‘ఆ పిటిషన్లపై ఈ నెల 6 న విచారణ జరపాలి’.. ఢిల్లీ హైకోర్టుకు ‘సుప్రీం’ సూచన

ఢిల్లీ హింసపై దాఖలైన అన్ని పిటిషన్లపైనా ఢిల్లీ హైకోర్టు ఈ నెల 6 న (శుక్రవారం) విచారణ జరపాలని సుప్రీంకోర్టు సూచించింది. ఢిల్లీ అల్లర్లను ప్రేరేపించేట్టు విద్వేష పూరిత ప్రసంగాలు చేసిన నేతలమీద చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్లు కూడా వీటిలో ఉన్నాయి.

'ఆ పిటిషన్లపై ఈ నెల 6 న విచారణ జరపాలి'.. ఢిల్లీ హైకోర్టుకు 'సుప్రీం' సూచన
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 04, 2020 | 5:56 PM

ఢిల్లీ హింసపై దాఖలైన అన్ని పిటిషన్లపైనా ఢిల్లీ హైకోర్టు ఈ నెల 6 న (శుక్రవారం) విచారణ జరపాలని సుప్రీంకోర్టు సూచించింది. ఢిల్లీ అల్లర్లను ప్రేరేపించేట్టు విద్వేష పూరిత ప్రసంగాలు చేసిన నేతలమీద చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్లు కూడా వీటిలో ఉన్నాయి. అయితే తమ వాదనలు వినిపించేందుకు తమకు మరింత వ్యవధి కావాలని కేంద్రం చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అలాగే-ఈ పిటిషన్లపై హైకోర్టు వాయిదాలు వేయడాన్ని కూడా అత్యున్నత న్యాయస్థానం తప్పు పట్టింది. ఈ విధమైన విషయాల్లో జాప్యం జరగడం న్యాయ సమ్మతం కాదని పేర్కొంది. శుక్రవారం ఎట్టి పరిస్థితుల్లోనూ హైకోర్టు చీఫ్ జస్టిస్ ముందు వీటి తాలూకు లిస్ట్ ఉండితీరాలని చీఫ్ జస్టిస్ బాబ్డే ఆదేశించారు.  ద్వేష పూరిత ప్రసంగాలు చేసిన బీజేపీ నేతలమీద వెంటనే చర్యలు తీసుకోవాలని పలువురు బాధితులు తమ పిటిషన్లలో కోరారు. వారిపై ఏ విధమైన చర్యలు తీసుకున్నారో నాలుగు వారాల్లోగా తెలియజేయాలని ఢిల్లీ హైకోర్టు గత వారం  పోలీసులను ఆదేశించిందని, అయితే ఇది సుదీర్ఘ కాలమని బాధితులు.. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లలో పేర్కొన్నారు. కానీ ఇంత దీర్ఘకాలం సముచితం కాదని సీజెఐ అభిప్రాయపడ్డారు. కాగా-నేతలు రెండు, మూడు చోట్ల చేసిన ప్రసంగాలే అల్లర్లకు కారణమయ్యాయన్న వాదనను కేంద్రం తరఫు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తోసిపుచ్చుతూ ఇది అర్థరహితమన్నారు. కానీ ఆయన అభిప్రాయాన్ని కోర్టు తోసిపుచ్చింది. ఇప్పటికే ఆలస్యం జరిగిందని, ఇక మరింత జాప్యం తగదని సీజేఐ పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన హింస, అల్లర్లు, ఘర్షణల్లో 48 మంది మృతి చెందగా.. 200 మందికి పైగా గాయపడ్డారు.