Maharashtra crisis: మహారాష్ట్ర కొత్త సీఎంగా దేవేంద్ర ఫడ్నవిస్.. ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే?

బల పరీక్షపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో ఉద్దవ్ థాకరే సీఎం పదవికి బుధవారం రాత్రి రాజీనామా చేయడం తెలిసిందే. దీంతో మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ నేతలు సన్నాహాలు మొదలుపెట్టారు.

Maharashtra crisis: మహారాష్ట్ర కొత్త సీఎంగా దేవేంద్ర ఫడ్నవిస్.. ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే?
Devendra Fadnavis And Eknat
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Jun 30, 2022 | 3:57 PM

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సన్నాహాలు షురూ చేసింది. బల పరీక్షపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో ఉద్దవ్ థాకరే సీఎం పదవికి బుధవారం రాత్రి రాజీనామా చేయడం తెలిసిందే. దీంతో అక్కడ కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ నేతలు సన్నాహాలు మొదలుపెట్టారు. బీజేపీ వర్గాల సమాచారం మేరకు దేవేంద్ర ఫడ్నవిస్ మూడోసారి ఆ రాష్ట్ర సీఎంగా గురువారం రాత్రి 7 గంటలకు పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శివసేన రెబల్ నేత ఏక్‌నాథ్ శిండే డిప్యూటీ సీఎం కానున్నారు. మంత్రివర్గ కూర్పు, ఇతర అంశాలపై దేవేంద్ర ఫడ్నవిస్, ఏక్‌నాథ్ శిండే సమావేశమై నిర్ణయం తీసుకుంటారని బీజేపీ మహారాష్ట్ర చీఫ్ చంద్రకాంత్ పాటిల్ మీడియాకు తెలిపారు.

ఉద్దవ్ థాకరే రాజీనామాతో అందరి దృష్టి ఇప్పుడు మహారాష్ట్ర రాజ్ భవన్‌పై నెలకొంటోంది. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని మహారాష్ట్ర గవర్నర్ భగవత్ సింగ్ కోశ్యారి ఎప్పుడు ఆహ్వానిస్తారన్న అంశంపై ఆసక్తి నెలకొంటోంది. 288 మంది సభ్యులతో కూడిన మహారాష్ట్ర అసెంబ్లీలో 106 మంది ఎమ్మెల్యేలతో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలుస్తోంది. శివసేన రెబల్ నేత ఏక్‌నాథ్ శిండే తన వెంట 50 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు చెబుతున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని బీజేపీ నేతలు ఆ రాష్ట్ర గవర్నర్‌ను లాంఛనంగా కోరనున్నారు. గురువారం రాత్రి దేవేంద్ర ఫడ్నవిస్ గవర్నర్‌ను నేరుగా కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు. తనకు మద్ధతు ఇస్తున్న ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన పత్రాన్ని గవర్నర్‌కు అందజేయనున్నారు. గవర్నర్ ఆహ్వానం అందితే శుక్రవారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేసే అవకాశముంది.

ప్రస్తుతం ఏక్‌నాథ్ శిండే, తన వర్గం ఎమ్మెల్యేలతో గోవా హోటల్‌లో ఉన్నారు. ముంబైకి బయలుదేరి వెళ్లే ముందు ఆయన తన వర్గం ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. మధ్యాహ్నంపైన ఎక్‌నాథ్ శిండే‌తో పాటు ఆయన వర్గం ఎమ్మెల్యేలు ముంబై చేరుకోనున్నారు. ఏక్‌నాథ్ శిండే ప్రభుత్వ ఏర్పాటుపై నేరుగా బీజేపీ నేతలతో చర్చించనున్నారు. ఏక్‌నాథ్ శిండేతో పాటు ఆయన వర్గం ఎమ్మెల్యేలు ముంబై చేరుకునే సందర్భంలో వారికి భారీ బందోబస్తు ఏర్పాట్లు కల్పించనున్నారు.

ఇవి కూడా చదవండి

అటు బీజేపీ నేతలు మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ నివాసంలో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తారు. పార్టీ ఎమ్మెల్యేలు అందరూ ముంబైలో అందుబాటులో ఉండాలని ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి