 20

రైల్వే ప్రయాణికులకు శుభవార్త. రైలు ఎక్కడానికి గంటన్నర ముందు రావాలనే నిబంధనను రైల్వే అనధికారికంగా సడలించింది. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరినీ పరీక్షించడంలో భాగంగా గతంలో రైల్వే స్టేషన్లలోకి ప్రవేశించడానికి ఆలస్యం జరిగేది. అందుకే రైల్వే గంటన్నర నిబంధన పెట్టింది. ఇప్పుడు ఈ పనిని కంప్యూటరీకరించారు. సికింద్రాబాద్‌, కాచిగూడ, హైదరాబాద్‌ ప్రధాన రైల్వే స్టేషన్లలో లేజర్‌ టెక్నాలజీ సహాయంతో ఆధునిక థర్మల్‌ స్క్రీనింగ్‌ ఏర్పాటు చేశారు. ప్రయాణికులు లోపలికి అడుగుపెడుతుండగానే అవి ఆటోమెటిగ్గా శరీర ఉష్ణోగ్రతను అంచనా వేస్తాయి. దీంతో ప్రయాణ సమయానికి గంటన్నర ముందు రావాలనే నిబంధనను సడలించారు.

అయితే, ప్రయాణికులు ఎప్పటిలాగే అరగంట ముందు వచ్చినా సరిపోతుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రయాణికులు మాత్రమే ప్లాట్‌ఫాంపైకి వచ్చేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రైల్వే స్టేషన్లలోకి ప్రయాణికులను మినహా సహాయకులను ఎవరిని అనమతించబోమని అధికారులు తెలిపారు. అలాగే, ప్రయాణ సామగ్రి ఉన్నవారు కాస్త ముందుగా వచ్చి.. అక్కడి రైల్వే కూలీల సేవలను పొందవచ్చని సూచించారు.

ఒక ప్రయాణికులు రైల్వే స్టేషన్ లో అడుగు పెట్టగానే ప్రతి ఒక్కరికీ ప్రవేశమార్గం వద్దే శానిటైజర్‌ను చేతిలో పోస్తున్నారు. రైళ్లను, ప్లాట్‌ఫారాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నారు. రైళ్లలో గతంలో మాదిరి చిరుతిండి విక్రయాలు.. టీ, కాఫీ, తాగునీటి అమ్మాకాలను అధికారులు అనుమతించడంలేదు. ఇంటి నుంచి ఆహారాన్ని తీసుకెళ్లడమే ఉత్తమం అని సూచిస్తున్నారు. రైల్వే స్టేషన్లలోని క్యాంటీన్లు, రెస్టారెంట్లలో తినేందుకు అనుమతించడం లేదు. అలాగే, ప్యాక్‌ చేసి ఉంచిన ఆహారాన్ని తీసుకెళ్లేందుకే అనుమతిస్తున్నామని అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు కొవిడ్‌ నిబంధనల నేపథ్యంలో ప్రయాణికులకు అందించాల్సిన బెడ్‌షీట్లు కూడా సరఫరా చేయడం లేదని అధికారులు తెలిపారు. సురక్షిత ప్రయాణం కోసం రైళ్లలో ప్రయాణించాలన్న అధికారులు.. కొవిడ్ నిబంధనలను పాటించాలని సూచిస్తున్నారు.