
దేశ రాజధాని ఢిల్లీ పేరు మారే చాన్స్ ఉందా? ఢిల్లీ పేరును ఇంద్రప్రస్థగా మార్చాలంటూ ఇప్పటికే విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. లేటెస్టుగా భారతీయ జనతా పార్టీ ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్ ఇదే డిమాండ్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీ. వందల వేల ఏళ్ల చరిత్ర ఉన్న చారిత్రక నగరం. మనకు స్వాతంత్ర్యం రాకముందు ఢిల్లీ రాజధానిగా బ్రిటీషర్లు, అంతకుముందు మొఘల్స్, అంతకుముందు ఢిల్లీ సుల్తానేట్, ఇంకా ముందు పృధ్వీరాజ్ చౌహాన్ లాంటి రాజపుత్ర వీరులు ఢిల్లీ రాజధానిగా పరిపాలించారు. చరిత్ర పొరలను తవ్వుకుంటూ వెళితే, ఇది మహా భారత కాలానికి చేరుతుందని చెబుతారు. భారతంలో పాండవులు పరిపాలించిన ఇంద్రప్రస్థ ఇదేనని హిందువుల నమ్మకం.
ఢిల్లీ పేరును ఇంద్రప్రస్థగా మార్చడం ద్వారా, అది మన దేశ చారిత్రక, సాంస్కృతిక, నాగరికత మూలాలను ప్రతిబింబిస్తుందని బీజేపీ ఎంపీ ఖండేల్వాల్ చెబుతున్నారు. ఓల్డ్ ఢిల్లీ రైల్వేస్టేషన్, అంతర్జాతీయ విమానాశ్రయాల పేర్లను కూడా మార్చాలని ఆయన డిమాండ్ చేశారు. దేశ రాజధానిలో పాండవుల విగ్రహాలను ఏర్పాటు చేయాలన్నారు. ఈమేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. మహా భారత కాలంలో పాండవులు పరిపాలించిన ఇంద్రప్రస్థ…ఇప్పటి ఢిల్లీ నగరంగా మారిందని హిందూ సంఘాలు చెబుతున్నాయి.
ఢిల్లీ పేరు మార్పు డిమాండ్‌కు మద్దతుగా వాళ్లు కొన్ని రీజన్లు చెబుతున్నారు. యమునా తీరంలో ఇంద్రప్రస్థ నగరం నిర్మాణం జరిగిందని, పాండవుల కోసం దేవశిల్పి విశ్వకర్మ దీన్ని నిర్మించారని మహా భారతం చెబుతోంది. ఇక ఢిల్లీలోని పురానా ఖిల్లా ప్రాంతమే ఇంద్రప్రస్థ అని హిందుత్వ సంఘాలు అభిప్రాయ పడుతున్నాయి. ఢిల్లీ నగర మూలాలు ఇంద్రప్రస్థలో ఉన్నాయనే వాదనను వాళ్లు ముందుకు తెస్తున్నారు. ఢిల్లీ పేరును ఇంద్రప్రస్థగా మార్చడం ద్వారా, దేశ చారిత్రక, సాంస్కృతిక మూలాలను కాపాడవచ్చనే వాదన వినిపిస్తున్నారు ఇప్పుడు ఢిల్లీలో బీజేపీ అధికారంలో ఉంది. అటు కేంద్రాన్ని కూడా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పరిపాలిస్తోంది. ఈ నేపథ్యంలో.. ఢిల్లీ పేరును ఇంద్రప్రస్థగా మార్చాలనే డిమాండ్‌పై కేంద్రం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..