Kangana Ranaut: సోనియా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వ రుణాలు.. కంగనా తీవ్ర ఆరోపణలు

|

Sep 22, 2024 | 10:45 PM

హిమాచల్‌ప్రదేశ్‌‌లోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రుణాలు తీసుకొని కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపుతోందని.. దీంతో రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయిందని ఆరోపించారు. సోనియా గాంధీ ఆర్థికంగా హిమాచల్ ప్రదేశ్‌పైనే ఆధారపడ్డారని వ్యాఖ్యానించారు.

Kangana Ranaut: సోనియా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వ రుణాలు.. కంగనా తీవ్ర ఆరోపణలు
Kangana Ranaut
Follow us on

హిమాచల్‌ప్రదేశ్‌‌లోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రుణాలు తీసుకొని కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపుతోందని.. దీంతో రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయిందని ఆరోపించారు. సోనియా గాంధీ ఆర్థికంగా హిమాచల్ ప్రదేశ్‌పైనే ఆధారపడ్డారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర కాంగ్రెస్ సర్కారు పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. ఆదివారంనాడు మండిలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు సారథ్యంలోని రాష్ట్ర సర్కారు.. హిమాచల్ ప్రదేశ్‌ను దశాబ్ధాల వెనక్కి తీసుకెళ్లిందని ఆరోపించారు. ప్రజా ధనాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ సర్కారును గద్దె దించాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీని యుగపురుషుడిగా పేర్కొన్న కంగన.. ఆయన పరిస్థితులను చాలా నిశితంగా పరిశీలించి చర్యలు తీసుకుంటారన్నారు. మనం విపత్తు నిధులు ఇస్తే.. అది సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు వెళ్లాలి కానీ.. హిమాచల్ ప్రదేశ్‌లో అది సోనియా రిలీఫ్‌ ఫండ్‌కు వెళ్తోందని అందరికీ తెలుసని ఆరోపించారు. సీఎం సుఖ్విందర్‌సింగ్‌ సుఖు రాష్ట్రంలో అప్పులు చేసి ఆ నిధులను సోనియా గాంధీకి పంపుతున్నారని ఆరోపించారు.

రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణంగానే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం భారీ అప్పుల ఊబిలో కూరుకుపోతోందని కంగనా ఆరోపించారు. ప్రభుత్యోగులకు నెలనెలా జీతాలు, పెన్షన్లు ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్ర సర్కారు ఉందన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో పిల్లలు ఆడుకునేందుకు తగిన వసతులు లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. తన లోక్‌సభ నియోజకవర్గం మండిలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నెలకొల్పుతానని హామీ ఇచ్చారు.