ఇంటర్నెట్ ఇక పౌర హక్కు.. కేరళ హైకోర్టు తీర్పేంటంటే ?

“స్వరాజ్యం నా జన్మహక్కు” అని చాటాడు లోకమాన్య బాలగంగాధర తిలక్‌! “ఇంటర్నెట్‌ మా జన్మహక్కు” అని నినదిస్తోంది ఈ జనరేషన్‌! న్యాయస్థానాలు కూడా ఈమాటను సమర్థిస్తున్నాయి. ఇంటర్నెట్‌ను పౌరుల ప్రాథమిక హక్కుగా గుర్తిస్తూ కేరళ హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు సంచలనం సృష్టించింది. ఇంతకీ కేరళలో ఏం జరిగింది? ఏ సందర్భంలో ఇంటర్నెట్‌ను వ్యక్తిగత గోప్యత హక్కులో భాగమని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది? ఇదిప్పుడు దేశంలో పెద్ద చర్చకు దారితీస్తోంది. రోటీ, కప్‌డా, మకాన్‌ అన్నది ఒకప్పడు […]

ఇంటర్నెట్ ఇక పౌర హక్కు.. కేరళ హైకోర్టు తీర్పేంటంటే ?

“స్వరాజ్యం నా జన్మహక్కు” అని చాటాడు లోకమాన్య బాలగంగాధర తిలక్‌! “ఇంటర్నెట్‌ మా జన్మహక్కు” అని నినదిస్తోంది ఈ జనరేషన్‌! న్యాయస్థానాలు కూడా ఈమాటను సమర్థిస్తున్నాయి. ఇంటర్నెట్‌ను పౌరుల ప్రాథమిక హక్కుగా గుర్తిస్తూ కేరళ హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు సంచలనం సృష్టించింది. ఇంతకీ కేరళలో ఏం జరిగింది? ఏ సందర్భంలో ఇంటర్నెట్‌ను వ్యక్తిగత గోప్యత హక్కులో భాగమని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది? ఇదిప్పుడు దేశంలో పెద్ద చర్చకు దారితీస్తోంది.

రోటీ, కప్‌డా, మకాన్‌ అన్నది ఒకప్పడు ఎన్నికల స్లోగన్‌! డేటా, కప్‌డా, మకాన్‌ అన్నది ప్రస్తుత పాలిటిక్స్‌లో ట్రెండింగ్‌లో ఉన్న ప్రామిస్‌! ఓరోజు తిన్నా తినకపోయినా బతుకుతారోమోగానీ.. ఓ అరగంట డేటా లేకపోతే బతకలేని పరిస్థితి చాలామందికి.. ఇంటర్నెట్‌ మీకు అవసరమో, ఇష్టమో కావచ్చు. కానీ కేరళలో ఇప్పుడు ప్రతి ఒక్కరి అధికారం! అవును, “ఇంటర్నెట్‌ ప్రతి పౌరుడి హక్కు”- అంటూ కేరళ హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు విప్లవాత్మకమైనది! ఈ తీర్పు ఇవ్వడం వెనుక కథ మరింత ఆసక్తికరమైనది!

కాలికట్‌లోని శ్రీనారాయణ్‌ గురు కాలేజ్‌లో డిగ్రీ చేస్తోంది 19 ఏళ్ల ఫహిమా షరీన్‌ అనే యువతి! అదే కాలేజ్‌కి చెందిన గాళ్స్‌ హాస్టల్లో ఉండి చదువుకుంటోంది. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు హాస్టల్లో ఇంటర్నెట్‌ బంద్‌ చేశారు నిర్వాహకులు. కానీ బాయ్స్‌ హాస్టల్లో ఇంటర్నెట్‌ సౌకర్యం కొనసాగుతూనే ఉంది. ఈ వివక్షను ప్రశ్నించినందుకు ఫహిమాను హాస్టల్‌ నుంచి పంపించేశారు. ఈ విషయమై షరీన్‌తో మాట్లాడిన మీడియాకు ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి.

