స్నాతకోత్సవంలో గవర్నర్‌కు అవమానం.. ఆ విద్యార్ధిని డిగ్రీ రద్దు చేయాలంటూ HCలో పిటీషన్!
తిరునెల్వేలిలోని మనోన్మణియం సుందరనార్ విశ్వవిద్యాలయం (MSU)లో ఈ ఏడాది జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమంలో పీహెచ్‌డీ విద్యార్ధిని జీన్ జోసెఫ్.. గవర్నర్ నుంచి డిగ్రీ పట్టా స్వీకరించడానికి నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో స్నాతకోత్సవం ప్రోటోకాల్‌ను దిక్కరించి గవర్నర్‌ను అవమానించిన విద్యార్ధినికి జారీ చేసిన డాక్టోరల్ డిగ్రీని..

మధురై, డిసెంబర్ 9: తిరునెల్వేలిలోని మనోన్మణియం సుందరనార్ విశ్వవిద్యాలయం (MSU)లో ఈ ఏడాది జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమంలో పీహెచ్‌డీ విద్యార్ధిని జీన్ జోసెఫ్.. గవర్నర్ నుంచి డిగ్రీ పట్టా స్వీకరించడానికి నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో స్నాతకోత్సవం ప్రోటోకాల్‌ను దిక్కరించి గవర్నర్‌ను అవమానించిన విద్యార్ధినికి జారీ చేసిన డాక్టోరల్ డిగ్రీని రద్దు చేయాలని కోరుతూ హైకోర్టు మధురై బెంచ్‌లో పిటీషన్ దాఖలైంది. నాగర్‌కోయిల్‌కు చెందిన పీహెచ్‌డీ గ్రాడ్యుయేట్ జీన్ జోసెఫ్ ఈ ఏడాది ఆగస్ట్ 13న వర్సిటీ ఛాన్సలర్‌గా ఉన్న గవర్నర్ నుంచి డిగ్రీ పట్టా స్వీకరించేందుకు నిరాకరించడం ద్వారా కాన్వొకేషన్ ప్రోటోకాల్‌ను ఉల్లంఘించింది. బదులుగా వైస్-ఛాన్సలర్ చంద్రశేఖర్ నుంచి దానిని తీసుకున్నారని తిరుచెందూర్‌కు చెందిన న్యాయవాది రామ్‌కుమార్ అధితన్ దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు.
అభ్యర్ధులందరూ ఛాన్సలర్ నుంచి తమ డిగ్రీని పొందాలని పరీక్షల కంట్రోలర్ సూచించారని, గవర్నర్ కూడా తదనుగుణంగా డిగ్రీ పట్టా అందించేందుకు ప్రయత్నించారని పిటిషనర్ పేర్కొన్నారు. అయితే, విద్యార్థిని ఉద్దేశపూర్వకంగా రాజకీయ కారణాల రిత్య గవర్నర్‌ను అవమానించినట్లు పిటిషనర్ తెలిపారు. అయితే ఈ కేసు విచారణకు తగినదా? కాదా? అని నిర్ణయించడానికి హైకోర్టు కేసును డిసెంబర్ 18కి వాయిదా వేసింది. గవర్నర్‌ను అవమానించే విధంగా విద్యార్థి ప్రవర్తించడం సముచితం కాదని ఈ సందర్భంగా కోర్టు పేర్కొంది.
అసలేం జరిగిందంటే..
స్నాతకోత్సవ వేదికపై తమిళనాడు గవర్నర్, వైస్-ఛాన్సలర్ ఎన్. చంద్రశేఖర్ ఉన్నారు. విద్యార్థులు వరుసగా తమ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లను తీసుకుంటుండగా, డాక్టోరల్ డిగ్రీని స్వీకరించడానికి వచ్చిన నాగర్‌కోయిల్‌కు చెందిన జీన్ జోసెఫ్ అనే విద్యార్థిని మాత్రం గవర్నర్‌కు తన డిగ్రీని అందజేయలేదు. ఆమె దానిని నేరుగా విశ్వవిద్యాలయ వైస్-ఛాన్సలర్ చంద్రశేఖర్‌కు చూపించి, దానిని స్వీకరించింది. ఆయన నుంచి అభినందనలు స్వీకరించి వేదిక నుంచి వెళ్లిపోయింది. గవర్నర్ ఆర్ ఎన్ రవి నుంచి డిగ్రీ తీసుకోవడానికి ఆమె నిరాకరించడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. దీనికి సంబంధించి ఆ విద్యార్థిని మాట్లాడుతూ.. గవర్నర్ తమిళనాడుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నందున తాను ఆయన నుంచి డిగ్రీ పట్టా తీసుకోదలచుకోలేదని తెలిపింది. ఈ నేపథ్యంలో గవర్నర్ చేతి నుంచి డిగ్రీని స్వీకరించడానికి నిరాకరించిన విద్యార్థిని డిగ్రీని రద్దు చేయాలని కోరుతూ రామ్‌కుమార్ ఆదితన్ హైకోర్టు మధురై శాఖలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు తదుపరి విచారణను డిసెంబర్ 18కి వాయిదా వేసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.








