మానవసేవే మాధవసేవ అంటే ఇదేనేమో.. ఎందరికో ఆదర్శం ఈ డాక్టరమ్మ

ఆమె వృత్తి రీత్యా డాక్టర్.. గ్రామీణ వాతావరణంపై ఆమెకు ప్రత్యేకమైన అభిమానం, ప్రేమ కూడా. అందుకే ప్రతివారం ఒక చిన్న వాహనంలో దగ్గరలో ఉన్న గ్రామాలకు చేరుకుంటారు. అయితే ఆమె వెళ్లేది వారాంతంలో పల్లెటూళ్లోలో అందాలను చూడటానికి అనుకుంటే పొరబాటే.  ఆమె పేరు డాక్టర్ బిందు మీనన్… పుట్టింది మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో కానీ ఆమె డాక్టర్‌గా స్థిరపడింది మాత్రం ఆంధ్రప్రదేశ్‌లో. తిరుపతిలో 2008లో మెడికల్ కాలేజీ ప్రారంభించిన నాటినుంచి ఆమె అక్కడ న్యూరాలజిస్టుగా పేరు తెచ్చుకున్నారు. మహిళా […]

మానవసేవే మాధవసేవ అంటే ఇదేనేమో.. ఎందరికో ఆదర్శం ఈ డాక్టరమ్మ
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Sep 24, 2019 | 10:10 AM

ఆమె వృత్తి రీత్యా డాక్టర్.. గ్రామీణ వాతావరణంపై ఆమెకు ప్రత్యేకమైన అభిమానం, ప్రేమ కూడా. అందుకే ప్రతివారం ఒక చిన్న వాహనంలో దగ్గరలో ఉన్న గ్రామాలకు చేరుకుంటారు. అయితే ఆమె వెళ్లేది వారాంతంలో పల్లెటూళ్లోలో అందాలను చూడటానికి అనుకుంటే పొరబాటే.  ఆమె పేరు డాక్టర్ బిందు మీనన్… పుట్టింది మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో కానీ ఆమె డాక్టర్‌గా స్థిరపడింది మాత్రం ఆంధ్రప్రదేశ్‌లో. తిరుపతిలో 2008లో మెడికల్ కాలేజీ ప్రారంభించిన నాటినుంచి ఆమె అక్కడ న్యూరాలజిస్టుగా పేరు తెచ్చుకున్నారు. మహిళా వైద్యులలో ప్రధానంగా స్త్రీల వ్యాధుల నిపుణులే అధికంగా ఉంటారు. కానీ తాను శరీరానికి ప్రధాన ఆయువుపట్టయిన బ్రెయిన్, నరాల సమస్యలను పరిష్కరించే న్యూరాలజీ డాక్టర్ కావాలనుకున్నానని బిందు చెబుతారు.

Neurology on wheels: This AP doctor is treating patients in villages for free

ఎప్పుడూ నవ్వుతూ ఆప్యాయంగా పలకరించే డాక్టర్ బిందు.. బ్రెయిన్ వ్యాధులు, నరాల జబ్బులకు అందించే వైద్యసేవలు ఎంతో మందికి పునర్జన్మను అందించాయి. మానవసేవే మాధవసేవ అని నమ్మిన  డాక్టర్ బిందు.. పేదలకు సేవ చేయాలనే గొప్ప ఉన్నత లక్ష్యంతో బిందు ఫౌండేషన్ నెలకొల్పి దాని ద్వారా ప్రతివారం క్రమం తప్పకుండా నెల్లూరుకు చుట్టుపక్కల ఉన్న గ్రామాలను సందర్శించి అక్కడ పేద వారికి ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నారు. ఈ సేవ గత నాలుగేళ్లుగా ఎక్కడా ఆగకుండా సాగుతోంది. మామూలుగా వచ్చే ఎన్నోఅనారోగ్య సమస్యలకు దగ్గర్లో ఉన్న వైద్యుల వద్దకు వెళ్లి వైద్యసేవలు పొందుతూ ఉంటారు. కానీ తల, నరాలు, ఫిట్స్ వంటి సమస్యలతో ఉన్న రోగులు నరాల డాక్టర్ను సంప్రదించాలంటే ఎంతో శ్రమపడాల్సి వస్తుంది. అలాంటిది డాక్టర్ బిందు వృత్తిరీత్య న్యూరాలజిస్ట్ కావడంతో స్వయంగా రోగుల వద్దకే వెళ్లి వారికి సేవలు చేయడంతో ఆమె సేవలు పొందిన ఎంతోమంది కొత్త జన్మను ఎత్తినట్టుగా భావిస్తుంటారు.

