‘నిసర్గ’ రాకాసి తుఫాన్ పై హైఅలర్ట్ !

అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘నిసర్గ’ రాకాసి తుఫాను దూసుకొస్తోంది. మహారాష్ట్ర, గుజరాత్, గోవా తీరాలపై ఈ తుఫాన్‌ విరుచుకుపడుతుందని ఐఎండీ హెచ్చరించడంతో ఆ మూడు రాష్ట్రాల్లో హై అలర్ట్‌ ప్రకటించారు.

‘నిసర్గ’ రాకాసి తుఫాన్ పై హైఅలర్ట్ !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 03, 2020 | 9:39 AM

అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘నిసర్గ’ రాకాసి తుఫాను దూసుకొస్తోంది. మహారాష్ట్ర, గుజరాత్, గోవా తీరాలపై ఈ తుఫాన్‌ విరుచుకుపడుతుందని ఐఎండీ హెచ్చరించడంతో ఆ మూడు రాష్ట్రాల్లో హై అలర్ట్‌ ప్రకటించారు. ముంబైకి సమీపంలో ఈ తుపాను ఇవాళ తీరం దాటే అవకాశముందని ఐఎండీ తెలిపింది. తుఫాన్‌ ప్రభావంపై మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వ అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కూడా తుఫాన్ ప్రభావం తదనంతర పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. తుపాను ప్రభావిత ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాని హోమంత్రి అమిత్ షా సూచించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. తుఫాన్ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు రాష్ట్రంలో తీసుకుంటున్న ముందస్తు చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. మహారాష్ట్ర, డయ్యూడామన్‌, గుజరాత్‌కు తుఫాన్ ప్రభావం పొంచి ఉంటంతో ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు ఇప్పటికే ఆయా రాష్ట్రాలకు చేరుకున్నాయి. ముందస్తు చర్యల్లో భాగంగా తీర, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గత వందేళ్ల కాలంలో ముంబై మహానగరాన్ని ముంచెత్తనున్న రెండో అతిపెద్ద తుపానుగా ‘నిసర్గ’ ఉండబోతుందని భారత ఐఎండీ హెచ్చరించింది. దీంతో ముంబైలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. నిసర్గ తుఫాన్‌తో ముంబై నగరానికి అత్యధికంగా ముప్పు పొంచి ఉండడంతో బాలీవుడ్‌ హీరో లక్షయ్‌ కుమార్‌ స్పందించారు. ప్రజలంతా తుఫాన్‌ పట్ల అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. తుఫాన్‌పై ప్రభుత్వ సూచనలను ప్రజలు తప్పకుండా పాటించి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ముంబైకి సమీపంలో అలీబాగ్‌ వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. తీరం దాటే సమయంలో 100-120 కిమీ వేగంతో భీకర గాలులు వీస్తాయని, భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించింది. మహారాష్ట్ర, గుజరాత్ , గోవా రాష్ట్రాలపై ‘నిసర్గ’తుఫాన్ విరుచుకుపడుతుందని ఐఎండీ హెచ్చరించింది. దీంతో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. గుజరాత్ సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న 47 గ్రామాల ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. నిసర్గ తుపాను ప్రభావంతో 47 గ్రామాల నుంచి దాదాపు 20 వేలమంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు.