UP Lok Sabha Bypolls: రెండు లోక్‌సభ స్థానాల్లో ఉప ఎన్నికల పోలింగ్.. పోలీసులపై అజం ఖాన్ సంచలన ఆరోపణలు

సమాజ్‌వాది పార్టీకి ఈ ఉప ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో సమాజ్‌వాది పార్టీ నేత అజం ఖాన్ యూపీ పోలీసులపై సంచలన ఆరోపణలు చేశారు.

UP Lok Sabha Bypolls:  రెండు లోక్‌సభ స్థానాల్లో ఉప ఎన్నికల పోలింగ్.. పోలీసులపై అజం ఖాన్ సంచలన ఆరోపణలు
Akhilesh Yadav Azam Khan
Follow us

|

Updated on: Jun 23, 2022 | 12:10 PM

UP Lok Sabha Bypoll: ఉత్తరప్రదేశ్‌లోని రెండు లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. అజంగఢ్, రాంపూర్ నియోజకవర్గాల్లో ఇవాళ (గురువారం) ఉదయం పోలింగ్ ప్రారంభమయ్యింది. పటిష్ట బందోబస్తు మధ్య ఉదయం 7 గం.లకు మొదలైన పోలింగ్.. సాయంత్రం 6 గం.ల వరకు కొనసాగనుంది. సమాజ్‌వాది పార్టీకి ఈ ఉప ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో సమాజ్‌వాది పార్టీ నేత అజం ఖాన్ యూపీ పోలీసులపై సంచలన ఆరోపణలు చేశారు. రాంపూర్ నియోజకవర్గ ప్రజలను బుధవారం రాత్రి పోలీసులు భయబ్రాంతులకు గురిచేసినట్లు ఆరోపించారు. రాంపూర్‌లో ఎక్కడ చూసినా సైరన్ శబ్ధాలు, జీపులు కనిపించాయన్నారు. కొందరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లను తీసుకెళ్లి కొట్టారని ఆరోపించారు. నియోజకవర్గంలో కొన్ని చోట్ల స్వయంగా పోలీసులే డబ్బు పంపిణీ యేశారని.. ఇది సిగ్గుచేటంటూ ఆరోపణలు గుప్పించారు. దీనిపై ప్రశ్నించేందుకు వెళ్లిన తమ పార్టీ నేతల పట్ల పోలీసు అధికారులు అమర్యాదకరంగా ప్రవర్తించినట్లు ANIకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ధ్వజమెత్తారు.

తనపై ఉన్న క్రిమినల్ కేసుల గురించి అజం ఖాన్ ప్రస్తావిస్తూ.. ‘అవును, నేను క్రిమినల్‌నే, అంగీకరిస్తున్నా..’ అంత మాత్రాన రాంపూర్ నియోజకవర్గ ప్రజలందరినీ క్రిమినల్స్‌లా చూడడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. పోలీసులు ఎన్ని రకాలుగా ఇబ్బందిపెట్టినా తాము తలొగ్గే ప్రశ్నే లేదన్నారు.

ఇవి కూడా చదవండి

ఈ ఏడాది మొదట్లో జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో సమాజ్‌వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. దీంతో అజంగఢ్ లోక్‌సభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమయ్యింది.

అలాగే సమాజ్‌వాది పార్టీ సీనియర్ నేత అజం ఖాన్ ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో తన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో రాంపూర్ లోక్‌సభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమయ్యింది. ఈ రెండు నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో 19 మంది అభ్యర్థులు బరిలో నిలుస్తున్నారు. దాదాపు 35 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ రెండు లోక్‌సభ నియోజకవర్గాలను తిరిగి దక్కించుకోవడం సమాజ్‌వాది పార్టీకి సవాలుగా మారింది. రాంపూర్‌లో బీజేపీ నుంచి సమాజ్‌వాది పార్టీకి గట్టి పోటీ ఎదురవుతోంది. మాయావతి సారథ్యంలోని బీఎస్పీ రాంపూర్ ఉప ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. అజంగఢ్ నియోజకవర్గంలో బీజేపీ, సమాజ్‌వాది పార్టీ, బీఎస్పీల మధ్య త్రిముఖ పోటీ నెలకొంటోంది. అక్కడ బీజేపీ తరఫున దినేష్ లాల్ యాదవ్, సమాజ్‌వాది పార్టీ తరఫున ధర్మేంద్ర యాదవ్, బీఎస్పీ తరఫున షా ఆలం పోటీ చేస్తున్నారు. రాంపూర్‌లో ఎస్పీ తరఫున అజీమ్ రాజా, బీజేపీ అభ్యర్థి ఘనశ్యామ్ సింగ్ లోధి బరిలో ఉన్నారు. ఉప ఎన్నిక జరుగుతున్న రెండు చోట్లా కాంగ్రెస్ పార్టీ పోటీ చేయడం లేదు.

2019 లోక్‌సభ ఎన్నికల్లో సమాజ్‌వాది పార్టీ, బీఎస్పీ మధ్య పొత్తులో భాగంగా అఖిలేష్ యాదవ్ అజంగఢ్ నుంచి పోటీ చేశారు. ఆయనకు 6.21 లక్షల ఓట్లు పోల్ కాగా.. బీజేపీ అభ్యర్థి దినేష్ లాల్ యాదవ్‌కు 3.61 లక్షల ఓట్లు దక్కాయి. ఉప ఎన్నికలు జరుగుతున్న రెండు నియోజకవర్గాల్లోనూ ఎన్నికల ప్రచారానికి బీజేపీ జాతీయ నాయకత్వం దూరంగా ఉంది. రెండు నియోజకవర్గాల్లోనూ బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అజంగఢ్ లోక్‌సభ పరిధిలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమాజ్‌వాది పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు.

అఖిలేష్ యాదవ్, ఆయన సతీమణి డింపుల్ ఉప ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాంపూర్‌లో అజం ఖాన్‌కు మొత్తం 5,59,177 ఓట్లతో విజయం సాధించగా.. బీజేపీ అభ్యర్థి జయ ప్రదకు 4,49,180 ఓట్లు పోల్ అయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి సంజయ్ కపూర్‌కి డిపాజిట్లు దక్కలేదు.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి..