వచ్చే సంవత్సరం జనవరి 1 నుంచి విద్యార్థులకు తరగతులు ప్రారంభిస్తున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. కరోనా నేపథ్యంలో విద్యార్థులు పాఠశాలలకు వచ్చేందుకు తల్లిదండ్రుల నుంచి అనుమతి పత్రం తప్పనిసరి చేసింది. గతంలో ఆరు నుంచి తొమ్మిది తరగతులకు ఇళ్ల వద్దే చదువుకునే అవకాశం కల్పించారు అయితే ప్రస్తుతం స్కూళ్లు ప్రారంభిస్తున్న నేపథ్యంలో ఆరు బయట వారికి తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు. పరీక్షల తేదీలు మాత్రం ఇంకా కరారు చేయలేదు.
ఇదిలా ఉంటే పది, ఇంటర్ విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు ఉంటాయి కనుక వారికి కచ్చితంగా తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు వారంలో రెండు లేదా మూడు రోజులు తరగతులకు హాజరైతే సరిపోతుందని ప్రకటించింది. విద్యార్థుల ఆరోగ్యం, భవిష్యత్ దృష్ట్యా ఒక్కో తరగతి గదిలో కేవలం 15 మందిని మాత్రమే అనుమతిస్తామని వెల్లడించింది. పాఠశాలల ప్రారంభ విషయమై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప ట్విట్టర్ కేంద్రంగా స్పందించారు. కరోనా కారణంగా మార్చి నుంచి పాఠశాలలు తెరుచుకోలేదు. డిసెంబరులో ప్రారంభించాలని ప్రయత్నించినా కుదరలేదు. కనుక జనవరి నుంచి పాఠశాలలు ప్రారంభిస్తున్నామని తెలిపారు.