MAHARASHTRA POLITICS CHANGING RAPIDLY MORE SHOCKS TO UDDAV THAKRE: మహారాష్ట్ర పాలిటిక్స్(Maharashtra Political Crisis)లో శరవేగంగా మార్పులు సంభవిస్తున్నాయి జూన్ మూడోవారంలో అనూహ్యంగా క్యాంపు రాజకీయాలకు తెరలేపిన ఏక్ నాథ్ షిండే( Eknath Shinde).. శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే(Uddhav Thackeray) ఎన్ని ఎత్తులు వేసినా లొంగలేదు. తన క్యాంపులో వున్న ఎమ్మెల్యేల సంఖ్యను పెంచుకుంటూనే వున్నారు కానీ తగ్గించుకోలేదు. తొలిరోజు సూరత్(Surat) క్యాంపు నుంచి వెళ్ళిపోయిన దేశ్‌ముఖ్ మినహా షిండే క్యాంపు నుంచి తిరిగి వెళ్ళి థాక్రే గూటికి చేరలేదు. నిజానికి శివసేన(Shiv Sena) క్యాడర్‌పై పూర్తి పట్టు థాక్రే కుటుంబీకులకే వుందని మొన్నటి వరకు అందరు భావించారు. కానీ అధికారం కోసం తమకు తొలినుంచి అస్తిత్వాన్నిచ్చిన హిందుత్వను థాక్రే ఫ్యామిలీ వదిలేయడం ప్రస్తుత పరిణామాలకు కారణమైంది. నిజానికి బీజేపీ కంటే హిందుత్వ (Hindutwa) సిద్ధాంతాన్ని నమ్ముకున్నది.. ఆచరించింది శివసేన పార్టీనే. 1993 నాటి బాంబు పేలుళ్ళ అనంతరం జరిగిన హింస వెనుక శివసేన క్యాడర్ వుందని చాలా మంది ఇప్పటికీ భావిస్తుంటారు. బాబ్రీ మసీదు కూల్చివేత శివసైనికుల పనేనా అని అడిగితే అదే నిజమైతే శివసేన అధినేతగా తాను గర్వపడతానని బాలా సాహెబ్ థాక్రే అనేవారు. అంతటి హిందుత్వ నుంచి శివసేన తప్పుకోవడం.. కాంగ్రెస్, ఎన్సీపీలతో జత కట్టడం శివసేన క్యాడర్‌కు నచ్చలేదనడానికి తాజాగా షిండే గ్రూపులోకి చేరుతున్న శివసేన క్యాడరే నిదర్శనంగా కనిపిస్తోంది. ఇటీవల అజాన్, హనుమాన్ చాలీసా వివాదంలోను ఉద్ధవ్ థాక్రే పార్టీలోని హిందుత్వవాదులకు ప్రతికూలంగా స్పందించారు. ఎంపీ నవనీత్ కౌర్(Navneet Kaur) దంపతులను అరెస్టు చేయడం శివసేన పట్ల హిందువుల్లో వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ పరిణామాలు ఓవైపు కొనసాగుతుండగానే షిండే చాపకింద నీరులా పావులు కదిపారు. ఎమ్మెల్యేలను కూడగట్టుకున్నారు. కూడగట్టడమే కాదు థాక్రే కుటుంబం ఎలాంటి ఎత్తులు వేసినా తన దగ్గరున్న ఎమ్మెల్యేలు జారిపోకుండా వ్యూహాత్మకంగా క్యాంపు నిర్వహించారు. ముందుగా ముంబయి నుంచి సూరత్ వెళ్ళిన షిండే గ్రూపు ఎమ్మెల్యేలు.. అక్కడ్నించి అస్సొం (Assom) రాజధాని గువాహటి (Guwahati)కి పయనమయ్యారు. దాదాపు వారం రోజులుగా వారంతా గువాహటిలోనే మకాం వేశారు. షిండే వర్గాన్ని బలహీన పరిచేందుకు పలు ఎత్తుగడలను ఉద్ధవ్ థాక్రే (Uddav Thakre) అనుసరించారు. శివసేన క్యాడర్ అంటూ కొంతమందితో షిండే వర్గం ఎమ్మెల్యేల ఇళ్ళపైనా, కార్యాలయాలపైనా దాడులు చేయించారు. ఉద్ధవ్, ఆదిత్య థాక్రే (Aditya Thakre)లతోపాటు ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) షిండే వర్గాన్ని పలు మార్లు హెచ్చరించారు. ఇవేవీ షిండే గ్రూపును బలహీన పరచలేదు సరికదా ఆయన క్యాంపులోకి ఎమ్మెల్యేల రాక మరింతగా పెరిగింది. తొలిరోజు క్యాంపులో కేవలం 22 మంది ఎమ్మెల్యేలుండగా… జూన్ 29న ఆయన క్లెయిమ్ చేసుకున్నదాని ప్రకారం షిండే దగ్గర 50 మంది ఎమ్మెల్యేలున్నారు.
జూన్ 28న వేగంగా జరిగిన పరిణామాల నేపథ్యంలో జూన్ 30వ తేదీన మహారాష్ట్ర అసెంబ్లీలో బల పరీక్ష జరగబోతోంది. ఓవైపు షిండే గ్రూపు ఎమ్మెల్యేలు, స్వతంత్ర ఎమ్మెల్యేలు.. ఇంకోవైపు విపక్ష బీజేపీ (BJP) ఎమ్మెల్యేలు ఉద్ధవ్ థాక్రేకు అసెంబ్లీలో మెజారిటీ లేదని అటు గవర్నర్‌కు, ఇటు స్పీకర్ లేఖలు రాయడంతో బలపరీక్షకు రంగం సిద్దమైంది. ఇక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) జూన్ 28న న్యూఢిల్లీ వెళ్ళి వచ్చారు. దేశరాజధానిలో ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah)తోను, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda)తోను భేటీ అయ్యారు. ఈ భేటీల్లో ఫడ్నవిస్‌తోపాటు బీజేపీ ఎంపీ, సీనియర్ అడ్వకేట్ మహేశ్ జెఠ్మలానీ (Mahesh Jetmalani) కూడా పాల్గొనడంతో బీజేపీ న్యాయపరమైన అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నదని అర్థమవుతోంది. ఢిల్లీ నుంచి ముంబయి చేరుకున్న వెంటనే ఆయన నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్ళారు. గవర్నర్ కోశ్యారీతో మంతనాలు జరిపిన కొన్ని గంటల వ్యవధిలోనే జూన్ 30న శాసనసభలో మెజారిటీని నిరూపించుకోవాలంటూ సీఎం థాక్రేని ఆయన ఆదేశించారు. ఆ మేరకు జూన్ 28 అర్ధరాత్రి ఆదేశాలు వెలువడడం గమనార్హం. గవర్నర్ కోశ్యారీ ఆదేశాలతో అసెంబ్లీ సెక్రెటరీ జూన్ 30వ తేదీన అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరచనున్నట్లు ప్రకటించారు. ఇక గువాహటిలో వున్న ఏక్నాథ్ షిండే ఆయన గ్రూపు ఎమ్మెల్యేలతో కలిసి గోవా (Goa) మీదుగా ముంబయి (Mumbai)కి చేరుకోనున్నారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి విస్తృత స్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రెబల్ వర్గం ఎమ్మెల్యేల కార్యాలయాలపై ఇదివరకే థాక్రే అనుచరులు దాడులకు తెగబడిన నేపథ్యంలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశం సందర్భంగా ముందస్తు భద్రతా ఏర్పాట్లు చేయాల్సిందిగా గవర్నర్ కోశ్యారీ పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చినట్లు సమాచారం. ఇదిలా వుంటే ముఖ్యమంత్రి థాక్రేకు గవర్నర్ జూన్ 29న లేఖ రాశారు. మీ ప్రభుత్వం మెజారిటీని కోల్పోయినట్లు పలువురు తనకు లేఖలు రాశారని.. లేఖలు రాసిన ఎమ్మెల్యేల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటున్నానని ఆయన లేఖలో పేర్కొన్నారు. జూన్ 30న సభలో మెజారిటీని నిరూపించుకోవాలని గవర్నర్ తన లేఖలో థాక్రేని కోరారు. అయితే.. బలపరీక్ష నుంచి తప్పించుకునేందుకు ఉద్ధవ్ థాక్రే సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో మరోసారి ఉత్కంఠకు తెరలేచింది. బలపరీక్షకు సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఓకే.. లేకపోతే ‘మహ’ర్నాటకంలో మరో అంకానికి తెరలేస్తుంది. బలపరీక్షను సుప్రీంకోర్టు వాయిదా వేస్తే షిండే వర్గానికి షాక్ తగిలే అవకాశం వుంది. ఎందుకంటే తన క్యాంపును ఆయన చాలా కాలం కొనసాగించే పరిస్థితి ఉత్పన్నమవుతుంది. ఆ సమయంలో ఎమ్మెల్యేలను కాపాడుకోవడం షిండేకు కఠిన పరీక్షగా మారుతుంది.
