Rajya Sabha: దక్షిణాది ప్రముఖులకు రాజ్యసభ నామినేటెడ్ పదవులు.. ప్రత్యేక అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రపతి కోటాలో నలుగురు దక్షిణాది సెలబ్రిటీలను రాజ్యసభకు (Rajya Sabha) నామినేట్‌ చేసింది. సినీ, క్రీడా, ధార్మిక రంగాలకు చెందన ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయ రాజా, ప్రముఖ దర్శక-రచయిత...

Rajya Sabha: దక్షిణాది ప్రముఖులకు రాజ్యసభ నామినేటెడ్ పదవులు.. ప్రత్యేక అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ
Ganesh Mudavath

|

Jul 06, 2022 | 10:32 PM

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రపతి కోటాలో నలుగురు దక్షిణాది సెలబ్రిటీలను రాజ్యసభకు (Rajya Sabha) నామినేట్‌ చేసింది. సినీ, క్రీడా, ధార్మిక రంగాలకు చెందన ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయ రాజా, ప్రముఖ దర్శక-రచయిత కే.విజయేంద్ర ప్రసాద్, పరుగుల రాణి పీటీ ఉషతో పాటు ధర్మస్థల ఆలయ ధర్మాధికారి వీరేంద్ర హెగ్గడేలను రాజ్యసభ సభ్యులుగా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM.Modi) ట్విటర్ ద్వారా నలుగురినీ విడివిడిగా అభినందించారు. క్రీడారంగంలో పీటీ ఉష సాధించిన విజయాలు ఎంతో ప్రశంసనీయమని, అలాగే ఎంతో మంది క్రీడాకారులను తయారు చేస్తున్న ఆమె కృషి కూడా అంతే ప్రశంసనీయమని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. ఇక సంగీత దర్శకుడు ఇళయరాజా గురించి ప్రస్తావిస్తూ ఆయన సృజనాత్మక కళ ఎన్నో భావోద్వేగాలకు ప్రతిబింబంగా నిలిచిందని కొనియాడారు. ఆయన ఎదిగొచ్చిన నేపథ్యం, సాగించిన జీవన ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని అన్నారు. కొన్ని తరాలను ఆయన సంగీతంతో అలరించారని ప్రశంసించారు.

ధర్మస్థల ఆలయ ధర్మాధికారి వీరేంద్ర హెగ్గడే గురించి ప్రస్తావిస్తూ.. సామాజిక సేవలో ఆయన సేవ అమోఘమని కొనియాడారు. ధర్మస్థల ఆలయాన్ని సందర్శించే అవకాశం లభించినప్పుడు తాను స్వయంగా విద్య, సంస్కృతి, ఆరోగ్య రంగాల్లో వీరేంద్ర హెగ్గడే చేస్తున్న విశేష కృషిని చూశానని పేర్కొన్నారు. పార్లమెంటరీ కార్యాకలాపాలకు ఆయన మరింత వన్నె తెస్తారని అన్నారు. చివరగా దర్శక-రచయిత కేవీ విజయేంద్ర ప్రసాద్ (ప్రముఖ సినీ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తండ్రి) గురించి ట్వీట్ చేశారు. కొన్ని దశాబ్దాలుగా సృజనాత్మకతకు నిలయమైన సినీ రంగంలో ఉన్నారని, భారతదేశ ఘనమైన సంస్కృతీ-సంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా ప్రతిబింబించేలా ఆయన రచనలు చేశారని కొనియాడారు. ఈ నలుగురూ రాజ్యసభ సభ్యులుగా నామినేట్ అయిన సందర్భంగా అభినందనలు తెలియజేశారు.

ఉపరాష్ట్రపతిగా దక్షిణాదికి చెందిన ఎం. వెంకయ్య నాయుడు పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో రాజ్యసభకు నామినేట్ చేసిన నలుగురూ నాలుగు వేర్వేరు రాష్ట్రాలకు చెందిన దక్షిణాదివారే కావడం విశేషం. నాలుగు ప్రధాన భాషా సమూహాల నుంచి ఒక్కొక్కరిని బీజేపీ నాయకత్వం ఎంపిక చేసినట్టు స్పష్టమవుతోంది. పరుగుల రాణి పీటీ ఉష కేరళకు చెందినవారు (మలయాళీ) కాగా, ప్రఖ్యాత సంగీత దర్శకులు ఇళయరాజా తమిళనాడుకు చెందినవారు. వీరేంద్ర హెగ్గడే కర్నాటకకు చెందినవారు కాగా, విజయేంద్ర ప్రసాద్ తెలుగువారు. రాజ్యసభ నామినేటెడ్ పదవుల్లో వివిధ రంగాల్లో విశేష సేవ చేసినవారిని నియమిస్తుంటారు. ఈ నలుగురి ఎంపిక చాలా వ్యూహాత్మకంగా జరిగినట్టుగా అర్థమవుతోంది. బీజేపీ తదుపరి లక్ష్యం దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరించడమే అన్న విషయం అందరికీ తెలిసిందే.

ఇప్పటికే కర్నాటకలో అధికారంలో ఉన్న కమలదళం, పక్కనే ఉన్న తెలంగాణపై దృష్టి కేంద్రీకరించినట్టు ఈమధ్య చోటుచేసుకున్న పరిణామాలను గమనిస్తే ఇట్టే అర్థమవుతుంది. వీటితో పాటు ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్న కమలనాథులు, ఆయా భాషా సమూహాలను ఆకట్టుకునే క్రమంలో అందరికీ సుపరిచితులైన సినీ, క్రీడా, ధార్మిక రంగ ప్రముఖులను ఎంపిక చేసింది. బీజేపీ అంటే ఉత్తర భారత రాజకీయ పార్టీ అన్న ముద్రను చెరిపేసుకునే క్రమంలో ఇలాంటి నిర్ణయాలు ఉపయోగపడతాయని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. దక్షిణాది రాష్ట్రాలకు నిధులు, ప్రాజెక్టుల కేటాయింపుల్లో అన్యాయం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న సమయంలో బీజేపీ నాయకత్వం తీసుకున్న ఈ నిర్ణయం దక్షిణాది ప్రజల భావోద్వేగాలను దృష్టిలో పెట్టుకుని తీసుకున్నదే అని తెలుస్తోంది

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu