Lockdown in India : ఇప్పుడున్న పరిస్థితులలో దేశవ్యాప్త లాక్‌డౌన్‌కు కేంద్రం మొగ్గు చూపుతుందా?

కరోనా సెకండ్‌వేవ్‌ దేశాన్ని భయానక స్థితిలో నెట్టివేస్తున్న సమయంలో మళ్లీ లాక్‌డౌన్‌ అంశం తెరమీదకు వస్తున్నది. రోజురోజుకూ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండటం,,,,

Lockdown in India : ఇప్పుడున్న పరిస్థితులలో దేశవ్యాప్త లాక్‌డౌన్‌కు  కేంద్రం మొగ్గు చూపుతుందా?
pm modi video conference with ministers
Follow us

|

Updated on: May 06, 2021 | 3:14 PM

కరోనా సెకండ్‌వేవ్‌ దేశాన్ని భయానక స్థితిలో నెట్టివేస్తున్న సమయంలో మళ్లీ లాక్‌డౌన్‌ అంశం తెరమీదకు వస్తున్నది. రోజురోజుకూ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండటం, అనేక మంది ప్రాణాలు కోల్పోతుండటంతో జాతీయ స్థాయిలో లాక్‌డౌన్‌ విధించాలన్న డిమాండ్‌ ఊపందుకుంటుంది. లాక్‌డౌన్‌ పర్యవసానాలు ఎంత దారుణంగా ఉంటాయో మనకు అనుభవమే! అయినప్పటికీ కరోనా మహమ్మారిని కట్టడి చేయాలంటే లాక్‌డౌన్‌ మినహా మరో ప్రత్యామ్నాయం లేదన్నది చాలా మంది వాదన. ఇలాంటి డిమాండ్ల కారణంగానే ప్రధాని నరేంద్రమోదీపై కూడా ఒత్తిడి పెరుగుతుంది. నిజానికి దేశంలో కొన్ని చోట్ల లాక్‌డౌన్‌ అమలవుతున్నది. మరి కొన్ని చోట్ల పాక్షిక లాక్‌డౌన్‌ ఉంది.. ఇంకొన్ని చోట్ల కర్ఫ్యూతో పాటు కఠిన ఆంక్షలు అమలవుతున్నాయి. ఓ రకంగా లాక్‌డౌన్‌ కిందే లెక్క! ఈ కారణంగానే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలుకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా లేదు. కరోనా వ్యాప్తి నిజమే కానీ, అన్ని చోట్లా ఆ పరిస్థితి లేదని, దేశంలో సగానికిపైగా జిల్లాలలో కరోనా నియంత్రణలోనే ఉందని కేంద్రం చెబుతోంది. లాక్‌డౌన్‌ విధిస్తే ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆర్ధికవ్యవస్థ మళ్లీ కుప్పకూలుతుందని, వలస కూలీలు ఇబ్బందుల్లో పడతారని, నిరుపేదల పరిస్థితి దయనీయంగా తయారవుతుందని కేంద్రం భావిస్తోంది.

