Azadi Ka Amrit Mahotsav: బ్రిటిష్ సైనికుల కాల్పుల్లో ఛాతిలో బుల్లెట్స్ దిగినా.. త్రివర్ణ పతాకాన్ని వదలని వీరనారి గురించి మీకు తెలుసా

కానీ ఓ వృద్ద మహిళ.. తన చేతుల్లో త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని.. ముందుకు సాగింది.. ఒకటి కాదు మూడు బుల్లెట్లు ఆమె ఛాతీకి తగిలాయి. రక్త ప్రవాహంలో తన ప్రాణాలను వదిలింది కానీ ఎక్కడా త్రివర్ణ పతాకాన్ని వదల్లేదు. ఈ ధైర్యవంతురాలు మరెవరో కాదు.. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేసిన మాతంగిని హజ్రా.

Azadi Ka Amrit Mahotsav: బ్రిటిష్ సైనికుల కాల్పుల్లో ఛాతిలో బుల్లెట్స్ దిగినా.. త్రివర్ణ పతాకాన్ని వదలని వీరనారి గురించి మీకు తెలుసా
Matangini Hazra
Surya Kala

| Edited By: Team Veegam

Jul 27, 2022 | 2:55 PM

Azadi Ka Amrit Mahotsav: మన దేశం బ్రిటిష్ వారి దాశ్య శృంఖలాలను నుంచి విముక్తి కోసం అనేకమంది వీరులు, వీరమాతలు పోరాడారు. తమ ప్రాణాలను తృణప్రాయముగా త్యజించారు. దేశం కోసం పోరాడిన ఎందరో వీరులు చరిత్ర మాటున దాగి ఉన్నారు.. అలాంటి వీరుల త్యాగాలను భావితరాలకు అందించడానికి టీవీ9 ప్రయత్నిస్తోంది. తెల్ల సైనికులు కాల్పులు జరుపుతూనే ఉన్నారు.. కానీ ఓ వృద్ద మహిళ.. తన చేతుల్లో త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని.. ముందుకు సాగింది.. ఒకటి కాదు మూడు బుల్లెట్లు ఆమె ఛాతీకి తగిలాయి. రక్త ప్రవాహంలో తన ప్రాణాలను వదిలింది కానీ ఎక్కడా త్రివర్ణ పతాకాన్ని వదల్లేదు. ఈ ధైర్యవంతురాలు మరెవరో కాదు.. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేసిన మాతంగిని హజ్రా.

మాతంగిని హజ్రా 1870 అక్టోబర్ 19న తూర్పు బెంగాల్ (ప్రస్తుతం బంగ్లాదేశ్)లోని మిడ్నాపూర్ జిల్లాలో జన్మించింది.  మాతంగిని బాల్యం పేదరికంలో గడిచింది. 12 సంవత్సరాల వయస్సులో మధ్య వయస్కుడైన వితంతువు త్రిలోచన్ హజ్రాతో మాతంగిని వివాహం జరిగింది. ఆరేళ్ల తర్వాత త్రిలోచన్ హజ్రా మరణించారు. త్రిలోచన్ మొదటి భార్య కుమారులు మాతంగిని ఇంటి నుండి గెంటేశారు. దీంతో ఆమె గుడిసెలో నివసించడం ప్రారంభించింది. ఆమె సేవ.. నిస్వార్థమైన సేవతో ప్రజల మన్నన సొంతం చేసుకుంది. ఆమెను తల్లిగా భావించి గౌరవించేవారు. మాతంగిని  గాంధీజీ ఆలోచనలకు ప్రభావితమైంది.

1932లో మాతంగిని హజ్రా ఇంటి దగ్గర  స్వాతంత్య్రం కోసం భారీ బహిరంగ సభ జరిగింది. తమ్లూక్ మార్కెట్‌లో జరిగిన సమావేశంలో ఆమెతో పాటు పలువురు పాల్గొన్నారు.  మాతంగిని స్వాతంత్య్రం ఉద్యమంలో పోరాటం చేస్తానని ప్రమాణం చేశారు. 1933 జనవరి 17న కర్బండి ఉద్యమాన్ని అణిచివేసేందుకు వచ్చిన అప్పటి గవర్నర్ ఆండర్సన్‌ కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన జరిగింది. దీనికి మాతంగిని హజ్రా నాయకత్వం వహించారు. అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం మాతంగిని హిజ్రాను అరెస్టు చేసి ఆరు నెలల జైలు శిక్ష విధించారు.

క్విట్ ఇండియా ఉద్యమంలో చేరిన మాతంగిని హజ్రా 1942లో క్విట్ ఇండియా ఉద్యమం ఊపందుకున్నప్పుడు.. మాతంగిని ఆ ఉద్యమంలో పాల్గొన్నారు. ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ కాల్పులలో ముగ్గురు ఆందోళనకారులు పోలీసు తూటాలకు మరణించారు. దీనికి నిరసనగా పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టాలని ప్రజలు నిర్ణయించారు.

1942, సెప్టెంబర్ 29న, ఆందోళనకారులు తమ్లుక్ గెస్ట్‌హౌస్‌కు చేరుకున్నారు. మాతంగిని కూడా నిరసన కారులతో పాటు నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. త్రివర్ణ పతాకంతో ముందుకు సాగుతున్న మాతంగిని పై బ్రిటిష్ సైనికులు కాల్పులు జరిపారు. ఛాతిలో మూడు బుల్లెట్స్ దిగాయి. అయినప్పటికీ ఆమె తన ప్రయాణాన్ని ఆపలేదు.. త్రివర్ణ పతాకాన్ని వదలలేదు. భారతీయ జెండాతోనే తుదిశ్వాస విడిచారు. డిసెంబరు 1974లో అప్పటి దేశ ప్రధాని ఇందిరా గాంధీ తమ్లూక్‌లో మాతంగిని హజ్రా విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu