ప్లాస్మా థెరపీ వల్ల ప్రయోజనం లేదా ? ఎయిమ్స్ తొలి విశ్లేషణ !

ప్లాస్మా థెరపీ వల్ల కోవిడ్ రోగుల్లో మరణాల సంఖ్య తగ్గుతుందని చెప్పలేమని ఢిల్లీలోని అఖిల భారత వైద్య శాస్త్రాల సంస్థ (ఎయిమ్స్) అభిప్రాయపడుతోంది. ఈ తరహా ట్రీట్ మెంట్ ను ఉపయోగించి..

  • Publish Date - 6:40 pm, Thu, 6 August 20 Edited By: Pardhasaradhi Peri
ప్లాస్మా థెరపీ వల్ల ప్రయోజనం లేదా ? ఎయిమ్స్ తొలి విశ్లేషణ !

ప్లాస్మా థెరపీ వల్ల కోవిడ్ రోగుల్లో మరణాల సంఖ్య తగ్గుతుందని చెప్పలేమని ఢిల్లీలోని అఖిల భారత వైద్య శాస్త్రాల సంస్థ (ఎయిమ్స్) అభిప్రాయపడుతోంది. ఈ తరహా ట్రీట్ మెంట్ ను ఉపయోగించి మరణాల సంఖ్యను తగ్గించగలుగుతామా అన్న విషయమై ఈ సంస్థ రాండమైజ్ చేసిన ట్రయల్ ని నిర్వహించింది. కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్న రోగి నుంచి యాంటీ బాడీలను సేకరించి విషమ స్థితిలో ఉన్న రోగులకు ఇవ్వడంవల్ల వారిలో రోగనిరోధక శక్తి పెరిగి, త్వరగా కోలుకోగలుగుతారన్న ప్రచారం ఉంది. దీన్నే ప్లాస్మా థెరపీగా వ్యవహరిస్తున్నారు. కానీ కోవిడ్ సోకిన 30 మంది రోగులపై తాము ట్రయల్ నిర్వహించగా మరణాల రేటు తగ్గిన దాఖలాలు కనబడలేదని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. ఒక గ్రూపు రోగులకు ప్లాస్మా థెరపీ చికిత్సను, మరో గ్రూపు పేషంట్లకు సాధారణ ట్రీట్ మెంట్ ను ఇస్తూ వచ్చామని, కానీ ఈ రెండు గ్రూపుల్లోనూ మరణాల సంఖ్య దాదాపు సమానంగా ఉందని ఆయన చెప్పారు.

రోగుల కండిషన్ లో క్లినికల్ మెరుగుదల పెద్దగా కనిపించలేదు.. అయితే ఇది మా తాత్కాలిక విశ్లేషణ మాత్రమే అని గులేరియా వెల్లడించారు. మరింత క్షుణ్ణంగా మదింపు, ట్రయల్స్ నిర్వహించాల్సి ఉంటుంది అని కూడా ఆయన అన్నారు. ప్లాస్మా థెరపీ వల్ల ఏ గ్రూప్ అయినా ప్రయోజనం పొందుతుందా అన్న దానిపై సమగ్ర పరీక్షలు జరపవలసి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మరోసారి క్లినికల్ ట్రయల్స్ ని నిర్వహించే అవకాశం ఉందన్నారు. ప్లాస్మా థెరపీ..ఉపయోగాలు అన్న అంశంపై బుధవారం ఎయిమ్స్ లో జరిగిన నిపుణుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.