Ram Setu: రామ సేతువును జాతీయ స్మారక చిహ్నంగా గుర్తిస్తారా!.. లేదా!.. సుప్రీం కోర్టు ప్రశ్నకు కేంద్రం ఏం చెప్పిందంటే..

రామ సేతువును జాతీయ స్మారక చిహ్నంగా గుర్తిస్తారా.. లేదా... ఇది.. మాజీ రాజ్య సభ సభ్యుడు సుబ్రమణ్య స్వామి 15 ఏళ్లుగా కేంద్రానికి పదే పదే వేస్తున్న ప్రశ్న. దీనిపై అప్పట్లోనే సుప్రీం కోర్టులో కేసు కూడా వేశారు. ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడ్డ ఈ కేసు.. ఇవాళ విచారణకు వచ్చింది. అయితే దీనిపై కేంద్రం ఈ సారి ఏం సమాధానం చెప్పింది.

Ram Setu: రామ సేతువును జాతీయ స్మారక చిహ్నంగా గుర్తిస్తారా!.. లేదా!.. సుప్రీం కోర్టు ప్రశ్నకు  కేంద్రం ఏం చెప్పిందంటే..
Ram Setu
Follow us

|

Updated on: Jan 19, 2023 | 7:51 PM

రామ సేతు మళ్లీ చర్చల్లోకొచ్చింది. ఈ సారి మాజీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్య స్వామి 8 ఏళ్ల క్రితం సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్ అందుకు కారణం. రామ సేతును జాతీయ స్మారక చిహ్నంగా గుర్తించాలంటూ ఆయన వేసిన పిటిషన్‌పై ఏళ్ల తరబడి విచారణ కొనసాగుతునే ఉంది. పదే పదే వాయిదాలు పడుతూ వస్తున్న ఈ కేసుపై గత ఏడాది నవంబర్లో కోర్టు కాస్త సీరియస్‌గానే స్పందించింది. సమాధానం చెప్పడంలో ఎందుకింత ఆలస్యం చేస్తున్నారని కేంద్రాన్ని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో ఈ విషయంలో కేంద్రం కోర్టుకు గురవారం పూర్తి స్పష్టతనిచ్చింది.

రామ సేతును జాతీయ స్మారక చిహ్నాంగా గుర్తించే ప్రక్రియ కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రస్తుతానికి కొనసాగుతోందని స్పష్టం చేసింది.అలాగే సుబ్రమణ్య స్వామి దగ్గర దీనికి సంబంధించి మరింత అదనపు సమాచారం ఉంటే నిరభ్యంతరంగా కేంద్రంతో పంచుకోవచ్చని, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలియజేశారు. అయితే ఇదే విషయంపై అవసరం అనుకుంటే సంబంధిత వ్యక్తిని కలవాలని కోర్టు సుబ్రమణ్య స్వామికి సూచించింది. అయితే ఆయన మాత్రం ఈ విషయంలో తాను ఏ ఒక్కర్నీ కలవదల్చుకోలేదని చెప్పారు. మేమంతా ఒకే పార్టీలో ఉన్నామని, రామ సేతును జాతీయ స్మారక చిహ్నాంగా గుర్తిస్తామన్నది బీజేపీ మ్యానిఫెస్టోలో కూడా ఉందని ఆయన గుర్తు చేశారు. ఎన్ని వారాల్లో నిర్ణయం తీసుకుంటారన్నది వాళ్ల ఇష్టానికే వదిలేస్తున్నానని సుబ్రమణ్య స్వామి అన్నారు. 2007లో సేతు సముద్రం షిప్ ఛానెల్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా రామ సేతును జాతీయ స్మారక చిహ్నంగా గుర్తించాలంటూ సుబ్రమణ్య స్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

కొద్ది రోజుల క్రితం ఇదే విషయంలో రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ రామ సేతు మూలాలకు సంబంధించి ఎలాంటి కచ్చితమైన ఆధారాలను భారతీయ ఉపగ్రహాలు గుర్తించ లేదంటూ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన సమాధానంపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. గతంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కూడా ఇదే విషయాన్ని చెప్పిందని, అప్పుడు కాంగ్రెస్ పార్టీని హిందూ వ్యతిరేక పార్టీగా బీజేపీ చిత్రీకరించిందంటూ ఆ పార్టీ నేతలు మండిపడ్డారు.

రాజ్య సభలో కేంద్రం ఈ ప్రకటన చేసిన కొద్ది రోజులకే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం రామ సేతు ప్రాజెక్టును తక్షణం పునరుద్ధరించాలంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన తీర్మానానికి ఏక గ్రీవంగా ఓటేసింది. ఆ ప్రాజెక్టు నిర్మించేందుకు పూర్తి సహాయ, సహాకారాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందంటూ ఆ తీర్మానంలో ప్రకటించింది. ఊహించని విధంగా బీజేపీ ఫ్లోర్ లీడర్ నైనార్ నాగేంద్రన్ రామ సేతు కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించిన విషయమని, ఆ వారధికి ఎలాంటి ముప్పు కలగకుండా ప్రాజెక్టును నిర్మిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కూడా స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం