కొత్త వివాదం.. రాష్ట్రపతి ముర్ము ప్రమాణస్వీకార కార్యక్రమంలో మల్లికార్జున ఖర్గేకు అవమానం జరిగిందా?

రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము సోమవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేకు అవమానం జరిగిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.

కొత్త వివాదం.. రాష్ట్రపతి ముర్ము ప్రమాణస్వీకార కార్యక్రమంలో మల్లికార్జున ఖర్గేకు అవమానం జరిగిందా?
Droupadi MurmuImage Credit source: TV9 Telugu
Follow us

|

Updated on: Jul 25, 2022 | 6:19 PM

President of India Draupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకార కార్యక్రమంపై కాంగ్రెస్ పార్టీ కొత్త వివాదాన్ని తెరమీదకు తీసుకొచ్చింది. రాష్ట్రపతి భవన్‌లో సోమవారం ఉదయం ద్రౌపది ముర్ము చేత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ రాష్ట్రపతిగా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, పలు రాష్ట్రాల గవర్నర్లు, కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. అటు కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే సైతం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాగా రాష్ట్రపతి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మల్లికార్జున ఖర్గేకు తీవ్ర అవమానం జరిగిందంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఉద్దేశపూర్వకంగానే కేంద్రం ఆయన్ను అవమానించిందంటూ అభ్యంతరం తెలిపింది.

ఆ మేరకు రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడుకు విపక్షాలు రాజ్యసభ సభ్యులు లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. ఈ లేఖలో కాంగ్రెస్, ఎన్సీపీ, టీఎంసీ, శివసేన, సీపీఎం, సీపీఐ, ఆర్జేడీ సహా పలు విపక్ష నేతలు సంతకాలు చేశారు. ఈ లేఖను కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. రాష్ట్రపతి ముర్ము ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మల్లికార్జున ఖర్గేకు కల్పించిన సీటింగ్‌పై వారు అభ్యంతరం వ్యక్తంచేశారు. ఆయన హోదాకు తగినట్లు సీటింగ్ ఏర్పాటు చేయలేదని ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే మల్లికార్జున ఖర్గేను అవమానించేలా సీటింగ్ ఏర్పాటు చేశారని ఆరోపించారు. ఈ విషయంలో ప్రోటోకాల్‌ను ఉల్లంఘించారని, దీని పట్ల తాము తీవ్ర అసంతృప్తి చెందినట్లు ఆ లేఖలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

రాజ్యసభ ఛైర్మన్‌కి విపక్ష నేతలు పంపిన ఫిర్యాదు లేఖ..

Draupadi Murmu's oath-taking ceremony

Draupadi Murmu’s oath-taking ceremony

కాంగ్రెస్ ఆరోపణలపై స్పందించిన బీజేపీ..

విపక్షాల ఫిర్యాదుపై స్పందించిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ.. తొలి వరుసలో మల్లికార్జున ఖర్గేకు సీటింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్నర్‌లో ఉన్నట్లు ఆయన అసంతృప్తి వ్యక్తంచేసిన వెంటనే.. మధ్యలోకి వెళ్లాలని రాష్ట్రపతి భవన్ అధికారులు సూచించినట్లు వెల్లడించారు. అయితే మధ్యలోకి వెళ్లేందుకు స్వయంగా ఖర్గే నిరాకరించినట్లు తెలిపారు. శనివారం జరిగిన రాంనాథ్ కోవింద్ వీడ్కోలు కార్యక్రమానికి ఖర్గేను కూడా ఆహ్వానించి.. ప్రధాని నరేంద్ర మోదీకి దగ్గర్లో సీటింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అయితే కార్యక్రమానికి ఆయన గైర్హాజరయ్యారని చెప్పారు. ఈ కార్యక్రమానికి హాజరుకాకపోవడం ద్వారా రాష్ట్రపతి పదవిని వీడుతున్న కోవింద్‌ను మల్లికార్జున ఖర్గే అవమానించారని విమర్శించారు.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి..