వారికి పరీక్షలు చేయండి.. రాష్ట్రాలకు కేంద్రం సూచనలు

కిరాణా షాపులు నిర్వహించే వారు, కూరగాయలు అమ్మేవారు, వీధి వ్యాపారుల నుంచి ఎక్కువ మందికి కరోనా వైరస్ సోకే అవకాశాలు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసింది.

వారికి పరీక్షలు చేయండి.. రాష్ట్రాలకు కేంద్రం సూచనలు
Follow us

| Edited By:

Updated on: Aug 08, 2020 | 3:44 PM

Centre on Corona tests: కిరాణా షాపులు నిర్వహించే వారు, కూరగాయలు అమ్మేవారు, వీధి వ్యాపారుల నుంచి ఎక్కువ మందికి కరోనా వైరస్ సోకే అవకాశాలు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో వారికి కరోనా పరీక్షలు నిర్వహించాలని అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచనలు జారీ చేసింది. దాని ద్వారా కరోనా కేసులను ముందుగానే గుర్తించడంతో పాటు మరణాల సంఖ్యను తగ్గించొచ్చని తెలిపింది. ఈ మేరకు ఆరోగ్య శాఖ సెక్రటరీ రాజేష్ భూషణ్ లేఖ రాశారు. అలాగే ఆక్సిజన్ సదుపాయంతో కూడిన అంబులెన్స్‌లు, సత్వరం స్పందించే యంత్రాంగం కూడా అవసరమని ఆ లేఖలో రాజేష్‌ వెల్లడించారు.

అంబులెన్స్‌లు తిరస్కరించే కేసులు రోజుకు ఒక్కటి కూడా లేకుండా చూడాలని, ఈ వ్యవహారంపై అధికారులు స్వయంగా పర్యవేక్షించాలని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు కొత్త ప్రాంతాల్లో కరోనా కేసులు నమోదవుతున్నందున అక్కడ వ్యాధి వ్యాప్తి ఎక్కువ కాకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఇక రోగుల ప్రాణాలు కాపాడేందుకు సర్వశక్తులూ ప్రయోగించాలని భూషణ్ అన్నారు. ”కరోనా కేసులను ఎంత త్వరగా గుర్తిస్తే, అంత త్వరగా వ్యాప్తికి అడ్డుకట్ట వేయొచ్చు. దాని ద్వారా ఇన్ఫెక్షన్‌కి గురైన వారి పరిస్థితి విషమించకుండా కాపాడుకోవచ్చు. వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చు” అని రాజేష్ భూషణ్ వెల్లడించారు. ఆసుపత్రుల్లో బెడ్‌ల కొరత లేకుండా చూడాలని, తగినన్ని వెంటిలేటర్లను అందుబాటులో ఉంచాలని రాష్ట్రాలకు ఆయన సూచించారు.

Read This Story Also: కరోనాను జయించిన అభిషేక్ బచ్చన్‌