‘‘మా గాళ్స్‌ హాస్టల్లో రోజూ సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఇంటర్నెట్‌ సౌకర్యం నిలిపివేశారు. మొబైల్స్‌, ఇతర కమ్యూనికేషన్‌ సాధనాలు వాడకూడదని మేనేజ్‌మెంట్‌ ఆదేశించింది. స్టూడెంట్స్‌ చదువులు డిస్ట్రర్బ్‌ కాకూదన్న ఉద్దేశంతో ఈ రూల్‌ పెట్టినట్లు చెప్పింది. కానీ బాయ్స్‌ హాస్టల్లో ఇంటర్నెట్‌పై ఆంక్షలు విధించలేదు’’

అబ్బాయిలపై లేని ఆంక్షలు అమ్మాయిలకు దేనికని ప్రశ్నించింది ఫహీమా. ఇదే ప్రశ్నతో కేరళ హైకోర్టులో రెండు నెలల క్రితం పిటిషన్‌ వేసింది ఫహీమా. చదువుకోవడానికి తనకు ఇంటర్నెట్‌ చాలా అవసరమనీ, అమ్మాయి అన్న కారణంతో తనకు ఆ సౌకర్యం నిరాకరించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.

ఈ కేసుకు సంబంధించి కేరళ హైకోర్టు విప్లవాత్మకమైన తీర్పు వెలువరిచింది. కాలేజీ యాజమాన్యం ఫహిమాకు ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించకపోవడం ఆమె ప్రాథమిక హక్కులకు విఘాతమని వ్యాఖ్యానించింది. ఇంటర్నెట్‌ వినియోగం..రాజ్యాంగంలో పేర్కొన్న వ్యక్తిగత గోప్యత హక్కు, విద్యాహక్కుల్లో భాగమని పేర్కొంది. ఇంటర్నెట్‌ సేవల వినియోగాన్ని ప్రాథమిక హక్కుగా గుర్తిస్తూ తీర్పు ఇచ్చింది. ఫలితంగా ఫహిమా తిరిగి ఇంటర్ నెట్ సౌకర్యం పొందింది. హైకోర్టు తీర్పుతో ఫహీమ్‌ తిరిగి హాస్టల్లో చేరింది. ఆమెతోబాటు విద్యార్థినులందరికీ ఇప్పుడు డేటా అందుతోంది. ఈ నేపథ్యంలోనే కేరళ ప్రభుత్వం 20 లక్షల మంది పేద కుటుంబాలకు ఉచిత ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఇస్తున్నట్లు ప్రకటించింది. రూ.1548 కోట్ల ఖర్చుతో చేపట్టిన కేరళ ఫైబర్‌ ఆప్టిక్‌ నెట్‌వర్క్‌ ప్రాజెక్టు 2020 డిసెంబరు నాటికి పూర్తికానుంది.

2018 నాటికి దేశంలో 48 కోట్ల మందికిపైగా ప్రజలు ఇంటర్నెట్‌ ఉపయోగిస్తున్నారు. 2023 నాటికి ఇంటర్నెట్‌ వినియోగదారుల సంఖ్య 68 కోట్లకు పెరిగే అవకాశం ఉంది. అంటే దేశంలో సగానికిపైగా జనాభా ఇంటర్నెట్‌ యాక్సెస్‌ చేస్తుంది. ఈ నేపథ్యంలో కేరళ హైకోర్టు తీర్పు ప్రాధాన్యత సంతరించుకుంది. ఎవరికైనా ఎక్కడైనా ఇంటర్నెట్‌ నిరాకరించడం అంటే..పౌరుల ప్రాథమిక హక్కును కాలరాయడమే అని పేర్కొంది. భవిష్యత్తులో దేశంలోని ప్రతి రాష్ర్ట ప్రభుత్వం ఇంటర్నెట్‌ సేవల్ని ప్రాథమిక హక్కుగా గుర్తించాల్సి ఉంటుందని సంకేతాలిచ్చింది.

