Farmers Protest: ఒకే వేదికపై ‘మహా’ నేతలు.. రైతుల ర్యాలీలో ప్రసంగించనున్న పవార్, ఆదిత్య ఠాక్రే

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రెండు నెలలుగా దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే..

Farmers Protest: ఒకే వేదికపై ‘మహా’ నేతలు.. రైతుల ర్యాలీలో ప్రసంగించనున్న పవార్, ఆదిత్య ఠాక్రే
Follow us

|

Updated on: Jan 25, 2021 | 12:36 PM

Maharashtra Farmers Rally: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రెండు నెలలుగా దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆలిండియా కిసాన్ సభ (ఎఐకేఎస్) ఆధ్వర్యంలో మహారాష్ట్రలోని నాసిక్ నుంచి రైతులు పెద్దఎత్తున చేపట్టిన పాదయాత్ర ఈ రోజు ముంబై చేరుకుంది. ముంబై వేదికగా ఆజాద్ మైదాన్ ప్రాంతంలో జరిగే రైతుల భారీ బహిరంగ సభలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్, శివసేన నాయకుడు, మంత్రి ఆదిత్య ఠాక్రే పాల్గొననున్నారు. అయితే ఈ సభలో మహారాష్ట్ర ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్న రెండు పార్టీలకు చెందిన ఇద్దరు కీలక నేతలు ప్రసంగించనుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే రాష్ట్రం నలుమూలల నుంచి భారీ ఎత్తున రైతులు ముంబైకి తరలివస్తుండంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

అయితే ఈ సభకు మొదట సీఎం ఉద్ధవ్ ఠాక్రే హాజరవుతారని పేర్కొన్నప్పటికీ.. కోవిడ్ నిబంధనల మేరకు ఆయన పాల్గొనడం లేదని.. ఆయన తరపున ప్రతినిధిని పంపుతున్నట్లు శివసేన పేర్కొంది. అయితే వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులకు మద్దతు ఉంటుందని శివసేన మరోసారి స్పష్టంచేసింది. ఇదిలాఉంటే.. ఈ మూడు వ్యవసాయ చట్టాలను 18 నెలల పాటు తాత్కాలికంగా నిలిపేస్తామని కేంద్రం ప్రతిపాదించినప్పటికీ.. ఈ ప్రతిపాదనను రైతులు తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రైతులు రేపు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజధాని ఢిల్లీలో వేలాది ట్రాక్టర్లతో పరేడ్‌ నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారు.