ములాయంతో యోగీ భేటీ.. వ్యూహం అదేనా ?

యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాజకీయం ఉత్తరాదిన కొత్త సమీకరణలపై సరికొత్త చర్చకు తెరలేపింది. బిజెపికి చిరకాల ప్రత్యర్థి అయిన కురువృద్ధ నేత, సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ కేంద్రమంత్రి, యుపి మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్‌ను యోగీ అదిత్యనాథ్ తరచూ కలుస్తుండడం రాజకీయ వర్గాల్లో పెను దుమారాన్ని రేపుతోంది. ఇదివరకు ములాయం ఆరోగ్యం బాగాలేనందునే కలిశానని చెప్పు కొచ్చిన యోగీ ఆదిత్యనాథ్ మరోసారి ములాయం సింగ్‌ను కల్వడానికి కారణం మాత్రం దీపావళి శుభాకాంక్షలు […]

ములాయంతో యోగీ భేటీ.. వ్యూహం అదేనా ?
Follow us

|

Updated on: Oct 31, 2019 | 3:19 PM

యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాజకీయం ఉత్తరాదిన కొత్త సమీకరణలపై సరికొత్త చర్చకు తెరలేపింది. బిజెపికి చిరకాల ప్రత్యర్థి అయిన కురువృద్ధ నేత, సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ కేంద్రమంత్రి, యుపి మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్‌ను యోగీ అదిత్యనాథ్ తరచూ కలుస్తుండడం రాజకీయ వర్గాల్లో పెను దుమారాన్ని రేపుతోంది.

ఇదివరకు ములాయం ఆరోగ్యం బాగాలేనందునే కలిశానని చెప్పు కొచ్చిన యోగీ ఆదిత్యనాథ్ మరోసారి ములాయం సింగ్‌ను కల్వడానికి కారణం మాత్రం దీపావళి శుభాకాంక్షలు తెలిపేందుకేనంటున్నారు. కానీ.. రాజకీయంగా చిరకాల ప్రత్యర్థి.. బిజెపికి ఒకప్పుడు బద్ద శత్రువు అయిన ములాయంను తరచూ కల్వడం వెనుక రాజకీయ వ్యూహాలు కచ్చితంగా వుంటాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

బుధవారం ములాయం ఇంటికి వెళ్ళినపుడు ఆయన తనయుడు, ప్రస్తుతం సమాజ్‌వాదీ పార్టీ సారథి, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ కాకుండా… ఎస్పీ నుంచి బహిష్కృతుడైన ములాయం సోదరుడు శివపాల్ యాదవ్ వున్నారు. ఆయన కొద్దికాలం క్రితం అఖిలేశ్ యాదవ్‌తో విభేదించి ప్రగతిశీల్ సమాజ్‌వాదీ పేరిట వేరు కుంపటి పెట్టుకున్నారు. అయినప్పటికీ సోదరుడు ములాయంతో సన్నిహితంగానే మెదులుతున్నారు.

గత సార్వత్రిక ఎన్నికలకు ముందు పార్లమెంటు సాక్షిగా నరేంద్రమోదీ తిరిగి భారత ప్రధాని కావాలనుకుంటున్నానంటూ కామెంట్ చేసి.. విపక్షాలను నివ్వెర పరిచిన ములాయం సింగ్‌ని యోగీ కల్వడం వెనుక వ్యూహాలు కచ్చితంగా వుంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు. గత జూన్ నెలలో కూడా యోగీ ఆదిత్యనాత్ ములాయంను కలిశారు. అప్పట్లో ములాయం అనారోగ్యంతో వుండడంతో ఆయన్ను పరామర్శించేందుకు వెళ్ళినట్లు అప్పట్లో సీఎంవో వర్గాలు చెప్పాయి.

తాజాగా బుధవారం వీరిద్దరు కలిసిన విషయంపై అటు యోగి గానీ, ఇటు ములాయం కానీ నోరు మెదపలేదు. కానీ సీఎంఓ వర్గాలు మాత్రం పాత పాటే పాడాయి. ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని చెబుతున్నాయి. అయితే ఇటీవల జరిగిన ఉప ఎన్నికలకు ఈ భేటకి లింకుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇటీవల యుపిలోని 11 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. వీటిలో ఎనిమిది స్థానాలను బిజెపి, దాని మిత్ర పక్షం అప్నాదళ్ పార్టీలు గెలుచుకోగా.. సమాజ్‌వాదీ పార్టీ 3 స్థానాల్లో గెలుపొందింది. ఉప ఎన్నికల ప్రచారంలో అఖిలేశ్ యాదవ్ యోగీ సర్కార్‌పై నిప్పులు చెరుగుతూ ప్రచారం నిర్వహించగా.. ములాయంకు సన్నిహితంగా వుంటున్న ఆయన పెద్ద తమ్ముడు, ప్రగతిశీల్ సమాజ్‌వాదీ పార్టీ అధినేత శివపాల్ యాదవ్ మాత్రం యోగీతో సత్సంబంధాలు మెయింటేన్ చేస్తున్నారు.

అందువల్లే యోగీ ప్రభుత్వం శివపాల్ సింగ్ యాదవ్‌కు ప్రభుత్వ బంగ్లాను సైతం కేటాయించింది. అదే సమయంలో అఖిలేశ్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు తన తండ్రి ములాయం సింగ్ యాదవ్‌కు కేటాయించిన ప్రభుత్వ లగ్జరీ కారు సౌకర్యాన్ని ఉపసంహరించుకుందామన్న ఎస్టేట్ శాఖ ప్రతిపాదనను యోగీ ఆదిత్యనాథ్ తిరస్కరించారు. ములాయం వంటి కురువృద్ధ నేతకు లగ్జరీ కారు సౌకర్యాన్ని ప్రభుత్వ ఖర్చుతో కొనసాగించాలనే యోగి నిర్ణయించారు. ములాయంతో సాన్నిహిత్యంగా మెలగడం, సత్సంబంధాలు నెరపడం యోగీ ఫ్యూచర్ ప్లాన్‌లో భాగమేనని.. ఆయన మద్దతుంటే.. యుపి బిసిల్లో మేజర్ షేర్‌ను వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పొందవచ్చన్నది యోగీ మాస్టర్ ప్లాన్ అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.