కులం లెక్కలేసుకుంటున్న తెలంగాణ జాతీయపార్టీలు.. అధ్యక్షుడి ఎంపికలో కాంగ్రెస్‌, బీజేపీ తలమునకలు

తెలంగాణలో రెండు ప్రధాన జాతీయపార్టీలు ఇప్పుడు అధ్యక్షుడి ఎంపికలో తలమునకలై ఉన్నాయి.. అధ్యక్షుడు ఎంపికలో రెండూ పార్టీలు సామాజిక సమీకరణాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టాయి.. పనిలోపనిగా అటు కాంగ్రెస్‌, ఇటు బీజేపీ ఎవరికి వారు ప్రత్యర్థి నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాయి.. ప్రత్యర్థి పార్టీ ఎంపిక చేసిన తర్వాత అందుకు తగిన ప్రతివ్యూహంతో తాము తమ రాష్ట్ర పార్టీ అధ్యక్షుణ్ణి ఎంపిక చేయాలని పథకరచన చేస్తున్నాయి. ముందుగా శతాబ్దానికి పైగా రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని గమనిస్తే.. […]

కులం లెక్కలేసుకుంటున్న తెలంగాణ జాతీయపార్టీలు.. అధ్యక్షుడి ఎంపికలో కాంగ్రెస్‌, బీజేపీ తలమునకలు
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Feb 11, 2020 | 10:28 AM

తెలంగాణలో రెండు ప్రధాన జాతీయపార్టీలు ఇప్పుడు అధ్యక్షుడి ఎంపికలో తలమునకలై ఉన్నాయి.. అధ్యక్షుడు ఎంపికలో రెండూ పార్టీలు సామాజిక సమీకరణాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టాయి.. పనిలోపనిగా అటు కాంగ్రెస్‌, ఇటు బీజేపీ ఎవరికి వారు ప్రత్యర్థి నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాయి.. ప్రత్యర్థి పార్టీ ఎంపిక చేసిన తర్వాత అందుకు తగిన ప్రతివ్యూహంతో తాము తమ రాష్ట్ర పార్టీ అధ్యక్షుణ్ణి ఎంపిక చేయాలని పథకరచన చేస్తున్నాయి. ముందుగా శతాబ్దానికి పైగా రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని గమనిస్తే.. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ)కి కొత్త అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ దాదాపు పూర్తి చేసింది. అధ్యక్ష పదవి కోసం పార్టీలోని సీనియర్లు, జూనియర్లు, ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన నేతలు ఎవరికి వారుగా గట్టి ప్రయత్నాలు చేసుకున్నారు. ఇంకా చెప్పాలంటే ప్రకటన వెలువడే చివరి నిమిషం వరకు ఈ ప్రయత్నాలు కొనసాగుతూనే ఉంటాయి. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా.. అధిష్టానం పెద్దలకు ఉండే లెక్కలు వేరు. వాటికి తగ్గట్టు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి ఎంపిక కసరత్తు చేస్తూ ఉంటారు. కాంగ్రెస్ పార్టీలో ఈ తరహా సామాజిక సమీకరణాలు, ఓటు బ్యాంకు లెక్కలు ఏ పార్టీతో పోల్చి చూసినా కాస్త ఎక్కువగానే ఉంటాయి.

ఏఐసీసీ వర్గాల సమాచారం ప్రకారం తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి జాబితాను వడపోసి 3-4 పేర్లతో తుది జాబితా సిద్ధం చేసినట్టు తెలిసింది. అందులో నుంచి ఒకరి పేరును త్వరలో ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. పొరుగు రాష్ట్రం, అందులోనూ తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పీసీసీ ఎంపిక విషయంలో అధినేతలకు పెద్దగా ఇబ్బందులేవీ రాలేదు. అందుక్కారణం ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పతనమైన స్థితిలో ఉండడమే. దీంతో అధ్యక్షపదవికి ఆశావహులు, పోటీదారులు పెద్దగా లేకపోవడంతో అధిష్టానానికి పెద్ద సమస్య లేకుండా ఎంపిక చేయడం సులభతరమైంది. కానీ తెలంగాణ రాష్ట్రం విషయంలో అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ ఉంది. అధికార పార్టీకి ప్రధాన రాజకీయ ప్రత్యర్థిగా ఉంది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన క్రెడిట్ కూడా ఆ పార్టీకి ఉంది. అందుకే అంతో ఇంతో దక్షిణాది రాష్ట్రాల్లో కేరళ, కర్ణాటకతో పాటు తెలంగాణ రాష్ట్రం ఆ పార్టీకి కీలకంగా మారింది. అందుకే అధ్యక్షుడి ఎంపిక కోసం కసరత్తు ఎక్కువగా చేయాల్సి వస్తోంది.

