జమ్మూ కాశ్మీర్ మాజీ మంత్రి అబ్దుల్ రహీం రాథోడ్ కొడుకు హిలాల్ రాథోడ్ జమ్మూ కాశ్మీర్ బ్యాంకుకు రూ. 177 కోట్ల ‘శఠగోపం’ పెట్టాడు. తన ‘ప్యారడైజ్ ఎవెన్యూ’ అనే కంపెనీకి రుణం అంటూ ఈ మొత్తాన్ని తీసుకుని విదేశీ పర్యటనలకు, తన వ్యక్తిగత ఆస్తుల కొనుగోలుకు ఈ సొమ్మును ఖర్చు పెట్టేశాడట. ఇండియాతో బాటు అమెరికా, దుబాయ్ దేశాల్లో ఈయన ఆస్తులు కొన్నాడని ఈడీ తెలిపింది. శ్రీనగర్, జమ్మూ,. ఢిల్లీ. లూధియానాలలో మొత్తం 17 చోట్ల ఈ దర్యాప్తు సంస్థ దాడులు నిర్వహించింది. సోదాల సందర్భంగా పలు అనుమానాస్పద డాక్యుమెంట్లను, డిజిటల్ సాక్ష్యాధారాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇదివరకటి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఆర్ధిక, గ్రామీణ, వ్యవసాయ శాఖల మంత్రిగా పని చేసిన అబ్దుల్ రహీం రాథోడ్ ప్రస్తుతం నేషనల్ కాన్ఫరెన్స్ నేతగా ఉన్నారు. ఈయన ఇంటిలోనూ, జమ్మూ లోని హిలాల్ ఇంటిలో కూడా అధికారులు సోదాలు నిర్వహించారు.
సీబీఐ, ఆదాయం పన్ను శాఖలు కూడా ఈయనపై దాఖలైన మనీ లాండరింగ్ కేసును దర్యాప్తు చేస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ బ్యాంకు ఎలాంటి డాక్యుమెంట్లనూ వెరిఫై చేయకుండానే, రిజర్వ్ బ్యాంకు గైడ్ లైన్స్ ని ఉల్లంఘించి ఇతనికి అప్పనంగా రూ. 177.68 కోట్ల రుణాన్ని మంజూరు చేసింది. జమ్మూలో తన కంపెనీ పేరిట ఇళ్ళు కడతానంటూ హిలాల్ మహాశయుడు ఈ రుణాన్ని తన సొంత జల్సాలకు వాడుకున్నాడని ఈడీ ఇన్వెస్టిగేషన్ లో వెల్లడైంది. ఇతగాడు ఈ బ్యాంకు అధికారులతో కలిసి క్రిమినల్ కుట్రకు పాల్పడ్డాడని తెలిసింది. ఆదాయపు పన్నును చెల్లించకుండా ఎగగొట్టాడన్న ఆరోపణపై గత ఏడాది జూన్ లో ఇతనిపై ఐటీ శాఖ దాడి చేసింది. అయినా మనోడు బెదరడంలేదు.