అవసరానికి మించి ఆహార నిల్వలున్నా ఎగుమతి చేయలేకపోతున్నాం.. కారణమేంటంటే…?

తెలంగాణ రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వం మధ్య నలుగుతున్న ధాన్యం కొనుగోళ్ల పంచాయితీ దేశవ్యాప్తంగా పెద్ద చర్చకే దారితీసింది. ప్రస్తుత ఖరీఫ్ (వానాకాలం) సీజన్ నుంచి వచ్చిన దిగుబడి నుంచి..

అవసరానికి మించి ఆహార నిల్వలున్నా ఎగుమతి చేయలేకపోతున్నాం.. కారణమేంటంటే...?
Paddy Procurement
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Nov 26, 2021 | 3:35 PM

తెలంగాణ రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వం మధ్య నలుగుతున్న ధాన్యం కొనుగోళ్ల పంచాయితీ దేశవ్యాప్తంగా పెద్ద చర్చకే దారితీసింది. ప్రస్తుత ఖరీఫ్ (వానాకాలం) సీజన్ నుంచి వచ్చిన దిగుబడి నుంచి కేంద్రం సేకరించే ధాన్యం కోటాను పెంచాలని తెలంగాణ కోరుతుంటే, కొంత మేర కోటా పెంచేందుకు సానుకూలంగానే ఉన్న కేంద్రం, ఇప్పటికే పేరుకుపోతున్న నిల్వలతో తలపట్టుకుని కూర్చుంది. కొన్ని అంచనాల ప్రకారం ప్రతియేటా సుమారు 300 లక్షల మెట్రిక్ టన్నుల ఆహారధాన్యాలు మిగిలిపోతున్నాయని కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ వ్యవహారాల శాఖ చెబుతోంది. ఓవైపు బియ్యం, గోధుమ వంటి ఆహారధాన్యాల విషయంలో మిగులు ఏర్పడుతుంటే, మరోవైపు పప్పుదినుసులు, నూనె గింజలకు కొరత ఏర్పడి విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. అలాగని మన దగ్గర అవసరానికి మించి ఉన్న ఆహారధాన్యాల నిల్వలను ఎగమతి చేయడానికి వీల్లేకపోయింది. ఇందుకు ప్రపంచ వాణిజ్య సంస్థ (వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్) నిబంధనలే ప్రతిబంధకాలుగా మారాయి. ఈ మిగులు నిల్వలను పేద దేశాలకు, ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న దేశాలకు ఉచితంగా ‘సహాయం’ కింద ఇవ్వొచ్చు. అయితే కరోనా అనంతర పరిస్థితుల్లో ఉపాధి కోల్పోయిన కోట్లాది మంది ఆకలితో అలమటించకూడదు అన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం సేకరించిన ఆహారధాన్యాలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తోంది. వచ్చే ఏడాది మార్చి వరకు లెక్కగడితే కేంద్రం రూ. 2.6 లక్షల కోట్ల మేర ఆర్థికభారం పడుతోంది. ఈ పరిస్థితుల్లో ఇతర దేశాలకు కూడా ఉచితంగా ఇచ్చే పరిస్థితి లేదని కేంద్రంలోని కొందరు అధికారులు చెబుతున్నారు.

ఎందుకీ నిబంధనలు? ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలోనూ ఆహారభద్రతకు విఘాతం కలగకుండా ఉంటేందుకు WTO కొన్ని ఆంక్షలు, పరిమితులు విధించింది. ముఖ్యంగా పేద దేశాల్లో ప్రజలు ఆకలితో అలమటించకుండా ఉండేందుకు, ఆయా దేశాల్లో ఆహారభద్రతను కాపాడేందుకు WTO ఈ నిబంధనలు విధించింది. ఆ ప్రకారం ఏ దేశమైనా రైతుల నుంచి ఆహారభద్రతా చట్టం కింద సేకరించిన ఆహారధాన్యాలను, నిల్వ చేసిన తర్వాత వాటిని ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి వీల్లేదు. ఒకవేళ ఈ నిబంధన లేకపోతే, ధనిక దేశాలు తమ అవసరాల కోసం పేదదేశాల్లో పండించే ఆహారధాన్యాలను ఆయా దేశాల్లో ప్రజల అవసరాలకు కూడా దొరక్కుండా కొనుగోలు చేసే అవకాశం ఏర్పడుతుంది.

కిం కర్తవ్యం? ప్రభుత్వం సేకరించిన ఆహారధాన్యాలు మిగిలిపోతున్నా ఎగుమతికి ఆస్కారం లేని పరిస్థితుల్లో కొన్ని ప్రత్యామ్నాయాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వం నేరుగా ఎగుమతి చేయడానికి ఆస్కారం లేనప్పటికీ, ప్రైవేటు వ్యాపారులు ఎగుమతి చేసుకోవచ్చు. అయితే ప్రభుత్వం మధ్యవర్తిగా వ్యవహరిస్తూ సేకరించిన ధాన్యాన్ని నిల్వచేయకుండా నేరుగా వ్యాపారుల ద్వారా విదేశాలకు ఎగుమతి చేసే వెసులుబాటు ఉందని విదేశీ వ్యవహారాల శాఖలోని ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. సాధారణ పరిస్థితుల్లో ప్రైవేట్ బయ్యర్లు (కొనుగోలుదారులు) రైతుల నుంచి ధాన్యం కొని, విదేశాలకు ఎగుమతి చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో రైతులకు కనీస మద్ధతు ధర కూడా దక్కడం లేదు. ఉత్తరాదిన కొన్ని రాష్ట్రాల్లో మినహా చాలా రాష్ట్రాల్లో రైతులకు మద్ధతు ధర దక్కడం లేదనే విషయం పాలకులకు కూడా తెలుసు. ఈ పరిస్థితిని నివారించి, రైతులకు మేలు చేయాలనుకుంటే ధాన్యాన్ని ప్రభుత్వం కనీస మద్ధతు ధరతో సేకరించి, ఆ వెంటనే ప్రైవేటు వ్యాపారుల ద్వారా ఎగుమతి చేసే ఏర్పాటు చేస్తే సరిపోతుంది. సేకరించిన ధాన్యాన్ని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) లేదా మరేదైనా ప్రభుత్వ గోదాముల్లో నిల్వ చేసిన తర్వాత ఎగుమతి చేయడానికి మాత్రం వీలుండదు. ఈ వెసులుబాటు ప్రకారం ఎగుమతి చేయాలంటే ముందు అంతర్జాతీయంగా డిమాండ్ ఉండాలి.. డిమాండ్ లేనప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం శూన్యం.

Paddy Bags

Paddy Bags

ఎగుమతుల్లోనూ అగ్రస్థానంలో వరి ఇన్ని ప్రతిబంధకాల నడుమ దేశం నుంచి ఎగుమతి జరుగుతున్న ఆహారధాన్యాల్లో సింహభాగం ‘వరి’ అని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. భారత్ నుంచి గత ఆర్థిక సంవత్సరం (2020-21) ఆహారధాన్యాలు, తృణధాన్యాలు కలిపి మొత్తం రూ. 74,490.83 కోట్ల విలువైన ఎగుమతులు జరిగాయి. ఇందులో బాస్మతి రకం, నాన్-బస్మతి కలిపి బియ్యం వాటాయే 87.6% ఉంది. ఇక గోధుమలు, ఇతర తృణధాన్యాలు కలిపి 12.37% ఉన్నట్టు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖకు చెందిన ‘అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ’ (APFPEDA) గణాంకాలు పేర్కొంటున్నాయి. బాస్మతి రకం బియ్యాన్ని సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, యెమెన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి గల్ఫ్ దేశాలు అత్యధికంగా దిగుమతి చేసుకుంటుండగా, నాన్-బాస్మతి రకం బియ్యంతో పాటు గోధుమలను పొరుగు దేశాలు నేపాల్, బంగ్లాదేశ్‌తో పాటు ఇతర ప్రపంచ దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయి.

paddy

paddy

అధిక దిగుబడే అసలు కారణమా? దేశీయ వినియోగం, ఎగుమతి డిమాండ్‌ను మించిన దిగుబడి ఉన్నందునే ప్రస్తుతం వరి విషయంలో ఈ సమస్య ఏర్పడుతోందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అందుకే పంటమార్పిడి చేయాలని, దేశం దిగుమతి చేసుకుంటున్న పప్పు దినుసులు, నూనె గింజల సాగు చేయాలని రైతులను కోరుతోంది. తెలంగాణ వంటి రాష్ట్రాల్లో కొత్తగా నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులకు తోడు ఈ ఏడాది సమృద్ధిగా కురిసిన వర్షాల కారణంగా వరి దిగుబడి ఒక్కసారిగా భారీగా పెరిగిపోయింది. నీటి వినియోగం ఎక్కువ అవసరమయ్యే వరిని ఎగుమతి చేయడం అంటే దేశంలోని జల సంపదను ఎగుమతి చేసినట్టే అని కొందరు అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.

వరితో పోల్చితే ఇతర పంటలకు నీటి అవసరం తక్కువ. కనీసం రబీ (యాసంగి)లోనైనా ప్రత్యామ్నాయ పంటలను సాగుచేయాలని సూచిస్తోంది. తద్వారా దేశంపై దిగుమతి భారం తగ్గడంతోపాటు వరి విషయంలో ఏర్పడ్డ సమస్య కూడా పరిష్కారమవుతుందని చెబుతోంది. గత రెండుమూడేళ్లుగా పంటమార్పిడి గురించి చెబుతున్నప్పటికీ, రైతులు వరి పంటనే సాగుచేస్తున్నారని, చివరకు గోధుమ పండించే రాష్ట్రాలు సైతం రెండో పంటగా వరినే సాగుచేస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇందుకు కనీస మద్ధతు ధర దొరుకుతుందనేది ఒక కారణమని భావిస్తున్నారు. అయితే కనీస మద్ధతు ధర కల్పించే పంటల జాబితాలో వరి, గోధుమ, చెరకుతో పాటు ఇంకా చాలా పంటలున్నాయని, వాటికి దేశీయంగానే కాదు, ప్రపంచ మార్కెట్లోనూ చాలా డిమాండ్ ఉందని గుర్తుచేస్తున్నారు.

– మహాత్మ కొడియార్, ఢిల్లీ, టీవీ9 తెలుగు

Also Read..

Hyderabad: మొబైల్‌ దొంగల గుట్టు రట్టు.. 4 ముఠా గ్యాంగ్‌ల నుంచి 92 సెల్‌ఫోన్లు స్వాధీనం..

Black Friday Sale: బ్లాక్ ఫ్రైడే సేల్ అంటే తెలుసా.. ఇది ఎక్కడ ప్రారంభమైంది.. భారతదేశంలో ఎప్పుడు వచ్చింది..