ఇదిలా వుంటే.. నెంబర్ గేమ్ ఆధారంగా చూస్తే మహారాష్ట్రలో బీజేపీ, షిండే వర్గంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటవడం ఖాయంగా కనిపిస్తోంది. తాజా లెక్కల ప్రకారం స్వతంత్రుల చేరికతో బీజేపీ నెంబర్ 113 గా వుంది. ఇటు షిండే క్యాంపులో 50 మంది ఉన్నట్లు చెబుతున్నారు. మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధిపతి రాజ్ థాక్రే షిండే వర్గానికి మద్దతు ప్రకటించారు. మొత్తమ్మీద బీజేపీకి అనుకూలంగా 164 మంది వున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 సీట్లుండగా.. శివసేన ఎమ్మెల్యే ఒకరు మరణించడంతో ప్రస్తుత నెంబర్ 287.. సో సభలో థాక్రే ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు 144 మంది అవసరం ముండగా.. బీజేపీకి అనుకూలంగా 164 మంది కనిపిస్తున్నారు. ఈక్రమంలో మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా, ఏక్నాథ్ షిండే ఉపముఖ్యమంత్రిగా కొత్త ప్రభుత్వం ఏర్పాటు ఖాయంగా కనిపిస్తోంది. నెంబర్ గేమ్‌లో ఓటమి ఖాయమని తేలడంతో ఉద్ధవ్ థాక్రే జూన్ 29న సాయంత్రం కేబినెట్ భేటీ నిర్వహించారు. ఈ భేటీకి సీఎంతోపాటు ఆయన తనయుడు, మంత్రి ఆదిత్య థాక్రే మరో నలుగురు మంత్రులు మాత్రమే హాజరవడం విశేషం. ఇదేసమయంలో ఉద్ధవ్ థాక్రే దింపుడు కల్లం ఆశతో షిండే వర్గాన్ని ముంబయికి వచ్చిన తనతో చర్చలు జరపాల్సిందిగా కోరారు. అయితే ఉద్ధవ్ విన్నపాన్ని షిండే వర్గం అస్సలు ఖాతరు చేయలేదు. ఆదిత్య థాక్రే, సంజయ్ రౌత్‌లతో తమను నోటికి వచ్చినట్లు తిట్టించి మళ్ళీ చర్చలకు రమ్మనడం విచిత్రంగా వుందని షిండే వర్గం ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు. ఇదిలా వుంటే.. శివసేన పార్టీలో చీలిక ఆ పార్టీ భవిష్యత్తుని ప్రశ్నార్థకంలో పడేస్తోంది. శివసేన పార్టీకి 19 పార్లమెంటు సభ్యులున్నారు. వీరిలో 14 మంది ఇపుడు షిండే క్యాంపులో వున్నారు. ఇటు రెండింట మూడొంతుల మంది ఎమ్మెల్యేలు, అటు అదే స్థాయిలో పార్లమెంటు సభ్యులు పార్టీలో చీలిక తెస్తే.. అసలు శివసేన తమదేనని వాదిస్తే వారి వాదనే నెగ్గే అవకాశం వుంది. అపుడు థాక్రే కుటుంబం నుంచి షిండే చేతుల్లోకి పార్టీ చేరే అవకాశం వుంది. అదేసమయంలో ఉద్ధవ్ థాక్రే కొత్త ఎత్తుగడలు వేస్తే.. పార్టీలో నిట్టనిలువునా చీలిక రావడం ఖాయం. ఇదే జరిగితే శివసేన పార్టీ మనుగడ ప్రశ్నార్థకమై.. బీజేపీ మరింత బలపడే అవకాశం వుంది.