జైల్లో అర్ధరాత్రి హైడ్రామా.. పైకప్పు ఎక్కి ఖైదీల హంగామా.. రంగంలోకి పోలీస్ ఫోర్స్!
పంజాబ్‌లోని కపుర్తలా కేంద్ర కారాగారంలో శనివారం (మే 23) తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఖైదీల మధ్య తలెత్తిన ఒక చిన్న వివాదం పెద్ద ఘర్షణకు దారితీసింది. శనివారం రాత్రి సుమారు 9:30 గంటల ప్రాంతంలో జైలులోని బ్లాక్ నెంబర్-4 లో కొందరు ఖైదీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఇది కాస్తా క్షణాల్లోనే పరస్పర దాడులకు దారితీయడంతో జైలు ఆవరణంలో ఒక్కసారిగా కలకలం రేగింది.

ఘర్షణ తీవ్రరూపం దాల్చడంతో రంగంలోకి దిగిన జైలు యంత్రాంగం తక్షణమే స్థానిక పోలీసులకు సమాచారం అందించింది. దీంతో భారీగా పోలీస్ బలగాలు జైలుకు చేరుకున్నాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు, జైలు సిబ్బంది సంయుక్తంగా శ్రమించారు. ఈ గొడవ కేవలం బ్లాక్ నెంబర్-4 కే పరిమితం కావడంతో మిగిలిన బారెక్స్ సురక్షితంగా ఉన్నాయి. అయితే, ఘర్షణ సమయంలో కొందరు ఖైదీలు జైలు పైకప్పు పైకి ఎక్కి హంగామా సృష్టించారు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి వారిని సురక్షితంగా కిందకు దించారు.
ఈ ఘర్షణలో ముగ్గురు ఖైదీలకు గాయాలయ్యాయి. వారిని వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై జిల్లా ఎస్ఎస్పీ గౌరవ్ తూరా స్పందిస్తూ.. జైలులో ప్రస్తుతం శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉందని స్పష్టం చేశారు. జైలు నుంచి ఖైదీలు ఎవరూ తప్పించుకోలేదని, గాయపడిన వారికి కూడా ప్రాణాపాయం ఏమీ లేదని ఆయన వెల్లడించారు. జైలు పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశామని, ప్రజలు ఎలాంటి పుకార్లను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.
ఘటన అనంతరం జైలు అధికారులు ఖైదీల లెక్కింపు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. జైలులో అందరూ సురక్షితంగా ఉన్నారని నిర్ధారించుకున్నారు. పోలీసుల సత్వర స్పందన వల్ల ఒక పెద్ద ముప్పు తప్పిందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఉన్నతాధికారులు జైలులోని పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అసలు ఈ గొడవకు గల కారణాలపై సమగ్ర విచారణకు ఆదేశించారు. ఈ ఘటనతో కపుర్తలా జైలు వద్ద అదనపు బలగాలను మోహరించి, గట్టి నిఘా ఉంచారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.