కోవిడ్ అదుపునకు గట్టి పరిష్కారాలు అవసరం, అంతేగానీ, కాంగ్రెస్ మండిపాటు

దేశంలో పెరిగిపోతున్న కరోనా వైరస్ కేసుల పరిష్కారానికి పటిష్టమైన పరిష్కారాలు అవసరమని, అంతే గానీ మత బోధకుల్లా ప్రసంగాలు కాదని కాంగ్రెస్ పార్టీ ప్రధాని మోదీని ఉద్దేశించి వ్యాఖ్యానించింది.

  • Umakanth Rao
  • Publish Date - 1:53 pm, Wed, 21 October 20

దేశంలో పెరిగిపోతున్న కరోనా వైరస్ కేసుల పరిష్కారానికి పటిష్టమైన పరిష్కారాలు అవసరమని, అంతే గానీ మత బోధకుల్లా ప్రసంగాలు కాదని కాంగ్రెస్ పార్టీ ప్రధాని మోదీని ఉద్దేశించి వ్యాఖ్యానించింది. దేశ ప్రజలనుద్దేశించి మోదీ నిన్న సాయంత్రం 6 గంటలకు చేసిన ప్రసంగం మత బోధకుని స్పీచ్ మాదిరి ఉందని కాంగ్రెస్ అదికార ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జేవాలా విమర్శించారు. దేశానికి ఈ విధమైన ప్రసంగాలు కాదని, కోవిడ్ అదుపునకు గట్టి పరిష్కారాలు ఎంతైనా అవసరమని ఆయన చెప్పారు. ప్రపంచంలో మన దేశం కరోనా కేపిటల్ లా మారిపోయిందన్నారు. నాయకత్వ వైఫల్యంపై ప్రధాని జవాబు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ‘కోవిడ్ ని ఎలా అదుపు చేయాలి ? క్షీణించిపోతున్న ఎకానమీని ఎలా పునరుధ్దరించాలి ? వీటికి సొల్యూషన్స్ చెబుతారా, లేక దేవుడిదే ఈ తప్పంతా అని ఆయనపై నెట్టేస్తారా ? అని  సంయుక్త ప్రకటనలో రణదీప్ సింగ్ సూర్జేవాలా, పవన్ ఖేరా ప్రశ్నించారు.  బోధనలు ఇవ్వడం సులువేనని, కానీ అసలు సమస్యను పక్కన పెట్టరాదని వీరన్నారు.