కేసులు విపరీతంగా పెరుగుతున్న రాష్ట్రాలు ఇప్పటికే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నాయి. ఆయా రాష్ట్రాలలో ఇప్పుడు కేసులు తగ్గుముఖం పట్టాయి కూడా! సెకడ్‌వేవ్‌ ముప్పిరికొన్నప్పుడు ఈ ప్రభావం మహారాష్ట్రపై బాగా పడింది. వేల సంఖ్యలో కేసులు నమోదవుతుండటంతో గత్యతరం లేని పరిస్థితుల్లో ఏప్రిల్‌ అయిదు నుంచి కర్ఫ్యూ లాంటి లాక్‌డౌన్‌ విధించింది మహారాష్ట్ర ప్రభుత్వం. ప్రజలు గుంపులు గుంపులుగా తిరగకుండా జాగ్రత్తలు తీసుకుంది. కఠిన నియమాలను అమలు చేసింది. ఇప్పుడక్కడ ఈ నెల 15 వరకు కఠిన ఆంక్షలు ఉన్నాయి.. అందుకే అక్కడ మునుపటంతా భయానక పరిస్థితి లేదు.. కేసులు తగ్గుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ కూడా బాగా ఇబ్బంది పడింది.. ఇప్పడు పరిస్థితి కొంత నయం కానీ.. లాక్‌డౌన్‌ విధించక ముందు మాత్రం విపరీతంగా కేసులు పెరిగాయి.. హాస్పిటల్స్‌లో బెడ్స్‌ దొరక్క పేషంట్లు అవస్థలు పడ్డారు. ఆక్సిజన్‌ దొరక్క చాలా మంది చనిపోయారు.. ఇవన్నీ చూసిన తర్వాత ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ కఠిన నిర్ణయం తీసుకున్నారు. లాక్‌డౌన్‌ విధించారు. ఏప్రిల్‌ 19 నుంచి అక్కడ లాక్‌డౌన్‌ కొనసాగుతున్నది. దాంతో కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ఉత్తరప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌లలోనూ లాక్‌డౌన్‌ అమలులో ఉంది. చత్తీస్‌గఢ్‌లో కరోనా తీవ్రత తక్కువగా ఉన్న ప్రాంతాలలో అంటే రాయ్‌పూర్‌, దుర్గ్‌ జిల్లాలలో కొంత సడలింపులు ఇచ్చారు. అక్కడైనా సాయంత్రం అయిదు గంటలకు దుకాణాలన్నీ క్లోజ్‌ చేయాల్సిందే. బీహార్‌లో కూడా లాక్‌డౌన్‌ విధించారు. అక్కడ నిత్యావసర వస్తువుల షాపులు ఉదయం ఏడు గంటల నుంచి 11 గంటల వరకు తెరచి వుంటున్నాయి. ఒడిషాలోనూ లాక్‌డౌన్‌ ఉంది. ఇక పంజాబ్‌లో వారంతపు లాక్‌డౌన్‌ ఉంది. మిగతా రోజుల్లో కూడా కఠిన ఆంక్షలు అమలవుతున్నాయి. నైట్‌ కర్ఫ్యూ ఉంది. రాజస్తాన్‌లో కూడా లాక్‌డౌన్ ఆంక్షలు ఉన్నాయి. గుజరాత్‌లోని చాలా పట్టణాలలో నైట్‌ కర్ఫ్యూ కొనసాగుతోంది. సభలు, సమావేశాలను బ్యాన్‌ చేశారు. గుంపులు గుంపులుగా తిరగడం నిషేధం అక్కడ. మాస్కులు ధరించనివారికి జరిమానా విధిస్తున్నారు. మధ్యప్రదేశ్‌, అసోంలలో నైట్‌ కర్ఫ్యూ ఉంది. బెంగాల్‌లో కూడా ముఖ్యమంత్రి మమతాబెనర్జీ కొన్ని ఆంక్షలు విధించారు. తమిళనాడు, కేరళ, కర్నాకట, జార్ఖండ్‌, గోవా, పుదుచ్చేరి, నాగాలాండ్‌, జమ్ముకశ్మీర్‌లలలో కూడా ఇంచుమించు లాక్‌డౌన్‌ వంటి ఆంక్షలనే అమలు చేస్తున్నారు. తమిళనాడులో సభలు, సమావేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ బంద్‌! తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా కరోనా కట్టడికి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు రెండువారాల పాటు పాక్షిక కర్ఫ్యూ ప్రకటించారు. ఓ రకంగా ఇది మినీ లాక్‌డౌన్‌ కిందే లెక్క! తెలంగాణలో అయితే నైట్‌ కర్ఫ్యూ కొనసాగుతోంది. మొత్తం మీద దేశంలో లాక్‌డౌన్‌ పరిస్థితులే ఉన్నాయి.. ఇప్పుడు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ పెడితే కరోనా కంట్రోల్‌ కావచ్చునేమో కానీ, ఆర్ధిక వ్యవస్థ మాత్రం దెబ్బతింటుంది.. అందుకే కేంద్ర ప్రభుత్వం ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నది.

మరిన్ని చదవండి ఇక్కడ :  ఐడియా అదుర్స్‌ రైతన్న వినూత్న ప్రయోగం వైరల్ అవుతున్న వీడియో ..: Farmer Creative Viral Video.

ఊరు ఊరంతా ఐసోలేషన్‌!ఐసొలేషన్ పాటిస్తూ పొలాల్లో ఉంటున్న సగం ఊరి జనం వీడియో… : viral video.