Coronavirus In India :దేశంలో కరోనా విలయతాండవం.. ఆగని ఉద్ధృతి.. మళ్లీ లాక్‌డౌన్‌ తప్పదా.?

Lockdown again in india : సుషుప్తావస్థలోకి చేరుకుందనుకున్న కరోనా మహమ్మారి ఒక్కసారిగా నిద్రలేచింది.. జడలు విప్పుకుని ప్రపంచాన్ని మరోసారి వణికిస్తోంది.. అడ్డూ అదుపూ లేకుండా విస్తరిస్తున్న ఆ వైరస్‌ మనుషుల ప్రాణాలను మింగేస్తోంది..

  • Balu
  • Publish Date - 12:49 pm, Thu, 8 April 21
Coronavirus In India :దేశంలో కరోనా విలయతాండవం.. ఆగని ఉద్ధృతి.. మళ్లీ లాక్‌డౌన్‌ తప్పదా.?
Coronavirus In India

సుషుప్తావస్థలోకి చేరుకుందనుకున్న కరోనా మహమ్మారి ఒక్కసారిగా నిద్రలేచింది.. జడలు విప్పుకుని ప్రపంచాన్ని మరోసారి వణికిస్తోంది.. అడ్డూ అదుపూ లేకుండా విస్తరిస్తున్న ఆ వైరస్‌ మనుషుల ప్రాణాలను మింగేస్తోంది.. కరోనా తీవ్రతకు రోజు రోజుకూ కేసులు పెరుగుతున్నాయి.. మన నిర్లక్ష్యం, మన ఉదాసీనత కరోనా విస్తరించడానికి ప్రధాన కారణం. వైద్య నిపుణులు నెత్తి నోరు మొత్తుకుని చెప్పినా చెవికెక్కించుకోని అతి విశ్వాసమే మళ్లీ ఆ వైరస్‌ చెలరేగడానికి కారణమయ్యింది.. కరోనా భూతాన్ని సీసాలో బంధించే ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాయి.. కరోనాను నిరోధించే వ్యాక్సిన్‌ కూడా అందరికీ అందుబాటులోకి వచ్చేందుకు కొద్ది సమయం పడుతుంది.. ఈ సమయమే అత్యంత కీలకం.. ఇక్కడ మనం తప్పటడుగు వేస్తే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది..

భారత్‌లో కరోనా కేసుల సంఖ్య అమాంతంగా పెరుగుతోంది. ఎన్నడూ లేని విధంగా గంటకు సుమారు అయిదు వేల కేసులు నమోదవుతున్నాయి.. రోజుకు కొత్తగా లక్ష కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగించే అంశమే! ఛత్తీస్‌గఢ్‌, గుజరాత్‌లలో ఎన్నడూ లేని స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. 18 రాష్ట్రాలలో కరోనా కరాళనృత్యం చేస్తోంది. ఒక్క రోజు వ్యవధిలోనే సుమారు 650 మంది చనిపోయారు. నవంబర్‌ ఆరు తర్వాత ఇంత భారీ సంఖ్యలో బాధితులు మరణించడం ఇదే మొదలు. గత నాలుగు రోజులుగా ప్రపంచంలో ఏ దేశంలో లేనన్ని కొత్త కేసులు ఇక్కడ నమోదవుతున్నాయి. 80 శాతానికి పైగా కొత్త కేసులు ఎనిమిది రాష్ట్రాలలోనే ఉండటం గమనార్హం. ఒక్క మహారాష్ట్రలోనే 55 వేలకు పైగా కేసులు వచ్చాయి. ఇక ఛత్తీస్‌గఢ్‌, కర్నాకట, ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీ, మధ్యప్రదేశ్‌, తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో కూడా కేసుల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఎక్కువ మరణాలు మహారాష్ట్రలోనే చోటు చేసుకుంటున్నాయి. పంజాబ్‌, ఛత్తీస్‌గఢ్‌, కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాలలోనూ గతంతో పోల్చితే మరణాల సంఖ్య పెరిగింది.

