‘భారతీయ వాయుయాన్ విధేయక్’ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం.. అసలు ఇంతకీ అదేంటంటే
విమానరంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు వీలుగా 90 ఏళ్ల క్రితం నాటి 1934 ఎయిర్‌క్రాఫ్ట్ యాక్ట్‌ను మార్చేందుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఈ చట్టం స్థానంలో..
విమానరంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు వీలుగా 90 ఏళ్ల క్రితం నాటి 1934 ఎయిర్‌క్రాఫ్ట్ యాక్ట్‌ను మార్చేందుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఈ చట్టం స్థానంలో ‘భారతీయ వాయుయాన్ విధేయక్ 2024’ను తీసుకొచ్చే బిల్లుకు మూజువాణి ఓటు ద్వారా రాజ్యసభ ఆమోదముద్ర వేసింది. అనవసర నిబంధనలు తొలగించడం, 21 సార్లు సవరించిన 1934 నాటి చట్టం స్థానంలో వేరే చట్టాన్ని తేవాలని ఈ బిల్లులో ప్రతిపాదించారు.
దీనిపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు రాజ్యసభలో మాట్లాడుతూ.. ‘బిల్లును ఆంగ్లం నుంచి హిందీలోకి మార్చడంపై చాలామంది సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే భారతదేశ వారసత్వం, సంస్కృతిని చాటి చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ మార్పులు చేశామని.. రాజ్యాంగ నియమాల ఉల్లంఘన జరగలేదని’ స్పష్టం చేశారు. తొలుత హిందీలో ఈ బిల్లు పేరును పలకడం కష్టంగా ఉండొచ్చునేమో గానీ.. ఆ తర్వాత వారు దానికి అలవాటు పడతారని, సులువు అవుతుందని చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలను అందుకునేందుకు వీలుగా ఏవియేషన్ రంగంలో వలసల వారసత్వాన్ని నిలిపివేసే దిశగా ఈ బిల్లును రూపొందించినట్టు మంత్రి వెల్లడించారు.
ఆగష్టు 19, 1934న ఎయిర్‌క్రాఫ్ట్ యాక్ట్ 1934కి అప్పటి గవర్నర్ జనరల్ ఆమోదం తెలిపారు. అలాగే ఆ చట్టంలో అనేకసార్లు సవరింపులు జరిగాయి. పెరుగుతున్న విమాన ఛార్జీలపై కొంతమంది ఎంపీలు ఆందోళనలు చేయగా.. దానికి మంత్రి స్పందిస్తూ.. ఉడాన్ పథకం ద్వారా కొంత మేరకు ఛార్జీలను అందరికీ అందుబాటులో ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి అన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..