‘ మాలిక్ జీ ! కశ్మీర్ కు ఎప్పుడు రావాలి .. ? ‘ రాహుల్ గాంధీ

Rahul Gandhi Counter

కశ్మీర్ లో నెలకొన్న పరిస్థితిని అధ్యయనం చేసేందుకు తనకు ఆ రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్ పంపిన ఆహ్వానంపై కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దీటుగా బదులిచ్చారు. తాను ప్రతిపక్ష పార్టీ నేతలతో కూడిన ప్రతినిధిబృందంతో బాటు వస్తానని, స్వేచ్చగా మీ రాష్ట్రానికి వఛ్చి.. అక్కడి ప్రజలు, రాజకీయ నేతలతో మాట్లాడతానని రాహుల్ పేర్కొన్నారు. దీనికి మాలిక్… ‘ మీరు చాలా ప్రీ-కండిషన్స్ (ముందు షరతులు) పెడుతున్నారని ‘ కాస్త అసహనంతో వ్యాఖ్యానించగా.. రాహుల్ మళ్ళీ కౌంటరిచ్చారు.
‘ మాలిక్ జీ ! (మాస్టర్ జీ !) నా ట్వీట్ కు మీరిచ్చిన సమాధానం చూశాను.. మీ ఆహ్వానాన్ని అంగీకరిస్తున్నా.. ఎలాంటి షరతులు లేకుండా జమ్మూ కశ్మీర్ ను విజిట్ చేయాలన్న మీ ఇన్విటేషన్ నాకు సమ్మతమే.. ఎప్పుడు రమ్మంటారు..? ‘ అని ఆయన ట్వీటించారు.
కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని కల్పించేందుకు ఉద్దేశించిన ఆర్టికల్ 370 ని కేంద్రం రద్దు చేసిన అనంతరం ఆ రాష్ట్రంలో హింసాత్మక ప్రదర్శనలు, అల్లర్లు జరుగుతున్నాయని రాహుల్ మొదట చేసిన వ్యాఖ్యలతో రచ్చ మొదలైంది. దీంతో గవర్నర్ సత్యపాల్ మాలిక్.. ‘ ఇక్కడికి రమ్మని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా..అందుకు విమానాన్ని కూడా పంపుతున్నాను. ఇక్కడికొచ్చి మాట్లాడండి.. మీరు బాధ్యతాయుతమైన వ్యక్తి.. కశ్మీర్ లో అల్లర్లు జరుగుతున్నాయనడం సరికాదు ‘ అని అని అన్నారు. ఇందుకు రాహుల్.. తనకు విమానం అక్కరలేదని, కానీ జమ్మూ కశ్మీర్ ప్రజలను, అక్కడి నాయకులను, మా పార్టీ కార్యకర్తలను, మన జవాన్లను కలుసుకుని వారితో మమేకమయ్యే అవకాశాన్ని కల్పించాలని ట్వీట్ చేశారు.ఈ వ్యవహారం నిన్న కూడా వివాదాస్పదమైంది. రాహుల్ ఈ రాష్ట్రానికి వఛ్చి కస్టడీలో ఉన్న నేతలతో మాట్లాడడం ద్వారా అశాంతిని రెచ్చగొట్టేలా చూస్తున్నారని మాలిక్ ఆరోపించారు.
కాశ్మీర్లో మాజీ సీఎం లు మెహబూబా ముఫ్తీ, ఫరూక్ అబ్దుల్లా తో సహా అనేకమంది నాయకులను గత వారం రోజులుగా పోలీసులు కస్టడీలోకి
తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా- బహుశా సరిహద్దులనుంచి అందుతున్న ఫేక్ సమాచారంతో రాహుల్ ఇలా మాట్లాడుతున్నట్టు
కనిపిస్తోందని మాలిక్ వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *