ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తుంది కొన్ని చానెల్స్ చూస్తే ! కోటంరెడ్డి

మీడియాలో తనపై వస్తున్న కథనాలు చూస్తుంటే ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుందంటూ నెల్లురు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చేసిన కామెంట్ కలకలం రేపుతోంది. కొంతమంది తనపై కక్షగట్టి మీడియాలో లేనిపోని రాతలు రాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేయడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తన సొంత పార్టీలోనే కోటంరెడ్డికి శత్రువులు ఉన్నట్టుగా ఆయన చెప్పకనే చెబుతున్నారు. అసలు మీడియాపై కోటం రెడ్డి ఎందుకు ఫైర్ అవుతున్నారు? కొన్ని పత్రికలంటూ ప్రత్యేకించి చెబుతున్నారు. అయనపై కావాలనే తప్పుడు వార్తలు రాస్తున్నారని..కొంతమంది దీని […]

ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తుంది కొన్ని చానెల్స్ చూస్తే !  కోటంరెడ్డి
Follow us

| Edited By:

Updated on: Oct 06, 2019 | 6:21 PM

మీడియాలో తనపై వస్తున్న కథనాలు చూస్తుంటే ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుందంటూ నెల్లురు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చేసిన కామెంట్ కలకలం రేపుతోంది. కొంతమంది తనపై కక్షగట్టి మీడియాలో లేనిపోని రాతలు రాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేయడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తన సొంత పార్టీలోనే కోటంరెడ్డికి శత్రువులు ఉన్నట్టుగా ఆయన చెప్పకనే చెబుతున్నారు. అసలు మీడియాపై కోటం రెడ్డి ఎందుకు ఫైర్ అవుతున్నారు? కొన్ని పత్రికలంటూ ప్రత్యేకించి చెబుతున్నారు. అయనపై కావాలనే తప్పుడు వార్తలు రాస్తున్నారని..కొంతమంది దీని వెనుక ఉన్నారనేది ఎమ్మెల్యే కోటంరెడ్డి ప్రధాన ఆరోపణ.

మీడియాలో వస్తున్న కథనాలు చూసి ఎంతో బాధ పడుతున్నానంటూ కోటంరెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో అధికార పార్టీ వైసీపీకి అనుకూల మీడియా, వ్యతిరేక మీడియాగా ఉన్న నేపధ్యంలో ఆయన స్వతహాగానే వ్యతిరేక మీడియానే టార్గెట్ చేస్తారని అంతా భావిస్తారు. కానీ అది కాదట. ఆయన బాధకు వేరే కారణం ఉందట. మిగిలిన మీడియాలో వస్తే ఆయన దాన్ని సున్నితంగా తీసుకునే వారేమో.. కానీ పార్టీకి దగ్గరగా ఉన్న ఓ మీడియాలో ఆయనకు వ్యతిరేకంగా వార్తలు రావడంతో కోటంరెడ్డి తీవ్ర మనోవేదనకు గురైనట్టుగా చెబుతున్నారు.

అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ.. వివాదాస్పద వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకోవడంతో సొంతపార్టీ కూడా ఆయన ప్రవర్తనపై గుర్రుగా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. తనను నమ్ముకున్న వారికోసం ఎంతకైనా తెగించడమే తన బలహీనత అంటూ కోటంరెడ్డి పలు మార్లు చెప్పుకొచ్చారు. తన సన్నిహితుల కోసం ఎంత వరకైనా వెళ్ళే మనస్తత్వం తనదని ఆయన చెబుతారు. అటువంటి ఎమ్మెల్యే కోటంరెడ్డి .. తన అనుచరుడు శ్రీకాంత్‌రెడ్డికి సంబంధించిన ఓ రియల్ ఎస్టేట్ పనికి సంబంధిన అప్రూవల్ ఇవ్వడంలో ఆలస్యం చేశారనే కారణంతో వెంకటాచలం మహిళా ఎంపీడీవో సరళ ఇంటికి శుక్రవారం అర్ధరాత్రి తన అనుచరులతో వెళ్లి భయభ్రాంతులకు గురిచేశారు.

ఎంపీడీఓ సరళ తనపై కేసు పెట్టించండంలో అసలు పాత్రధారులు వేరే ఉన్నారని కోటంరెడ్డి ఆరోపిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ముఖ్య అనుచరుడు ఇందులో కీలకంగా వ్యవహరించాడని, తనను పార్టీనుంచి తప్పించే పెద్ద కుట్ర జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారాయన. అయితే తాను ఎలాంటి తప్పు చేయకపోయినా.. తనకూ… జిల్లా ఎస్పీకి ఉన్న వ్యక్తిగత కారణాలతోనే తనను అరెస్టు చేశారని ఆరోపిస్తున్నారు కోటంరెడ్డి.

ఇదిలా ఉంటే సీఎం జగన్.. ఎమ్మెల్యే కోమటిరెడ్డి వ్యవహారశైలిపై కాస్త ఆగ్రహంతో ఉన్నట్టుగా తెలుస్తుంది. మహిళా ఎంపీడీవో సరళ ఇంటికి అర్ధరాత్రి వెళ్లడం, అతని అనుచరులతో సహా ఇంటి కరెంటు కట్ చేయడం, పైప్‌లైన్ తవ్వడం, చెత్తకుండీ పెట్టడం.. ఇలాంటి పనులు చేయడంపై సీఎం గుర్రుగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అధికారులతో అనుచితంగా ప్రవర్తిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించవద్దని డీజీపీ గౌతం సవాంగ్‌కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తప్పు చేసినట్లు తగిన ఆధారాలుంటే చట్ట ప్రకారం ఏ చర్యకైనా వెనుకాడవద్దని ఆదేశించారు. అయితే సీఎం ఆదేశాలు వెలువడిన వెంటనే శనివారం రాత్రి ఆయను అరెస్టు చేసుందుకు ఆయన నివాసానికి వెళ్లారు పోలీసులు.

అయితే అప్పటికి బాగా పొద్దుపోవడంతో ఆదివారం తెల్లవారు జామున అరెస్టు చేశారు. వెంటనే వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులు మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపర్చారు. విచారణ జరిపిన న్యాయమూర్తి కోటంరెడ్డికి బెయిల్ మంజూరు చేశారు. కాగా ఎమ్మెల్యే కోటంరెడ్డి, ఆయన అనుచరుడు శ్రీకాంత్‌రెడ్డిపై.. 290, 506, 448, 427 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.