#COVID19 తిరుమలలో దర్శనాలు నిలిపివేత.. ఓన్లీ నిత్య కైంకర్యాలే

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి ప్రభావం తిరుమలేశునికి చేరింది.ఇప్పటికే భక్తుల దర్శనాలను నియంత్రించిన టీటీడీ ఇపుడు స్వామి వారికి కైంకర్యాలను మాత్రం కొనసాగిస్తూ.. భక్తుల దర్శనాలను రద్దు చేసింది

#COVID19 తిరుమలలో దర్శనాలు నిలిపివేత.. ఓన్లీ నిత్య కైంకర్యాలే
Follow us

|

Updated on: Mar 19, 2020 | 6:03 PM

Tirumala temple will be closed soon due to #covidindia ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి ప్రభావం తిరుమలేశునికి చేరింది.ఇప్పటికే భక్తుల దర్శనాలను నియంత్రించిన టీటీడీ ఇపుడు స్వామి వారికి కైంకర్యాలను మాత్రం కొనసాగిస్తూ.. భక్తుల దర్శనాలను రద్దు చేసింది. అత్యవసర పరిస్థితిలో తిరుమలేశుని దర్శనాలను నిలిపి వేయవచ్చని ఆగమ శాస్త్రం చెబుతుందని ఆలయ ప్రధాన అర్చకుడు చెప్పిన ఇరవై నాలుగు గంటల్లోనే ఆలయంలో దర్శనాల నిలిపివేత ప్రక్రియ ప్రారంభమైంది. తిరుమల సహా రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో దర్శనాలను నిలిపి వేస్తున్నట్లు ఏపీ మంత్రి నాని ప్రకటించిన కొద్ది సేపటికే తిరుమలలో మార్పులు ప్రారంభమయ్యాయి. ముందుగా దర్శనం టైమ్ స్లాట్లను ఇవ్వడం నిలిపి వేశారు. అలిపిరి చెక్ పోస్టును మూసి వేసి.. భక్తులు కొండ మీదికి వెళ్ళకుండా చర్యలు తీసుకున్నారు.

కొండ మీద ఆల్ రెడీ వున్న భక్తుల దర్శనాలు పూర్తి కాగానే ఆనంద నిలయంలో కైంకర్యాలను మాత్రం కొనసాగిస్తూ భక్తుల దర్శనాలను నిలిపి వేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విధానం ఎంత కాలం అనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఆల్ రెడీ దర్శనానికి టైమ్ స్లాట్లను పొంది వున్న వారిని మాత్రం అలిపిరి నుంచి అనుమతిస్తుండడంతో.. గురువారం రాత్రి దాకా భక్తుల దర్శనాలుంటాయని అనుకుంటున్నారు. శుక్రవారం ఉదయం కొన్ని సేవలకు సంబంధించి జారీ చేసిన టిక్కెట్ల మేరకు కూడా భక్తులను అనుమతించే పరిస్థితి కనిపిస్తోంది.

మరోవైపు కరోనా వ్యాప్తిని నియంత్రించాలంటే వచ్చే నెల రోజులు అత్యంత కీలకమని కేంద్రం భావిస్తున్న నేపథ్యంలో నిర్దిష్టమైన చర్యలకు యావత్ భారత దేశం రెడీ అవుతోంది. అందులో భాగంగా భారీగా జనసమ్మర్థం వుంటే ప్రాంతాలలో ఆంక్షలు విధిస్తున్నారు. సినిమా హాళ్ళు, మల్టిప్లెక్సులు, బార్లు, క్లబ్బులు, పబ్బులు ఇదివరకే చాలా రాష్ట్రాలలో నిరవధికంగా మూత పడ్డాయి. ఆ తర్వాత భారీగా భక్త జనం సంచరించే తిరుమల, షిరిడీ వంటి ఆలయాలవైపు దృష్టి మళ్ళింది. షిరిడీ దేవాలయాన్ని మంగళవారం మధ్యాహ్నం నుంచి మూసివేశారు. ఇటు తిరుమలలో గత మూడు రోజులుగా భక్తుల దర్శనాలను నియంత్రించారు. ఈ నెలాఖరు దాకా భక్తులు తిరుమల ప్రయాణాన్ని పెట్టుకోవద్దని టీటీడీ శ్రీవారి భక్తులను కోరింది.