Coronavirus In India 2

Coronavirus In India 

మొన్నటి వరకు కరోనా భూతాన్ని చాలా తేలిగ్గా తీసుకున్నాం.. వస్తే ఏమవుతుందిలేనన్న నిర్లక్ష్యం మన కొంప ముంచింది. అందుకు ఫలితమే మరోసారి కరోనా విస్ఫోటం. గత సంవత్సరపు లాక్‌డౌన్‌ చేదు అనుభవాల నుంచి ఇంకా బయటపడక ముందే మళ్లీ ఆ కఠిన ఆంక్షల వచ్చిపడతాయేమోనన్న భయం పుడుతోంది. లాక్‌డౌన్‌ కారణంగా చాలామంది జీవితాలు తలకిందులయ్యాయి.. ఆర్ధిక వ్యవస్థ కుదేలయ్యింది.. వలస కూలీల పరిస్థితి దయనీయంగా మారింది. తినడానికి తిండిలేక అవస్థలు పడ్డారు. ప్రస్తుతం కరోనా విజృంభణ చూస్తుంటే మళ్లీ ఆ దుర్దినాలు, ఆ దుస్థితి తలెత్తబోతున్నదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. చాలా రాష్ట్రాలలో ఆంక్షలు మొదలయ్యాయి. పంజాబ్‌లో రాత్రి కర్ఫ్యూ విధించారు. రాజకీయ సమావేశాలను రద్దు చేశారు. దీన్ని కాదని ఎవరైనా సమావేశాలు పెడితే డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ కింద కేసులు నమోదు చేస్తామని ముఖ్యమంత్రి అమరీందర్‌ హెచ్చరించారు కూడా! మహారాష్ట్రలో చాలా చోట్ల వారాంతపు లాక్‌డౌన్‌ అమలులోకి వచ్చింది.. కఠిన ఆంక్షలు విధించారు. 9, 11 తరగతి విద్యార్థులకు పరీక్షలు రద్దు చేశారు. అందరినీ పాస్‌ చేశారు. బెంగళూరులో 144 సెక్షన్‌ అమలులోకి వచ్చింది. అక్కడ కూడా భారీ ర్యాలీలు, ప్రదర్శనలు బందయ్యాయి. అపార్ట్‌మెంట్లు, విల్లాలలో ఉండే స్విమ్మింగ్‌పూల్స్‌, జిమ్‌లు కూడా క్లోజ్‌ చేశారంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థమవుతుంది.

కరోనా మొదటి వేవ్‌తో పోల్చి చూస్తే యాక్టివ్‌ కేసుల సంఖ్య మూడు రేట్ల వేగంతో పెరిగిపోతుండటం నిజంగానే ఆందోళన కలిగించే విషయం. మన దగ్గర గత ఏడాది ఫిబ్రవరిలో మొదలైన కరోనా మొదటి వేవ్‌ సెప్టెంబర్‌ వరకు కొనసాగింది.. ఈ మధ్య కాలంలోనే ఎంతో మంది ప్రాణాలను బలితీసుకుంది ఆ మహమ్మారి.. ఎంతోమందిని వ్యాధిగ్రస్తులను చేసింది. లేనిపోని జబ్బులను అంటగట్టింది. ఇప్పుడు మళ్లీ ఫిబ్రవరిలోనే సెకండ్‌ వేవ్‌ మొదలయ్యింది.. ఈసారి కూడా ఎంతో మంది ఊపిరి ఆగిపోయే ప్రమాదం ఉందన్న సూచనలు కనిపిస్తున్నాయి. లాస్టియర్‌తో పోలిస్తే ఈసారి మరింత డేంజర్‌గా ఉంది కరోనా.. అప్పట్లో కరోనా అంటే జనానికి విపరీతమైన భయం ఉంది.. పైగా లాక్‌డౌన్‌ కూడా ప్రజలను ఇంట్లోంచి బయటకు రాకుండా చేసింది. కరోనా పట్ల పూర్తి జాగ్రత్తలు తీసుకున్నారు. మాస్క్‌లు పెట్టుకున్నారు. భౌతిక దూరాన్ని పాటించారు. లాక్‌డౌన్‌ తర్వాత పరిస్థితి పూర్తిగా మారింది. ఇప్పుడు కరోనా అంటే భయంపోయింది. మాస్క్‌లు పెట్టుకోకపోతే ఏమవుతుందన్న నిర్లక్ష్యం పెరిగింది. నిబంధనలకు తూట్లు పొడిచారు. జాగ్రత్తలను గాలికి వదిలేశారు. అందుకే సెకండ్‌వేవ్‌లో చాలా తక్కువ సమయంలో ఎక్కువ మందికి కరోనా సోకుతున్నది. మొదటిసారి 10 వేల కేసులు నుండి 80 వేల కేసులు దాకా రావటానికి 84 రోజులు పడితే, ఈసారి అది 42 రోజుల్లోనే రావడం ఇందుకు పెద్ద ఉదాహరణ. ఫస్ట్‌వేవ్‌లో వయసు మీరిన వారికే కరోనా ఎక్కువగా సోకింది. ఇప్పుడు మాత్రం యుక్తవయస్కులూ, పిల్లలు కూడా కొంచెం ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడటం కనిపిస్తోంది.
మరిన్ని చదవండి ఇక్కడ : Interesting News : ఎన్నికల బరిలో 92సార్లు పరాజయం పాలయ్యారు, అయినా వెనక్కి తగ్గడం లేదు..
S.P.KODANDAPANI : తెలుగుపాటకు స్పీడ్‌ పెంచిన సంగీత దర్శకుడు ఎస్పీ కోదండపాణి.