ముంబాయిలో కోవిడ్‌ హాస్పిటల్స్‌గా ఫోర్‌స్టార్‌, ఫైవ్‌స్టార్‌ హోటల్స్‌..

ముంబాయిలో కోవిడ్‌ హాస్పిటల్స్‌గా ఫోర్‌స్టార్‌, ఫైవ్‌స్టార్‌ హోటల్స్‌..

కరోనా సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి భయకంపితులను చేస్తోంది. వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో కేసులు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. ఆసుపత్రులన్నీ రోగులతో నిండిపోతున్నాయి. మహారాష్ట్ర, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ వంటి రాష్ట్రాలలో హాస్పిటల్స్‌లో బెడ్స్‌ దొరక్క పేషంట్స్‌ నానా అవస్థలు పడుతున్నారు.

Balu

| Edited By: Phani CH

Apr 15, 2021 | 12:14 PM

కరోనా సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి భయకంపితులను చేస్తోంది. వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో కేసులు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. ఆసుపత్రులన్నీ రోగులతో నిండిపోతున్నాయి. మహారాష్ట్ర, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ వంటి రాష్ట్రాలలో హాస్పిటల్స్‌లో బెడ్స్‌ దొరక్క పేషంట్స్‌ నానా అవస్థలు పడుతున్నారు. చికిత్స కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఫైవ్‌స్టార్‌ హోటళ్లను కోవిడ్‌ ఆసుపత్రులుగా మార్చేందుకు రంగం సిద్ధం చేసింది. చిన్నపాటి లక్షణాలతో బాధపడుతున్న కరోనా రోగులకు చికిత్స అందించడానికి ముంబాయి ఆసుపత్రులు ఫైవ్‌స్టార్‌ హోటళ్లను ఉపయోగించుకోనున్నట్లు ముంబాయి వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రైవేటు ఆసుపత్రులలో చేరుతున్న కరోనా పేషంట్లలో చాలా మందికి ఎమర్జెన్సీ చికిత్స అవసరం లేదని వైద్య ఆరోగ్య శాఖ అంటోంది. అలాంటి వారిని కూడా ఆసుపత్రుల పర్యవేక్షణలో ఉంచడం వల్లే అత్యవసర చికిత్స అవసరమయ్యే పేషంట్లకు బెడ్స్‌ దొరకడం లేదని చెబుతోంది. అందుకే ఫోర్‌స్టార్‌, ఫైవ్‌స్టార్‌ హోటళ్లతో ప్రైవేటు ఆసుపత్రులు ఒప్పందం కుదుర్చుకున్నాయి. వాటిని తాత్కాలిక ఆసుపత్రులుగా మార్చునున్నాయి. ఇదిలా ఉంటే మహారాష్ట్రలో కరోనా తీవ్రతరం కావడంతో నిన్న రాత్రి నుంచి అక్కడ లాక్‌డౌన్‌ వంటి కఠిన నిబంధనలతో జనతా కర్ఫ్యూ అమలులోకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్‌ అమలులోకి వచ్చింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రాకూడదని ప్రభుత్వం హెచ్చరించింది కూడా!

కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. దేశంలో విరుచుకుపడి జనం ప్రాణాలను తోడేస్తోంది. ఆ వైరస్‌ సునామీకి దేశం గజగజలాడిపోతున్నది. కేసుల విషయంలో రోజురోజుకు కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. కరోనా బీభత్సానికి అనేక రాష్ట్రాలు భయాందోళనలో ఠారెత్తిపోతున్నాయి. ఆసుపత్రులలో బెడ్స్‌ దొరకడం లేదు. టీకాల కొరత పట్టి పీడిస్తోంది. మందులు స్టాక్‌ లేవంటున్నారు. దురదృష్టవశాత్తూ కరోనాతో ప్రాణాలు పోతే అంతకంటే నరకం మరోటి ఉండదు. మృతదేహాలు కనీసం అంతిమ సంస్కారానికి కూడా నోచు కోవడం లేదు. ఒక్క రోజులోనే సుమారు రెండు లక్షల కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. ఆ భూతం వెయ్యి మంది ప్రాణాలను బలిగొంది. భయంకరమైన విపత్తు మన కళ్ల ముందే కనిపిస్తున్నా చాలా మందిలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. మాస్క్‌లు పెట్టుకోవాలని ఎంత చెప్పినా చెవికెక్కించుకోవడం లేదు. గుమిగూడవద్దని బతిమాలుకుంటున్నా పట్టించుకోవడం లేదు. ఎన్నికలు, మహా కుంభమేళాలను తల్చుకుంటే గుండెల్లో వణుకుపుడుతోంది. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో నిన్న జరిగిన షాహీ స్నాన్‌కు లక్షలమంది తరలివచ్చారు. ఓ వైపు కరోనా ఉద్ధృతి కొనసాగుతున్నా మాస్కులు ధరించడం, భౌతికదూరాన్ని పాటించడం వంటి కనీస నిబంధనలు కూడా పాటించకుండా భక్తి భావనతో నీళ్లలో మునిగితేలారు. ఇప్పుడదే ఉత్తరాఖండ్‌ను కొంపముంచబోతున్నది. పవిత్రసాన్నాలు చేసినవారిలో కేవలం రెండు రోజుల్లోనే వెయ్యిమందికి పైగా కరోనా సోకింది. చూడటానికి ఇది చిన్న సంఖ్యలా అనిపించినా.. ఇది వ్యాప్తి చెందితే మాత్రం పెను విపత్తే!

ఉత్తరప్రదేశ్‌లో ఒక్క రోజే 20 వేల మందికి పైగా కరోనా బారిన పడ్డారు. చివరాఖరికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ను కూడా కరోనా వదల్లేదు. మరోవైపు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్, యూపీ మంత్రి అశుతోష్‌ టాండన్‌కు కూడా కరోనా సోకింది. మధ్యప్రదేశ్‌లో అయితే కరోనా కరాళనృత్యం చేస్తోంది. ఏ ఆసుపత్రి చూసినా శవాల గుట్టలే కనిపిస్తున్నాయి. అంత్యక్రియల కోసం కిలోమీటర్ల కొద్దీ ఉంటున్న క్యూ లైన్లు అక్కడి పరిస్థితికి అద్దంపడుతున్నాయి. ప్రభుత్వాల చెబుతున్న అధికార లెక్కలు వేరు. చితిమంటలపై కాలుతున్న శవాల సంఖ్య వేరు. రెండింటి మధ్య చాలా తేడా ఉంటోంది. మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతున్నదని స్పష్టంగా అర్థమవుతోంది. మహారాష్ట్ర, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, తమిళనాడు, కర్నాకట ప్రభుత్వాలు కూడా కరోనా మరణాల సంఖ్యను దాచిపెడుతున్నాయి. సాధారణంగా సూర్యాస్తమయం తర్వాత హిందువులు అంత్యక్రియలు చేయరు. కానీ కోవిడ్‌ కారణంగా గత్యంతరం లేని పరిస్థితుల మధ్య రాత్రిపూట కూడా అంత్యక్రియలను నిర్వహిస్తున్నారు. మరోవైపు లాక్‌డౌన్‌ భయం వలసకార్మికులను వెంటాడుతోంది. మహారాష్ట్రలో విధించిన జనతా కర్ఫ్యూతో ఆందోళన చెందుతున్నారు. సొంతూరుకు వెళ్లేందుకు సన్నాహమవుతున్నారు. ముంబాయిలోని లోకమాన్య తిలక్‌ టెర్మినస్‌ అయితే కార్మికులతో కిక్కిరిసి పోతున్నది. ఒకానొక సందర్భంలో పోలీసులు లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది కూడా!

మరిన్ని ఇక్కడ చదవండి: AP Crime News: అనుమానాస్పదంగా రోడ్డు పక్కన లగేజీ బ్యాగ్.. ఏంటా అని తెరిచి చూడగా షాకింగ్

“మీరు గడిలో నిద్రపోతున్నారా..? మీ ఛాతీ లో ఉంది గుండె లేక బండ రాయా? పోచంపల్లి చీరలో.. ఆహార్యం మార్చిన షర్మిళ

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu