Rajasthan Congress Crisis: గెహ్లాట్‌ ఇలా చేస్తారని ఊహించలేదు.. రాజస్థాన్‌ సంక్షోభంపై సోనియా గాంధీ అసంతృప్తి

Rajasthan Congress Crisis: అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్‌ పార్టీకి మరో తలనొప్పి వచ్చిపడింది. రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో తెలెత్తిన సంక్షోభంతో ఆ పార్టీ అగ్రనేతలు తలపట్టుకుంటున్నారు.

Rajasthan Congress Crisis: గెహ్లాట్‌ ఇలా చేస్తారని ఊహించలేదు.. రాజస్థాన్‌ సంక్షోభంపై సోనియా గాంధీ అసంతృప్తి
Sonia Gandhi Ashok Gehlot
Shaik Madarsaheb

|

Sep 27, 2022 | 5:45 AM

Rajasthan Congress Crisis: అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్‌ పార్టీకి మరో తలనొప్పి వచ్చిపడింది. రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో తెలెత్తిన సంక్షోభంతో ఆ పార్టీ అగ్రనేతలు తలపట్టుకుంటున్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడి రేసులో ఉన్న ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌.. సచిన్‌ పైలట్‌కు పగ్గాలు ఇచ్చేందుకు ససేమిరా అంటుండటంతో గంటగంటకు పరిణామాలు మారుతున్నాయి. ఈ క్రమంలో గెహ్లాట్‌ వర్గీయులు దాదాపు 92 మంది రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో కాంగ్రెస్‌ సీనియర్లు వారిని బుజ్జగించే పనిలో నిమగ్నమయ్యారు. రాజస్థాన్ రాజకీయ సంక్షోభం, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ వైఖరిపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాష్ట్ర ఇన్‌ఛార్జ్ అజయ్ మాకెన్, పరిశీలకుడు మల్లికార్జున్ ఖర్గేతో సోమవారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో గెహ్లాట్‌ వైఖరిపై సోనియా (Sonia Gandhi) అసంతృప్తి వ్యక్తం చేశారు. అశోక్ గెహ్లాట్ ఇలా చేస్తారని అస్సలు ఊహించలేదని సోనియా గాంధీ పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే పూర్తి నివేదిక అనంతరం క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు సమాచారం. శాసనసభా పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ముందు ఢిల్లీ నేతలు అశోక్ గెహ్లాట్‌తో పలుమార్లు మాట్లాడినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అయితే, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు విధేయులుగా ఉన్న ఎమ్మెల్యేలు పార్టీ తీర్మానానికి షరతులు విధించారని తెలుస్తోంది. సచిన్ పైలట్ కు బదులు తమలో ఒకరిని ముఖ్యమంత్రిగా చేయాలని పట్టుబడుతున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

అయితే.. రాజకీయ సంక్షోభంపై అశోక్‌ గెహ్లాట్‌ విచారం వ్యక్తంచేశారు. నాయకుడిని ఎన్నుకునే అధికారం సోనియా గాంధీకి ఇచ్చే ప్రతిపాదనపై అశోక్ గెహ్లాట్ సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అయితే ఎమ్మెల్యేల తిరుగుబాటు తరువాత, ఎమ్మెల్యేలు తన మాట వినడం లేదని గెహ్లాట్ పేర్కొన్నారు. ఈ మేరకు అశోక్ గెహ్లాట్ మల్లికార్జున్ ఖర్గే ఎదుట విచారం వ్యక్తం చేశారు. ఈ రోజు సాయంత్రం జరగనున్న శాసనసభా పక్ష అధికారిక సమావేశానికి కొందరు మంత్రులను కూడా పిలవనున్నారు.

రద్దయిన లెజిస్లేచర్ పార్టీ సమావేశం

ఆదివారం జైపూర్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మల్లికార్జున్ ఖర్గే, అజయ్ మాకెన్‌లను పరిశీలకులుగా, ఇన్‌ఛార్జ్‌లుగా నియమించారు. ఈ సమావేశానికి ముందు, గెహ్లాట్‌కు సన్నిహితుడైన మంత్రి శాంతి ధరివాల్ ఇంట్లో గెహ్లాట్ అనుకూల ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం రద్దయింది.

లిఖితపూర్వక నివేదికను కోరిన సోనియా గాంధీ..

రాజస్థాన్‌లో జరిగిన పరిణామాల అనంతరం మల్లికార్జున్ ఖర్గే, అజయ్ మాకెన్ ఢిల్లీకి తిరిగొచ్చారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసి ఇద్దరూ పూర్తి వివరాలను తెలియజేశారు. సోనియా గాంధీని కలిసిన అనంతరం అజయ్ మాకెన్ మాట్లాడుతూ.. పార్టీ అధ్యక్షుడు లిఖితపూర్వక నివేదికను కోరినట్లు చెప్పారు. ఈరోజు రాత్రి లేదా రేపు వారికి నివేదిక అందజేస్తామని పేర్కొన్నారు.

అధ్యక్షుడి ఎన్నికల రేసు నుంచి అశోక్ గెహ్లాట్ ఔట్?

కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నికకు నామినేషన్ వేసే చివరి తేదీ అయిన సెప్టెంబర్ 30 వరకు యథాతథ స్థితి కొనసాగుతుందని, ఆ తర్వాత తదుపరి చర్యలు తీసుకోనున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. సెప్టెంబర్ 30 తర్వాత కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకోనుంది. అశోక్ గెహ్లాట్‌ను దృష్టిలో ఉంచుకుని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకూడదని పార్టీ కోరుతోంది. అశోక్ గెహ్లాట్ పార్టీ అధ్యక్షుడయ్యే అవకాశం ఉన్నందున ఆయనకు అనుకూలంగా ఈ సమీకరణ జరిగినట్లు కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu