China vs India: భారత్, చైనా మధ్య నెలకొన్న ప్రతిష్ఠంభనలో కీలక ముందడుగు పడింది. లడఖ్‌లో కీలక పాయింట్ నుంచి భారత్, చైనా దళాలు వెనక్కి తగ్గడమే ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. అవును.. భారత్, చైనా సరిహద్దులో మరో విడత సైనిక దళాల వెనక్కి మళ్లింపు ప్రక్రియ మొదలైంది. లడఖ్‌లోని కీలకమైన స్టాండ్ ఆఫ్ పాయింట్ నుంచి ఇరు దేశాల ఆర్మీ దళాలు వైదొలగడం ప్రారంభించాయి. భారత్, చైనా మధ్య ఇటీవల జరిగిన 16వ విడత సైనిక చర్చలు ఫలప్రదమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల దళాలు వెనక్కి తగ్గుతున్నాయి. వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి ఉన్న చైనా దళాలు 2020కి ముందు ఉన్న స్థానాలకు తిరిగి వెళ్లనున్నాయి.
సరిహద్దులో చొరబాట్ల నేపథ్యంలో 2020 ఏప్రిల్-మే నెలలో భారత్, చైనా మధ్య ఘర్షణ జరిగింది. అనంతరం అదే ఏడాది జూన్‌లో లడఖ్‌లోని గాల్వాన్ వ్యాలీ వద్ద ఇరు దేశాల సైనికులు బాహాబాహీగా తలపడ్డారు. ఈ ఘర్షణలో ఇరు దేశాలకు చెందిన పలువురు సైనికులు అమరులయ్యారు. దీంతో సరిహద్దులో ఉద్రిక్తతలు పెరుగడంతో పోటాపోటీగా సైనిక దళాలను ఇరు దేశాలు మోహరించాయి.మరోవైపు ఈ పరిణామాల నేపథ్యంలో సరిహద్దులో పెరుగుతున్న ఉద్రిక్తతలను తగ్గించుకోవడంపై భారత్, చైనా దృష్టిసారించాయి.
ఇప్పటి వరకు ఇరు దేశాల సైనిక అధికారుల మధ్య 16 రౌండ్ల చర్చలు జరిగాయి. తాజాగా జూలై 17న జరిగిన 16వ విడత చర్చల్లో పురోగతి కనిపించింది. ఇండియా, చైనా కార్ప్స్ కమాండర్ స్థాయి సమావేశంలో ఇరు దేశాల సైనిక దళాల ఉపసంహరణపై చర్చించారు.ఈ నేపథ్యంలో గోగ్రా-హాట్ స్ప్రింగ్స్ ప్రాంతం నుంచి భారత, చైనా దళాలు సమన్వయంతో, ప్రణాళికాబద్ధంగా సెప్టెంబర్ 8న వెనక్కి మళ్లడం ప్రారంభించినట్లు ఇరు దేశాలు సంయుక్తంగా ప్రకటించాయి. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, ప్రశాంతతకు ఇది దోహదపడుతుందని తెలిపాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..