భారత్ – పాకిస్తాన్ సరిహద్దులో మరోసారి డ్రోన్ సంచారం కలకలం రేపింది. అమృత్సర్ ప్రాంతంలో ఇంటర్నేషనల్ బోర్డర్ కు సమీపంలో డ్రోన్ కనిపించడం సంచలనంగా మారింది. వెంటనే అలర్ట్ అయిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఒక డ్రోన్‌ను కూల్చివేసింది. దానిని క్వాడ్-కాప్టర్ డ్రోన్ గా అధికారులు గుర్తించారు. ఈ సరిహద్దులో గత మూడు రోజుల్లో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోది కావడం గమనార్హం. 12 కిలోల బరువున్న ఈ డ్రోన్‌లో నాలుగు ప్రొపెల్లర్లు ఉన్నాయి. అమృత్సర్ సెక్టార్‌లోని రానియా సరిహద్దు పోస్ట్ సమీపంలో రాత్రి 9.15 గంటల ప్రాంతంలో బీఎస్ఎఫ్ 22వ బెటాలియన్‌కు చెందిన సైనికులు అడ్డగించి కాల్చేశారు. డ్రోన్ ద్వారా రవాణా చేసిన వస్తువులు, పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా.. డ్రోన్ సంచారంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అక్టోబరు 13-14 మధ్య రాత్రి జరిగిన ఇలాంటి సంఘటనలో పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ సెక్టార్లో BSF పెద్ద పాకిస్తాన్ కు చెందిన డ్రోన్‌ను కూల్చివేశారు.
గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. పేలుడు పదార్థాలతో భారత భూభాగంలోకి ప్రవేశించిన పాకిస్తానీ డ్రోన్‌ను భద్రతా బలగాలు కూల్చివేశాయి. జమ్మూకశ్మీర్ లోని హరియా చక్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. రాజ్‌బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తల్లి హరియా చక్ ప్రాంతంలోని సరిహద్దులో ఉదయం డ్రోన్ కదలికను పోలీసులు గుర్తించారు. దానిపై కాల్పులు జరిపి నేలకూల్చింది. అయితే డ్రోన్‌కు పేలుడు పదార్థాలను గుర్తించిన అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. వెంటనే రంగంలోకి దిగిన స్క్వాడ్ డ్రోన్ బాంబును నిర్వీర్యం చేసింది.
మరోవైపు.. గత కొన్ని రోజులుగా భారత సరిహద్దుల్లో పాకిస్తాన్ డ్రోన్లు అలజడి రేపుతున్నాయి. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. పాకిస్తాన్ నుంచి డ్రోన్లు భారత భూభాగంలోకి ప్రవేశిస్తుండటంతో అధికారులు భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..