తాజాగా తిరుమల ఆలయాన్ని కొన్ని రోజుల పాటు కేవలం స్వామి వారి కైంకర్యాలకు మాత్రమే పరిమితం చేసి.. భక్తుల దర్శనాలను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ నుంచి ఫార్మల్ ప్రకటన రావడం మాత్రమే ఇక మిగిలింది. కరోనా ఎఫెక్ట్ పై శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడు వేణుగోపాల దీక్షతులు బుధవారం నాడు స్పందించారు. కరోనా చాపకింద నీరులా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో స్వామి వారికి కైంకర్యాలు ఏకాంతంగా నిర్వహించి ఆలయాన్ని మూసి వేయొచ్చని ఆగమ శాస్త్రం చెపుతోందని ఆయనంటున్నారు. లోక కళ్యాణార్థం కళ్యాణోత్సవాన్ని ఏకాంతంగా నిర్వహించి, సుప్రభాతం నుంచి ఏకాంత సేవ వరకు జరిగే ఉపచారాలు ఆగమోక్తంగా నిర్వహిస్తామని ఆయన చెబుతున్నారు. సహస్ర కలశాభిషేకం, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, విశేష పూజ ఇతర ఆర్జిత సేవలు రద్దు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అందుకే ఈ నిర్ణయం

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయంలోకి భక్తుల ప్రవేశాన్ని నిలిపివేస్తున్నామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ప్రకటించారు. తిరుమల ఘాట్ రోడ్లు, కళ్యాణకట్ట, అన్న ప్రసాద కేంద్రాలను కూడా మూసి వేస్తున్నామన్నారు. సీఎం జగన్, టీటీడీ చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డిలతో సంప్రదించి శ్రీవారి ఆలయంలోకి భక్తుల అనుమతిని తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని వివరించారు ఏకే సింఘాల్.

ప్రతినిత్యం స్వామివారి నిర్వహించే నిత్య కైంకర్యాలను యథాతధంగా నిర్వహిస్తామని, భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలయ ప్రవేశాన్ని నిలిపివేస్తున్నామని అన్నారు. ప్రస్తుతం తిరుమలలో ఉన్న భక్తులందరికీ శ్రీవారి దర్శనం కల్పించి అనంతరం ఆలయంలోకి భక్తుల ప్రవేశాన్ని నిలిపివేస్తామని ప్రకటించారు.

ఉత్తర ప్రదేశ్‌కు చెందిన 65 ఏళ్ల వృద్ధిడికి కరోనా లక్షణాలు కనిపించడంతో తిరుపతి రూయాకు తరలించామని, ఉత్తర ప్రదేశ్‌కు చెందిన 130 మంది భక్తులు తీర్థయాత్రలో భాగంగా అలహాబాద్, వారణాసి, కలకత్తా, పూరిల మీదుగా ఒంగోలు చేరుకున్నారని, ఒంగోలు నుండి శ్రీశైలం వెళ్లి బుధవారం మధ్యాహ్నం తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నారని వివరించారు సింఘాల్. వారి ద్వారా కరోనా ప్రబలి వుండొచ్చన్న వదంతుల నేపథ్యంలోనే శ్రీవారి దర్శనాల నిలిపివేత నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకున్న భక్తులందరూ ప్రజా సంక్షేమార్థం టీటీడీకి సహకరించాలని, కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు తగిన చర్యలు తీసుకుంటున్నామని, ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణం వేదికను రద్దు చేసి ఏకాంతంగా కళ్యాణాన్ని నిర్వహిస్తామని, 22వ తేది నుండి ర్వహించనున్న ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని ఆయన వివరించారు.