పని ప్రదేశాల్లో మహిళలకు లైంగికవేధింపులు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

కార్యాలయాలు, పని ప్రదేశాల్లో మహిళలకులైంగిక వేధింపులు వారి ప్రాథమిక హక్కులను హరించడమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇలా వేధింపులకు గురి చేయడమంటే వారు గౌరవంగా జీవించే హక్కు, సమానత్వపు హక్కులను...

  • Umakanth Rao
  • Publish Date - 2:22 pm, Thu, 12 March 20
పని ప్రదేశాల్లో మహిళలకు లైంగికవేధింపులు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

కార్యాలయాలు, పని ప్రదేశాల్లో మహిళలకులైంగిక వేధింపులు వారి ప్రాథమిక హక్కులను హరించడమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇలా వేధింపులకు గురి చేయడమంటే వారు గౌరవంగా జీవించే హక్కు, సమానత్వపు హక్కులను నిరాకరించడమే అని పేర్కొంది. మధ్యప్రదేశ్ లో ఓ బ్యాంక్ ఉద్యోగిని తన సీనియర్ అధికారి తనను లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపించగా.. ఇందుకు ప్రతీకారంగా ఆమెను బదిలీ చేస్తూ ఆ బ్యాంకు యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. అయితే దీనిపై ఆమె కోర్టుకెక్కగా.. బ్యాంకు నిర్ణయాన్ని కొట్టివేస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పునిచ్చింది. ఆ తీర్పు సబబేనని అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. కార్యాలయాలు, పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ, నిషేధ సంస్కరణ చట్టం -2013 ప్రకారం.. వారి  హక్కులను కాలరాయడమే అని న్యాయమూర్తులు డీవై.చంద్రచూడ్, అజయ్ రస్తోగీలతో కూడిన బెంచ్ స్పష్టం చేసింది. ‘ఇది రాజ్యాంగం కల్పిస్తున్న ప్రాథమిక హక్కులను నిరాకరించడమే. .ఆర్టికల్ 14,15 ప్రకారం సమానత్వపు హక్కులను దూరం చేయడమే.. 21 వ అధికరణం కింద నచ్చిన ఉద్యోగం లేదా వ్యాపారం లేదా వృత్తి చేసుకుంటూ గౌరవప్రదంగా జీవించే హక్కు మహిళలకు ఉంది’ అని ఈ ధర్మాసనం వివరించింది. వేధింపులకు గురి చేయడమంటే 21 వ అధికరణాన్ని ఉల్లంఘించడమే అని న్యాయమూర్తులు అన్నారు.

ఇండోర్ లోని పంజాబ్ అండ్ సింద్ బ్యాంకులో పని చేస్తున్న ఈ ఉద్యోగిని.. తనను ఉన్నతాధికారి లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించింది. లిక్కర్ కాంట్రాక్టర్ల అకౌంట్లకు సంబంధించిన ఫైళ్లలో అవకతవకలు, అవినీతి జరిగినట్టు తాను కనుగొన్నానని, ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు తెలియజేసినా ప్రయోజనం లేకపోయిందని ఆ బాధితురాలు పేర్కొంది. అవినీతిని ప్రశ్నించిన తనను  బదిలీ చేశారని ఆమె వాపోయింది. అయితే బ్యాంకు తరఫున వాదించిన అడ్వొకేట్.. ఈమె చేసిన ఆరోపణలు నిరాధారమన్నారు. కానీ ఆయన వాదనను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేస్తూ.. ఈ ఉద్యోగిని చేసిన ఆరోపణలు సహేతుకంగా ఉన్నాయని, ఆమెను పనిచేసిన చోటే ఉంచాలని, ఆమెకు పరిహారంగా రూ. 50 వేలు చెల్లించాలని తీర్పునిచ్చింది. గత నెల 25 న కోర్టు ఈ వెర్డిక్ట్ ప్రకటించింది.