PM Modi: కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్..? ఏపీ, తెలంగాణ నేతలకు జాక్‌పాట్..!
కేంద్రంలో మోదీ సర్కార్ 12 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానానికి చేరుకుంటున్న వేళ.. అటు కేబినెట్ ప్రక్షాళన, ఇటు దేశవ్యాప్తంగా భారీ ఉత్సవాలకు బీజేపీ అధిష్ఠానం పక్కా ప్లాన్ రెడీ చేసింది. ముఖ్యంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సీనియర్లకు, అలాగే ఏపీ, బీహార్‌లోని మిత్రపక్షాలకు ఈ పునర్వ్యవస్థీకరణలో సముచిత స్థానం దక్కబోతున్నట్లు సమాచారం.

మోదీ 3.0 ప్రభుత్వం మరో కొన్ని రోజుల్లో రెండేళ్ల పాలనను విజయవంతంగా పూర్తి చేసుకోనుంది. ఈ కీలక మైలురాయిని పురస్కరించుకుని కేంద్రమంత్రివర్గంలో భారీ మార్పులు, చేర్పులకు అంతర్గతంగా చకచకా సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గత శాఖల వారీగా మంత్రుల పనితీరుపై ప్రధాని మోదీ క్షుణ్ణంగా సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పథకాల అమలు, లక్ష్యాల సాధన, పరిపాలనా బాధ్యతల్లో ఎక్కడైనా లోపాలు ఉంటే వాటిపై ప్రత్యేక దృష్టి సారించారు. కొన్ని శాఖల పేలవమైన పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రధాని.. మంత్రులు, అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. దేశ పురోభివృద్ధే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సైనిక క్రమశిక్షణతో పని చేయాలని, ప్రజాధనాన్ని వీలైనంతగా పొదుపు చేయాలని స్పష్టం చేశారు. మారుతున్న అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వ వ్యవస్థ పనితీరు మారాలని, వికసిత భారత్ లక్ష్యం కోసం రంగాల వారీగా దూసుకుపోవాలని మోదీ పిలుపునిచ్చారు.
20 నుంచి 30 మంది మంత్రుల మార్పు..
ఈసారి జరగబోయే పునర్వ్యవస్థీకరణలో దాదాపు 20 నుంచి 30 మంది మంత్రుల వరకు మార్పులు చేర్పులు ఉండవచ్చని ఢిల్లీ వర్గాల సమాచారం. పనితీరు సరిగ్గా లేని కొందరు సీనియర్లను తప్పించి, వారి స్థానంలో కొత్త ముఖాలకు, ముఖ్యంగా యువత, మహిళలకు కేబినెట్‌లో చోటు కల్పించే యోచనలో బీజేపీ అధిష్ఠానం ఉంది. గతంలో మోదీ 2.0 హయాంలో జూలై 7, 2021న జరిగిన అతిపెద్ద కేబినెట్ ప్రక్షాళనలో 43 మంది కొత్త మంత్రులు ప్రమాణం చేయగా, 12 మంది సీనియర్లకు ఉద్వాసన పలికారు. ఇప్పుడు కూడా అదే తరహాలో గట్టి నిర్ణయాలు తీసుకోనున్నారు. అయితే రాబోయే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని, క్షేత్రస్థాయిలో పట్టున్న కొందరు అనుభవజ్ఞులైన సీనియర్ నేతలకు మళ్లీ కేబినెట్‌లో చాన్స్ ఇవ్వనున్నారు.
ఏడు రాష్ట్రాల ఎన్నికలే టార్గెట్..
రాబోయే 2027 నాటికి దేశంలోని ఏడు కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగా వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చి నెలల్లోనే ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాలకు.. అలాగే ఈ ఏడాది నవంబర్-డిసెంబర్‌లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ ఎన్నికలను బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుండటంతో ఆయా రాష్ట్రాల నుంచి గెలిచిన నేతలకు కేంద్ర కేబినెట్‌లో సముచిత స్థానం దక్కనుంది. మరోవైపు దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలనే వ్యూహంలో భాగంగా తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా కొందరు కీలక నేతలకు మంత్రివర్గంలో ప్రాధాన్యత ఇచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
పార్టీ లైన్‌లో సంస్థాగత మార్పులు..
జూన్ 9 నాటికి మోదీ ప్రభుత్వం కేంద్రంలో 12 ఏళ్ల సుదీర్ఘ పాలనను పూర్తి చేసుకోనుంది. ఈ లోపే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ తన నూతన కార్యవర్గాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల వల్ల ఈ ప్రక్రియ ఆలస్యమైంది. అలాగే యూపీలో కొత్తగా ఎన్నికైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పంకజ్ చౌదరి కూడా తన కొత్త టీమ్‌ను ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గం నుండి ఉద్వాసనకు గురయ్యే సీనియర్ నేతలను జాతీయ స్థాయిలో నితిన్ నవీన్ టీమ్‌లోకి తీసుకునే చాన్స్ ఉంది. దీనివల్ల ప్రభుత్వంలో బాధ్యతలు తగ్గినా.. పార్టీ పరంగా వారికి తగిన గౌరవం ఇచ్చినట్లు అవుతుందని బీజేపీ భావిస్తోంది. అలాగే మోదీ 3.0 లో ఉన్న మిత్రపక్షాల సూచనల మేరకు కేంద్ర మంత్రివర్గంలో మార్పులు ఉంటాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాల నుంచి మిత్రపక్షాల నేతలకు కేబినెట్‌లో మరికొన్ని కీలక పదవులు దక్కే అవకాశాలు ఉన్నాయి.
12 ఏళ్ల పాలన.. దేశవ్యాప్తంగా బీజేపీ భారీ ఉత్సవాలు..
కేంద్రంలో మోదీ సర్కార్ 12 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జూన్ 5 నుంచి 21 వరకు “12 ఏళ్ల విశ్వాసం-వికాసం-జన సంక్షేమం” పేరిట దేశవ్యాప్తంగా భారీ ఎత్తున వేడుకలు నిర్వహించాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ రాష్ట్రాల అధ్యక్షులను ఆదేశించారు. జూన్ 8, 9 తేదీల్లో ఢిల్లీలో భారీ మీడియా సంవాద్ కార్యక్రమం, జూన్ 11, 12 తేదీల్లో ఎన్డీయే ముఖ్యమంత్రులు, మంత్రుల ప్రత్యేక సమావేశం జరగనుంది. ప్రత్యేక జనసంపర్క ప్రచారంలో భాగంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు ఒక రోజంతా గడపనున్నారు. మూడు రోజుల పాటు జన సంక్షేమ శిబిరాలు నిర్వహించి ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల నమోదు కోసం ప్రత్యేక డ్రైవ్‌లు చేపడతారు.
జూన్ 5న అమ్మ పేరుతో ఒక మొక్క కార్యక్రమాన్ని, జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతి మండలంలో భారీగా నిర్వహించనున్నారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఇంధన సంక్షేమ పరిస్థితుల దృష్ట్యా నేతలు వ్యక్తిగత కాన్వాయ్‌లు కాకుండా కార్ పూలింగ్ లేదా ప్రజా రవాణాను వాడాలని అధిష్ఠానం కఠిన ఆదేశాలు జారీ చేసింది. అలాగే కేవలం స్వదేశీ ఉత్పత్తులనే ప్రోత్సహించాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసింది.
