నిజామాబాద్‌ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు అంతా సిద్ధం..

నిజామాబాద్‌ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కాసేపట్లో మొదలు కాబోతుంది. కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేశారు.

నిజామాబాద్‌ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు అంతా సిద్ధం..
Follow us

|

Updated on: Oct 09, 2020 | 6:54 AM

నిజామాబాద్‌ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కాసేపట్లో మొదలు కాబోతుంది. కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. పోలింగ్‌ నిర్వహణకు 399 మంది సిబ్బందిని వినియోగిస్తున్న అధికారులు.. వారికి ఎన్నికల సామాగ్రితో పాటు మాస్క్‌లు, ఫేస్‌ షీల్డ్‌, శానిటైజర్లను అందజేశారు. ప్రతీ పోలింగ్‌ స్టేషన్‌కు 4 పీపీఈ కిట్లను కూడా అందజేశారు. ఉమ్మడి నిజామాబాద్‌ వ్యాప్తంగా 824 మంది ఓటర్లకు గాను.. 50 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ప్రధాన పార్టీల తరపున ముగ్గురు అభ్యర్ధులు బరిలో ఉన్నారు. టీఆర్‌ఎస్‌ నుంచి కల్వకుంట్ల కవిత, బీజేపీ నుంచి లక్ష్మినారాయణ, కాంగ్రెస్‌ నుంచి సుభాష్‌రెడ్డి పోటీ పడుతున్నారు. భూపతిరెడ్డిపై అనర్హత వేటుతో నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఖాళీ ఏర్పడడంతో ఈ ఎన్నిక జరుగుతోంది. నిజామాబాద్ నగర పాలక సంస్ధలో అత్యధికంగా 67 మంది ఓటర్లు ఉండగా.. చందూరు మండలంలో అత్యల్పంగా 4గురు ఓటర్లున్నారు. ఉమ్మడి జిల్లాలో 14 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు.. వెబ్ కాస్టింగ్ తో పాటు వీడియో చిత్రీకరణ చేయనున్నారు. అలాగే, పోలింగ్‌ సిబ్బందికి, ఓటర్లకు కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎన్నిక బ్యాలెట్‌ పేపర్‌తోనే నిర్వహిస్తున్నారు. ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ ఇచ్చిన పెన్నుతో మాత్రమే ఓటు వేయాలని, వేరే పెన్నుతో వేస్తే ఓటు చెల్లదని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి తెలిపారు.

సెల్‌ఫోన్లతో పోలింగ్‌ కేంద్రాలకు అనుమతించరు. ఎలాంటి ఎలక్ట్రానిక్‌ వస్తువులను తీసుకువచ్చినా పోలింగ్‌ కేంద్రంలోకి తీసుకెళ్లనీయమని కలెక్టర్‌ స్పష్టం చేశారు. 24 మంది ఓటర్లకు కోవిడ్‌ పాజిటివ్‌ నిర్థారణ కావడంతో ఎన్నికల కమిషన్‌ రెండు రకాల ఆప్షన్స్‌ ఇచ్చింది. వారు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా అయినా ఓటు వేయొచ్చు లేదంటే సాయంత్రం సమయంలో 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో నేరుగా వచ్చి ఓటును వినియోగించుకోవచ్చు. ఉదయం 9 గంటలకు మొదలయ్యే పోలింగ్‌ సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. 50 పోలింగ్‌ స్టేషన్లను 15 రూట్లుగా విభజించారు. ప్రతీ రూటుకు ఒక సెక్టోరల్‌ అధికారిని నియమించారు. ఈ నెల 12 వ తేదీ ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్‌ జరుగుతుంది. కేవలం రెండు రౌండ్లలోనే ఫలితం వెలువడే అవకాశం ఉంది.