సామాజిక సమీకరణాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా బలమైన సామాజికవర్గంగా ఉన్న రెడ్లలో అత్యధిక శాతం కాంగ్రెస్ పార్టీ వెంట ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఆ వర్గం నేతలు కాంగ్రెస్ పార్టీని తమ సొంత పార్టీగా భావిస్తారు. ప్రస్తుత టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఆ వర్గానికి చెందినవారే. పీసీసీ చీఫ్ రేసులో పోటీపడుతున్నవారిలో కూడా కోమటిరెడ్డి వెంకట రెడ్డి, రేవంత్ రెడ్డి సహా పలువురు ఆ వర్గానికి చెందిన నేతలున్నారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లోనూ రాజ్యాధికారానికి దూరమయ్యామనే ఆవేదనలో ఉన్న రెడ్డి వర్గం నేతలకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కాస్త ఊరట కలిగించింది. ఇప్పుడు తమ తదుపరి లక్ష్యం తెలంగాణ రాష్ట్రమే. అందుకే గతంలో ఎప్పుడూ లేనివిధంగా కులం పేరిట పార్టీలకు అతీతంగా ఆ వర్గం నేతలు భారీ బహిరంగ సభలు, సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇదంతా పక్కనపెడితే.. ఇప్పుడు టీపీసీసీ పదవి కూడా తమలో ఎవరో ఒకరికి దక్కాల్సిందేనన్న పట్టుదలతో ఉన్నారు. ఒకవేళ అలా కాకుండా అధిష్టానం ఇంకెవరికైనా ఇస్తే, ఈ వర్గం నేతలు మరో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్న భారతీయ జనతా పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. పైగా కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీ కావడంతో వారికి జాతీయ స్థాయిలో ఎదిగేందుకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు.

ఈ పరిస్థితుల్లో ఏఐసీసీ పెద్దలు కూడా రెడ్డి వర్గం నేతలకే ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి పేర్లను తుది జాబితాలో చేర్చి పరిశీలిస్తున్నట్టు సమాచారం. వీరిలో రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి రావడం, ఆయన కంటే ముందు నుంచి పార్టీలో ఉన్న సీనియర్ నేతలు రేవంత్ రెడ్డికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడాన్నే జీర్ణించుకోలేకపోవడం వంటి అంశాలను అధిష్టానం గమనించింది. పైగా తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లోనూ రేవంత్ రెడ్డి నియోజకవర్గ పరిధిలో కంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పనితీరు మెరుగ్గా ఉందని ఢిల్లీ పెద్దలు చర్చించుకుంటున్నారు. అయితే రేవంత్ రెడ్డికి యువతలో మంచి క్రేజ్ ఉండడం కలిసొచ్చే అంశం. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పార్టీ సీనియర్ల నుంచి పెద్దగా అభ్యంతరాలు లేకపోవడం ఆయనకు సానుకూలాంశం. మరి అధిష్టానం ఈ ఇద్దరిలో ఒకరిని ఖరారు చేస్తుందా.. లేక సామాజిక సమీకరణాలకు అతీతంగా శ్రీధర్‌ బాబుకు అవకాశం కల్పిస్తుందా అనే చర్చ కూడా జరుగుతోంది.

ఇక బీజేపీ విషయానికి వస్తే.. టీపీసీసీ ఎంపిక తర్వాత తమ అధ్యక్షుణ్ణి ప్రకటించాలని చూస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ లో అసంతృప్తులకు గాలమేస్తూ చేర్చుకుంటున్న బీజేపీ, ఒకవేళ టీపీసీసీ చీఫ్ పదవి రెడ్డి వర్గానికి దొరక్కపోతే వీలైనంత ఎక్కువ మందిపై ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగించి చేర్చుకోవాలని చూస్తోంది. రెడ్డి వర్గాన్ని కాంగ్రెస్ వదులుకోని పరిస్థితుల్లో తెలంగాణాలో ఇంతకాలం తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన బీసీ ఓటుబ్యాంకును బీజేపీ తమవైపు తిప్పుకునే వ్యూహంతో ఉంది. బీసీల్లో రాజకీయంగా, ఆర్థికంగా బలంగా ఉన్న మున్నూరుకాపు వర్గానికి చెందిన డా. లక్ష్మణ్ ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండడం గమనార్హం. రాష్ట్ర అధ్యక్షుడి రేసులో లక్ష్మణ్‌తో పాటు అదే సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్, ధర్మపురి అరవింద్ ముందంజలో ఉన్నారు. టీపీసీసీ చీఫ్ పదవి రెడ్డి వర్గానికి చెందిన నేతకు ఇస్తే, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఈ ముగ్గురిలో ఒకరి పేరు ఖరారవడం ఖాయమని ఢిల్లీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. లేదంటే, బీజేపీలో రెడ్డి వర్గానికి చెందిన నేతను రాష్ట్ర అధ్యక్షుడిగా చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి బలమైన రెడ్డి వర్గం నేతలపై ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగిస్తారని తెలుస్తోంది. మొత్తమ్మీద తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక విషయంలో ఢిల్లీ కేంద్రంగా ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలు చేస్తున్న కసరత్తు రాష్ట్రంలో ఆసక్తి రేకెత్తిస్తోంది.