సమానత్వపు హక్కు, స్వాతంత్ర్యపు హక్కు, దోపిడీని నివారించే హక్కు, మత స్వాతంత్ర్యపు హక్కు, సంస్కృతి-విద్యాసంబంధిత హక్కు, రాజ్యంగ పరిహారపు హక్కు..ఇలా రాజ్యాంగం మనకు ఆరు ప్రాథమిక హక్కులు ప్రసాదించింది. త్వరలోనే వీటికి ఇంటర్నెట్‌ హక్కు కూడా జతయ్యే అవకాశం ఉంది. అంటే.. “ఇంటింటికీ ఇంటర్నెట్” అన్నమాట.

నెట్‌ ఉంటే చాలు నట్టింట్లో కూర్చొని అన్ని పనులూ చకచకా చేసేసుకోవచ్చు. మెసేజ్‌ పంపడం దగ్గర్నుంచి బిల్లులు కట్టడం, షాపింగ్‌ చేయడం, సినిమాలు చూడటం, ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌, ఆకలేస్తే ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేయడం..ఇలా అన్నీ ఇంటర్నెట్‌తో ముడిపడినవే! అందుకే కేరళ..తాజాగా ఇంటర్నెట్‌ విప్లవానికి నాంది పలికింది. వచ్చే ఏడాది చివరికల్లా 20 లక్షలమంది పేదలకు అంతర్జాల సేవలు అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తోంది. ఇందుకోసం పెద్ద ఎత్తున నెట్‌వర్క్‌, వైఫై సెంటర్లు ఏర్పాటు చేస్తోంది. రాష్ట్రంలోని ప్రతి స్కూలుకు, స్వయంసహాయక సంఘానికీ నెట్‌ సేవలు అందిస్తామని ప్రకటించింది. ఇంటర్నెట్‌ను ప్రజల ప్రాథమిక హక్కుగా గుర్తించిన తొలి రాష్ట్రంగా కేరళ నిలిచింది.

మీకు తెలుసా?

ఫ్రాన్స్‌, స్పెయిన్‌, గ్రీస్‌, ఫిన్లాండ్‌, ఈస్టోనియా, కోస్టారికా వంటి దేశాలు ఇంటర్నెట్‌కు ప్రాథమిక హక్కు హోదా ఇచ్చాయి. మౌలిక అధికారంగా గుర్తించనప్పటికీ..మన దేశంలో ఢిల్లీ, తమిళనాడు, తెలంగాణ ప్రభుత్వాలు ప్రజలకు ఉచిత వైఫై సేవలు అందించే ప్రయత్నం చేస్తున్నాయి. దేశంలో దాదాపు 60 కోట్ల ఇంటర్నెట్‌ యూజర్లు ఉన్నారు. అత్యధిక ఇంటర్నెట్‌ యూజర్ల జాబితాలో చైనా మొదటి స్థానంలో ఉంటే భారత్‌, అమెరికా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. దేశంలోనే అత్యధికంగా ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో 70 శాతం మంది ఇంటర్నెట్‌ ఉపయోగిస్తారు. కేరళలో 54శాతం మంది ఇంటర్నెట్‌తో కనెక్ట్‌ అయివున్నారు.

సోషల్‌ మీడియాను ఉపయోగించడంలో భారత ఇంటర్నెట్‌ యూజర్లు దునియాలోనే టాప్‌ పొజిషన్‌లో ఉన్నారు. దేశంలో 27 కోట్ల మంది ఫేస్‌బుక్‌, 20 కోట్ల మంది వాట్సాప్‌ యూజర్లున్నారు. ప్రపంచంలోనే ఫేస్‌బుక్‌ వాట్సాప్‌ ఉపయోగించేవారిలో భారతీయులే నంబర్‌వన్‌! భారతీయ ఇంటర్నెట్‌ యూజర్లు రోజుకు సగటున రెండున్నర గంటలపాటు సోషల్‌ మీడియాలో తలమునకలై ఉంటారు.