కశ్మీర్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. వ్యాపారి, కార్మికుడు మృతి

కశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. షోపియాన్ జిల్లాలోని త్రెంజ్ ప్రాంతంలో బుధవారం రాత్రి 7.30గంటల సమయంలో యాపిల్ పండ్ల వ్యాపారులు చరణ్ జిత్ సింగ్, సంజీవ్‌పై కాల్పులు జరిపారు. తీవ్ర గాయాలపాలైన ఆ ఇద్దరిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ చరణ్‌జిత్ చనిపోయారు. సంజీవ్ పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. సుమారు నలుగురు ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సమాచారం అందుకున్న భద్రతా దళాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు […]

  • Tv9 Telugu
  • Publish Date - 8:48 am, Thu, 17 October 19
కశ్మీర్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. వ్యాపారి, కార్మికుడు మృతి

కశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. షోపియాన్ జిల్లాలోని త్రెంజ్ ప్రాంతంలో బుధవారం రాత్రి 7.30గంటల సమయంలో యాపిల్ పండ్ల వ్యాపారులు చరణ్ జిత్ సింగ్, సంజీవ్‌పై కాల్పులు జరిపారు. తీవ్ర గాయాలపాలైన ఆ ఇద్దరిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ చరణ్‌జిత్ చనిపోయారు. సంజీవ్ పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. సుమారు నలుగురు ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సమాచారం అందుకున్న భద్రతా దళాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

మరోవైపు బుధవారం పుల్వామా జిల్లాలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. కాకపోరా ప్రాంతంలో ఓ కార్మికుడిని హతమార్చారు. మృతుడిని చత్తీస్‌గఢ్‌కు చెందిన సెథీ కుమార్‌గా గుర్తించారు. కశ్మీర్‌లో సెథీ కుమార్ ట్రక్కు డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. కాగా రెండు రోజుల క్రితం పండ్ల లోడుతో వెళ్తున్న ఓ ట్రక్కుపై దాడిచేసిన ఉగ్రవాదులు.. డ్రైవర్‌ను కాల్చి చంపారు. పండ్ల వ్యాపారిపైనా దాడి చేసి చితకబాదారు. అయితే కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేసిన 72 రోజుల తర్వాత మొబైల్ సేవలు ఇటీవలే ప్రారంభమయ్యాయి. మొబైల్ సేవలు ప్రారంభమైన తర్వాత ఉగ్రవాదులు ఇప్పటివరకు నాలుగు సార్లు దాడులకు పాల్పడ్డారు. కశ్మీర్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడంతో పాటు రవాణాకు ఆటంకం కలిగించేందుకే ఉగ్రవాదులు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు కశ్మీర్‌లో 300కు పైగా ఉగ్రవాదులు నక్కి ఉన్నారని వారందరినీ ఏరి పారేస్తామని ఇటీవల జమ్ముకశ్మీర్ డీజీపీ దిల్‌బాల్ సింగ్ తెలిపిన విషయం తెలిసిందే.