ప్రతివారం ఒక గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి ఆ గ్రామంలో ఫిట్స్, నరాలు వ్యాధులు, పక్షవాతం, తలలో వచ్చే అనేక సమస్యలతో బాధపడేవారికి అక్కడికక్కడే వైద్యాన్ని అందిస్తున్నారు డాక్టర్ బిందు. రాబోయే వారం ఏ గ్రామం వెళ్లాలి? , అక్కడ ఎంతమంది జనాభా ఉంటారు? అందులో నరాలు,తల సమస్యలతో ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారు అనే విషయాలు ముందే సేకరించి మెడికల్ క్యాంప్ ఏర్పాటుకు రెడీ అవుతారు. ఈ క్యాంప్ ఏర్పాటు చేయడానికి డాక్టర్ బిందుతో పాటు ఆమెకు సహకరిస్తున్న కొంతమంది యువకులు కూడా స్వచ్చందంగా సేవ చేస్తున్నారు. మెడికల్ క్యాంప్‌లో రోగులను పరీక్షించి వెంటనే ట్రీట్‌మెంట్ చేయడం కంటే .. వారికి ఆయా సమస్యలపై అవగాహన కల్పించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం డాక్టర్ బిందు ఎన్నుకున్న సరికొత్త మార్గం. ఉదాహరణకు ఫిట్స్ అనేవి ఎందుకు వస్తాయి. అది వంశపారంపర్యమా? దీనికి మందులున్నాయా? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేవి మందుగా క్యాంప్‌కు వచ్చిన రోగులకు అవగాహన కల్పిస్తారు. మరో ఉదాహరణగా చెప్పుకుంటే తలలో కొంతమందికి పాములు ఉంటాయి. వీటిని టేప్ వార్మ్స్ అంటారు. బద్దె పురుగులు అని కూడా పిలుస్తారు. అయితే ఇంత పెద్ద పాములు తలలో ఎందుకు పెరుగుతాయి అనేది విషయాలు వివరిస్తారు. ఆహార పదార్ధాలు బాగా ఉడికించి తింటే ఇటువంటి పాములు పెరిగే అవకాశం ఉండదని ప్రజలకు స్పష్టంగా.. వారికి అర్ధమయ్యేలా చెబుతారు.

మనిషి ఒక ఆలోచన రావాలన్నా, చిరునవ్వు నవ్వాలన్నా, లేక బాధను వ్యక్తం చేస్తూ కన్నీళ్లు పెట్టుకోవాలన్నా మెదడు, శిరస్సు ఆరోగ్యంగా పనిచేయాలి. కానీ తలలో ఎన్నో సమస్యలు వేధిస్తున్నప్పుడు, దానికి వ్యాధి సోకినప్పుడు శరీరం నియంత్రణ కోల్పోతుంది. సరిగ్గా డాక్టర్ బిందు ఏర్పాటు చేసే మెడికల్ క్యాంప్‌లో ఇదే విషయాన్ని ప్రజలకు సవివరంగా చెబుతారు. క్యాంప్‌కి వచ్చే ఎంతోమంది రోగులకు అక్కడిక్కడే సూచనలు, సలహాలు ఇస్తూ, తమ వాహనంలోనే మెడికల్ చెకప్‌లు చేస్తారు. సమస్య పెద్దదైనప్పుడు స్ధానికంగా ఉన్న హాస్పిటల్‌కు సిఫార్సు కూడా చేస్తారు.

డాక్టర్ బిందు అందిస్తున్న ఉచిత నరాల వైద్యసేవలతో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. గత నాలుగేళ్లుగా  క్రమం తప్పకుండా  ఈ విధంగా మెడికల్ క్యాంప్‌లు ఏర్పాటు చేసి వేలాది మందికి ఉచితంగా వైద్యాన్ని అందించడంలో సఫలమయ్యారు. ప్రజలంతా మంచి ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలన్నదే తన ఉద్దేశమని అందుకే ఈ విధంగా సేవ చేస్తున్నట్టుగా డాక్టర్ బిందు చెబుతారు.