కొత్త రైతు చట్టాలు అన్నదాతలకు అత్యంత ప్రయోజనకరం, ‘మన్ కీ బాత్’ లో ప్రధాని మోదీ

తమ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన రైతు చట్టాలు అన్నదాతలకు అత్యంత ప్రయోజనకరమని ప్రధాని మోదీ అన్నారు. వారి చిరకాల డిమాండ్లు ఈ చట్టాలతో తీరుతున్నాయని ఆయన చెప్పారు. వీటి పట్ల నిరసన వ్యక్తం చేస్తూ..

  • Umakanth Rao
  • Publish Date - 1:53 pm, Sun, 29 November 20
కొత్త రైతు చట్టాలు అన్నదాతలకు అత్యంత ప్రయోజనకరం,  'మన్ కీ బాత్' లో ప్రధాని మోదీ

తమ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన రైతు చట్టాలు అన్నదాతలకు అత్యంత ప్రయోజనకరమని ప్రధాని మోదీ అన్నారు. వారి చిరకాల డిమాండ్లు ఈ చట్టాలతో తీరుతున్నాయని ఆయన చెప్పారు. వీటి పట్ల నిరసన వ్యక్తం చేస్తూ, వీటిని ఉపసంహరించాలని కోరుతూ పంజాబ్, హర్యానా, తదితర రాష్ట్రాల నుంచి వేలమంది రైతులు ఛలో ఢిల్లీ పేరిట హస్తినకు చేరుకున్న నేపథ్యంలో.. మోదీ తన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ఈ చట్టాల గురించి ప్రస్తావించారు. ఈ వ్యవసాయ సంస్కరణలు మన రైతులకు నూతన కవాటాలను తెరిచాయని, వారి జీవన వికాసానికి తోడ్పడుతున్నాయని ఆయన చెప్పారు. తమ పంటలకు గిట్టుబాటు ధరలు లభించేలా చూడాలని, దళారుల నుంచి తమను కాపాడాలని ఎన్నో ఏళ్లుగా అన్నదాతలు కోరుతున్నారని, వారి కష్టాలను తొలగిస్తామని తాము హామీ ఇచ్చామని, అలాగే ఈ చట్టాలను అమలులోకి తెచ్చామని మోడీ పేర్కొన్నారు.

ఎన్నోచర్చల అనంతరం పార్లమెంటు ఈ సంస్కరణలకు చట్టరూపం కల్పించింది..ఇవి రైతులకు కొత్త హక్కులు, అవకాశాలను కల్పించాయి అని ఆయన వ్యాఖ్యానించారు. వీటిని తెచ్చిన కొద్ది కాలానికే ఇవి మంచి ఫలితాలను ఇవ్వడం ప్రారంభించాయన్నారు. ఇందుకు ఉదాహరణగా మహారాష్ట్రలోని ధూలే జిల్లాలో తన పంటకు నాలుగు నెలలుగా సొమ్ము రాక ఇబ్బందులు పడుతున్న ఓ రైతుకు మూడు రోజుల్లోనే అది లభించిందని, అలా కాకపోయి ఉంటే ఆ రైతు ఫిర్యాదు చేసి ఉండేవాడని ఆయన పేర్కొన్నారు. కాగా హస్తినలో ధర్నా చేస్తున్న రైతులకు హోమ్ మంత్రి అమిత్ షా అభయమిచ్చారు. వీరి సమస్యలపట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని, వారి డిమాండ్ల విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు.