Uttarakhand joshimath Dam News: ఉత్తరాఖండ్ కు ఈ దేశం అండగా ఉంటుంది, ప్రతివారి రక్షణకు ప్రార్థిస్తోంది, ప్రధాని మోదీ

ఆకస్మిక వరదలకు గురై, కొండ చరియలు విరిగిపడి పెను ప్రకృతి వైపరీత్యానికి గురైన  ఉత్తరాఖండ్ రాష్ట్రానికి ఈ దేశం అండగా ఉంటుందని..

Uttarakhand joshimath Dam News: ఉత్తరాఖండ్ కు ఈ దేశం అండగా ఉంటుంది, ప్రతివారి రక్షణకు ప్రార్థిస్తోంది, ప్రధాని మోదీ
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 07, 2021 | 3:21 PM

Uttarakhand joshimath Dam News: ఆకస్మిక వరదలకు గురై, కొండ చరియలు విరిగిపడి పెను ప్రకృతి వైపరీత్యానికి గురైన  ఉత్తరాఖండ్ రాష్ట్రానికి ఈ దేశం అండగా ఉంటుందని ప్రధాని మోదీ అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. అక్కడి ప్రతివారి భద్రత, రక్షణ కోసం ఈ దేశం యావత్తూ ప్రార్థిస్తోందని, తను ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితిని గురించి సీనియర్ అధికారుల నుంచి తెలుసుకుంటున్నానని అన్నారు. సమాచారం తెలిసినవెంటనే సహాయక బృందాలను  ఉత్తరాఖండ్ కు పంపినట్టు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం మోదీ అసోం, బెంగాల్ రాష్ట్రాల పర్యటనలో ఉన్నారు. ఉత్తరాఖండ్ లోని అలకానంద, ధౌలి గంగా నదులకు ఆకస్మికంగా వరదలు రావడంతో  సమీపంలోని రిషి గంగా ప్రాజెక్టుకు ముప్పు ముంచుకొచ్చింది. ఈ నదీతీర ప్రాంతాలలోని వేలాది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

హోం మంత్రి అమిత్ షా ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ తో ఫోన్ లో మాట్లాడి మీ రాష్ట్రానికి కేంద్రం నుంచి పూర్తి సాయం ఉంటుందని హామీ ఇచ్చారు. ఇప్పటికే నేషనల్ డిజాస్టర్  రెస్పాన్స్ ఫోర్స్ బృందాలను పంపినట్టు ఆయన ట్వీట్ చేశారు. ఛమోలీ జిల్లాలోని జోషీమఠ్ గ్లేసియర్ ఒక్కసారిగా ఉప్పొంగింది. రిషి గంగా ప్రాజెక్టు పవర్ ప్లాంట్ లో పని చేస్తున్న సుమారు 150 మంది సిబ్బంది అక్కడే  చిక్కుకుపోయినట్టు, వారిని రక్షించడానికి సహాయక సిబ్బంది యత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ వార్తలను అధికారులు ధ్రువీకరించలేదు.