ముస్లిం కోటా ప్రసక్తే లేదు.. వీ‌హెచ్‌పీ సూచనతో వెనక్కి తగ్గిన ఉధ్ధవ్ థాక్రే ప్రభుత్వం

మహారాష్ట్రలోని విద్యాసంస్థల్లో ముస్లిములకు రిజర్వేషన్ కల్పించాలన్న ప్రతిపాదనను సీఎం ఉధ్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన విరమించుకుంది. ముస్లిం విద్యార్థులకు 5 శాతం కోటాకు ఉద్దేశించిన బిల్లును త్వరలో రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెడతామని ఈ సంకీర్ణ ప్రభుత్వంలోని ఎన్సీపీ నేత.

ముస్లిం కోటా ప్రసక్తే లేదు.. వీ‌హెచ్‌పీ సూచనతో వెనక్కి తగ్గిన ఉధ్ధవ్ థాక్రే ప్రభుత్వం
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Mar 02, 2020 | 12:13 PM

మహారాష్ట్రలోని విద్యాసంస్థల్లో ముస్లిములకు రిజర్వేషన్ కల్పించాలన్న ప్రతిపాదనను సీఎం ఉధ్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన విరమించుకుంది. ముస్లిం విద్యార్థులకు 5 శాతం కోటాకు ఉద్దేశించిన బిల్లును త్వరలో రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెడతామని ఈ సంకీర్ణ ప్రభుత్వంలోని ఎన్సీపీ నేత. మైనారిటీల వ్యవహారాల శాఖ మంత్రి నవాబ్ మాలిక్ రెండు రోజుల క్రితమే ప్రకటించారు. అయితే అలాంటి ప్రతిపాదనేదీ లేదని శివసేన స్పష్టం చేసింది. సేన, కాంగ్రెస్, ఎన్సీపీలతో కూడిన ప్రభుత్వం మొదట చేసిన ఈ ప్రపోజల్‌పై విశ్వహిందూ పరిషద్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.  ఇది ఎంతైనా ఖండించదగినదని, శివసేన ఆధ్వర్యంలోని సర్కార్ ముస్లిములను బుజ్జగించడం సరికాదని గత శనివారం ఈ హిందూ సంస్థ హిందీలో ట్వీట్ చేసింది. దీనికి స్పందించిన శివసేన కమ్యూనికేషన్ విభాగం.. ఆవిధమైన ప్రతిపాదన గురించి ప్రభుత్వం చర్చించబోవడంలేదని  తాను కూడా హిందీలోనే ట్వీట్ చేసింది.

ముస్లిములకు విద్యాసంస్థల్లో ఐదు శాతం రిజర్వేషన్ కల్పించడమే కాక, ఉద్యోగాల్లో వారికి కోటా నిర్దేశించే ఉద్దేశం కూడా ఉందని నవాబ్ మాలిక్ ఈ మధ్యే వెల్లడించారు. అయితే ఇదివరకు అధికారంలో ఉన్న శివసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం.. కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ.. ముస్లిములకు ఎలాంటి రిజర్వేషన్ కల్పించలేదు.

సీఏఏపై తీర్మానం అవసరం లేదు

సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో ఏవిధమైన తీర్మానం తెచ్చే అవసరం లేదని ఎన్సీపీ నేత, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తెలిపారు.  ఎన్నార్సీ గానీ, ఎన్‌పీ‌ఆర్ గానీ ఎవరి పౌరసత్వాన్నీ లాక్కొనబోవని కూడా ఆయన చెప్పారు. అసలు సీఏఏతో బాటు ఎన్‌పీ‌ఆర్‌కు కూడా వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం ఆమోదించడం అనవసరం అని ఆయన అభిప్రాయపడ్డారు. వీటి విషయమై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. ఎన్నార్సీకి వ్యతిరేకంగా గత నెలలో బీహార్ అసెంబ్లీ ఓ తీర్మానాన్ని ఆమోదించిన విషయం విదితమే.