కుమారస్వామికి కాస్త ఊరట.. ప్రస్తుతానికి యధాతథ స్థితి..సుప్రీం ఆదేశం

NO DECISION ON REBEL, కుమారస్వామికి కాస్త ఊరట.. ప్రస్తుతానికి యధాతథ స్థితి..సుప్రీం ఆదేశం

కర్ణాటకలో కుమారస్వామి ప్రభుత్వానికి కాస్త ఊరట లభించింది. రెబల్ ఎమ్మెల్యేల పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు ప్రస్తుతానికి యధాతథ స్థితిని మంగళవారం వరకు కొనసాగించాలని ఆదేశించింది. వీరి పిటిషన్ పై మళ్ళీ విచారణ జరుపుతామని సూచించింది. వీరి రాజీనామాల విషయమై తానింకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, తనకు కొంత వ్యవధి కావాలని స్పీకర్ రమేష్ కుమార్..కోర్టును అభ్యర్థించారు. ఆయన తరఫున సీనియర్ న్యాయవాది, కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వీ వాదిస్తూ.. తన క్లయింటు చేసిన వినతిలోని అంశాలను సమగ్రంగా పరిశీలించాలని కోరారు. రెబల్ ఎమ్మెల్యేల పిటిషన్ లో ఔచిత్యం లేదన్నారు. వారి రాజీనామాలపై నిర్ణయం తీసుకోవలసిందిగా స్పీకర్ ను కోర్టు ఆదేశించజాలదని సింఘ్వీ అన్నారు. పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టం కింద.. వారి రాజీనామాలపై స్పీకరే నిర్ణయం తీసుకోవలసిఉంటుందని ఆయన అన్నారు.

ఇలా ఉండగా.. రాష్ట్ర అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని కోరుతున్నట్టు సీఎం కుమారస్వామి శాసన సభలో ప్రకటించారు. సభలో మెజారిటీని నిరూపించుకోవడానికి అనుమతించాలని ఆయన స్పీకర్ ను అభ్యర్థించారు. తన ప్రభుత్వ మనుగడకు సంబంధించి అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరచాలని కుమారస్వామి కోరిన విషయం తెలిసిందే. అటు-గురువారం తనను కలుసుకున్న ఈ ఎమ్మెల్యేల పట్ల రమేష్ కుమార్ కొంత దురుసుగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. తమ పిటిషన్లను మళ్ళీ పరిశీలించాల్సిందిగా తాము కోరగా.. ‘ గో టు హెల్ ‘ అని ఆయన ఆగ్రహంగా దుర్భాషలాడినంత పని చేశారని వీరు మీడియాకు తెలిపారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులతో కుమారస్వామి ప్రభుత్వానికి కొంత ఊరట లభించినట్టయ్యింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *